గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 04:38:06

రిజిస్ట్రేషన్‌తోనే డైరెక్ట్‌ మ్యుటేషన్‌

రిజిస్ట్రేషన్‌తోనే డైరెక్ట్‌ మ్యుటేషన్‌

 • పంచాయతీల ప్రమేయం ఉండదు
 • ధరణి పోర్టల్‌తో ఈ-పంచాయతీ పోర్టల్‌ లింక్‌
 • రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే చేతికి మ్యుటేషన్‌
 • పంచాయతీరాజ్‌-2018 చట్టంలో సవరణ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామాల్లో ఎవరైనా ఆస్తి మార్పిడి చేసుకోవాలంటే ముందు రిజిస్ట్రేషన్‌ చేసుకొని, ఆ తర్వాత గ్రామ పంచాయతీకి వచ్చి మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకునేవారు. ఇకపై అలా కాకుండా సబ్‌రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ చేసిన వెంటనే ఆటోమెటిక్‌గా పంచాయతీ రికార్డుల్లో మ్యుటేషన్‌ అప్‌డేట్‌ అయిపోనున్నది. వ్యవసాయ భూము ల విషయానికి వస్తే తాసిల్దార్లే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, పాస్‌బుక్‌ అప్‌డేషన్‌, ధరణి (ఎక్స్‌ట్రాక్ట్‌) కాపీ ఇలా అన్నీ ఒకే దగ్గర ఇచ్చేస్తారు. పంచాయతీరాజ్‌-2018 చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా సవరణతో ఇది సాధ్యం కానున్నది.

కొత్త సవరణతో ప్రయోజనాలు ఏంటంటే..

 • ప్రస్తుతం ఈ-పంచాయతీ పోర్టల్‌లో 44.28 లక్షల ఇండ్లు నమోదై ఉన్నాయి. తాజా సవరణతో ఇండ్లతోపాటు వ్యవసాయ భూముల వివరాలన్నీ పంచాయతీలకు తెలిసిపోతాయి.  
 • రిజిస్ట్రేషన్‌లో పంచాయతీల ప్రమేయం ఉండదు. రిజిస్ట్రేషన్‌ ఫీజు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే సేకరించి, తర్వాత పంచాయతీలకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు.
 • ఆన్‌లైన్‌లో మ్యుటేషన్‌కు అనుగుణంగా ఆస్తులు ఎవరి పేరుమీద ఉంటే వారి నుంచి ప్రతి సంవత్సరం పన్నులు వసూలు చేస్తారు. 
 • వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు చేస్తే వాటిని వ్యవసాయేతర భూములుగా పంచాయతీ రికార్డుల్లో మార్పు చేసుకొని పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. 
 • కొన్న వెంటనే పాసుబుక్‌లో పేరు మారిపోతుంది. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన నిమిషాల్లోనే మ్యుటేషన్‌ చేసి పాస్‌బుక్‌ ప్రింట్‌ చేసి ఇస్తారు. 
 • పట్టాదారు పాసుబుక్కుల్లో వారసుల వివరాలు పొందుపరచి ఉంటాయి. దీంతో ఆ భూమి యాజమాని, వారి వారసులు ఎవరనేది తెలిసిపోతుంది. 
 • ఏది ప్రభుత్వ భూమి? ఏది ప్రైవేటు ల్యాండ్‌? ఏది నిషేధిత జాబితాలోని భూమి? అనేది ఆన్‌లైన్‌లోనే తెలిసిపోతుంది.
 • బహుమతి, వారసత్వం, ఇతర చట్టాల ద్వారా బదిలీ అయిన వ్యవసాయేతర భూముల రికార్డులు ధరణి నుంచి పం చాయతీ రికార్డుల్లో వచ్చేస్తాయి.

logo