e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home Top Slides భూ సమీకరణ పథకం సక్సెస్‌

భూ సమీకరణ పథకం సక్సెస్‌

  • ప్రైవేటు భూముల్లో ప్రభుత్వ లేఅవుట్లు
  • రైతులతో హెచ్‌ఎండీఏ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌
  • ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యం

మొదటి దశ
ఇన్ముల్‌ నర్వ: 75 ఎకరాలు 20 మంది రైతులు
లేమూర్‌:80 ఎకరాలు 28 మంది రైతులు

రెండోదశ
దండుమైలారం: 300 ఎకరాలు,
బోగారం: 110 ఎకరాలు

- Advertisement -

హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ అంటే తిరుగులేని లేఅవుట్‌గా మార్కెట్‌లో పేరున్నది. గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టూ 7 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న హెచ్‌ఎండీఏ పరిధిలో ఏర్పాటుచేసే వెంచర్లన్నీ మాస్టర్‌ప్లాన్‌ నిబంధనలకు అనుగుణంగా ఉండటంతో.. అందులో ప్లాట్‌ కొనుగోలు చేస్తే అన్ని రకాలుగా సురక్షితమైనవి, విలువతో కూడుకున్నవిగా భావిస్తారు. హెచ్‌ఎండీఏనే స్వయంగా రైతుల నుంచి భూములను సమీకరించి అన్ని మౌలిక వసతులతో వెంచర్లను అభివృద్ధి చేస్తే ఇక తిరుగుండదు కదా.. భూ సమీకరణ పథకం విజయవంతంతో అటు రైతులకు, ఇటు ప్లాట్లు కొనుగోలు చే సేవారికి ప్రయోజనం దక్కనున్నది.

హైదరాబాద్‌ సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): భూ సమీకరణ పథకం విజయవంతం దిశగా సాగుతున్నది. రైతుల నుంచి నేరుగా భూములను సమీకరించి వారి అంగీకారంతో, వారి భాగస్వామ్యంతో లే అవుట్లను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) సిద్ధమయింది. గ్రేటర్‌ శివారు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ లక్ష్యంగా అన్ని మౌలిక వసతులతో కూడిన లేఅవుట్ల అభివృద్ధికి నిర్ణయించింది. భూ సమీకరణ పథకం (ల్యాండ్‌ పూలింగ్‌స్కీం)లో భాగంగా ముందుగా రెండుచోట్ల భారీ లేఅవుట్లకు ప్రతిపాదనలు సిద్ధంచేసింది. శ్రీశైలం జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా కందుకూర్‌ మండల పరిధిలోని లేమూర్‌తో 80 ఎకరాలు, బెంగళూరు జాతీయ రహదారిపై కొత్తూరు మండల పరిధి ఇనుముల్‌ నర్వ రెవెన్యూపరిధిలో 75 ఎకరాల్లో లేఅవుట్‌ అభివృద్ధికి హెచ్‌ఎండీఏ అధికారులు వారంలో రైతులతో డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేసుకోనున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్‌పూలింగ్‌ స్కీం నిబంధనలకు అనుగుణంగా రైతుల నుంచి ఒకేచోట 50 ఎకరాలకుపైగా భూమిని సమీకరించి, అత్యున్నత ప్రమాణాలు, మౌలిక వసతులతో లేఅవుట్లను అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేసిన ప్లాట్లలో 60 శాతం రైతులకు, 40 శాతం హెచ్‌ఎండీకే చెందేలా ఒప్పందం కుదుర్చుకొంటారు. రెండోదశలో దండుమైలారంలో 300, బోగారంలో 110 ఎకరాల్లో భారీ లేఅవుట్లు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే నోటిఫికేషన్లు జారీచేసి, రైతుల అంగీకారంతో భూమిని సేకరించే పనిలో ఉన్నది. దాదాపు దశాబ్దకాలంగా ప్రతిపాదనల్లో ఉన్న ఈ పథకం ఎట్టకేలకు కార్యరూపం దాల్చడంతో శివారు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ జరగడమే కాకుండా.. మెరుగైన మౌలికవసతులు కూడా అందుబాటులోకి రానున్నాయి.

భూసమీకరణ పథకంలో మొదటి అడుగు
కొత్తగా మార్గదర్శకాలను చేర్చి తెలంగాణ ప్రభుత్వం 2017లో భూ సమీకరణ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఒకేచోట 50 ఎకరాలకుపైగా సమీకరించి అభివృద్ధి చేసిన లేఅవుట్లలో 60 శాతం రైతులకు, 40 శాతం హెచ్‌ఎండీఏకు వాటా ఉంటుంది. గతంలో ల్యాండ్‌పూలింగ్‌స్కీం కింద ఇది 50: 50గా ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం 60:40గా ఖరారుచేస్తూ జీవో తెచ్చింది. 60 శాతం ఇస్తుండటంతో హెచ్‌ఎండీఏ పరిధిలోని పలు గ్రామాల రైతులు భూములను ఇచ్చేందుకు ముందుకొచ్చారు. లేఅవుట్‌ అభివృద్ధిలో భాగంగా మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు, మంచినీటి వసతి. పార్కులు వంటి అభివృద్ధి చేస్తారు. భూమలు ఇచ్చేవారికి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అనుమతులకు సంబంధించిన అన్ని వ్యవహారాన్ని హెచ్‌ఎండీఏనే నిర్వహిస్తుంది. ప్రధానంగా నాలా, ల్యాండ్‌యూజ్‌ కన్వర్షన్‌ చార్జీలను భరిస్తుంది. స్థానికంగా భూములకు నిర్దిష్టమైన ధరలు, అమ్మకందారులు, కొనుగోలుదారులకు పూర్తిస్థాయి భరోసా, స్థిరాస్తుల పెట్టుబడులకు శాశ్వత భద్రత దక్కనున్నది.

భూ సమీకరణ పథకం ప్రయోజనాలు

రైతుల భూములకు హెచ్‌ఎండీఏ అభివృద్ధిచేసిన స్థలాలుగా బ్రాండ్‌ వ్యాల్యూ లభిస్తుంది. ఇతర జాగలతో పోలిస్తే అదనపు విలువ లభిస్తుంది.
తాగునీరు, విద్యుత్తు, పార్కులు, డ్రైనేజీవంటి మౌలిక వసతులతో కలిగిన హౌజింగ్‌ ప్లాట్లు రైతులకు దక్కుతాయి. అవసరాల మేరకు తమకు వచ్చిన ప్లాట్లను అభివృద్ధి లేదా అమ్ముకొనే అవకాశం ఉంటుంది.
నగరం ప్రణాళికాబద్ధంగా విస్తరిస్తుంది. అభివృద్ధి చేసిన భూములు చాలా మార్కెట్‌లోకి వస్తాయి.
బిల్డింగ్‌ పర్మిషన్‌కు అనుమతులు త్వరితగతిన లభిస్తాయి.
రైతులు, భూ యాజమానులు, హెచ్‌ఎండీఏ మధ్య పారదర్శకంగా ఒప్పందం జరుగుతుంది. ఎలాంటి మధ్యవర్తులు ఉండరు.
పార్కులు, ఆటస్థలాలు, కమ్యూనిటీహాళ్లు వంటి సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు భూ కేటాయింపులు.
ప్రాజెక్టు కాస్ట్‌ మేరకు డెవలప్‌మెంట్‌ ఏరియాను హెచ్‌ఎండీఏ, భూ యాజమానుల మధ్య డీఆర్పీ పద్ధతిలో కేటాయిస్తారు.

రాష్ట్రంలో ల్యాండ్‌పూలింగ్‌

అధ్యయనం కోసం నేడు, రేపు మహారాష్ట్ర, గుజరాత్‌లో అధికారుల పర్యటన
హైదరాబాద్‌, ఆగస్టు 9 ( నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ల్యాండ్‌పూలింగ్‌ను అమలుచేయడానికి అనుసరించాల్సిన విధానాలపై అధ్యయనం చేయడానికి రెండు బృందాలు గుజరాత్‌, మహారాష్ట్రలో పర్యటించనున్నాయి. మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, సీడీఏంఏ ఎన్‌ సత్యనారాయణ నేతృత్వంలోని అధికారుల బృందాలు మంగళ, బుధవారాలలో పర్యటనకు వెళ్లనున్నాయి. ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో మంచి ఫలితాలు రాబట్టిన మహారాష్ట్ర, గుజరాత్‌లో పట్టణాభివృద్ధి సంస్థలు, డీటీసీపీ పోషిస్తున్న పాత్రపై ఈ బృందాలు అధ్యయనం చేయనున్నాయి. హైదరాబాద్‌ శివారు ప్రాంతాలు, రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ విధానాన్ని అమలుచేయడానికి రాష్ట్ర మున్సిపల్‌శాఖ సిద్ధమవుతున్నది. కొత్త జిల్లాలు, అవుటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌), రీజనల్‌ రింగ్‌ రోడ్‌ (ట్రిపుల్‌ ఆర్‌)ల ద్వారా పట్టణాల అభివృద్ధికి అవకాశాలు ఏర్పడ్డాయి. వీటికి సమీపంలో భూములు కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వాణిజ్య సముదాయాలను నిర్మించుకోవడానికి వ్యాపారాలు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే లే అవుట్లు చేసి విక్రయించడం ద్వారా ఆ ప్రాంతాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతాయని, ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో రైతులకు కూడా లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.

రెండు బృందాలు
మహారాష్ట్రలలో పర్యటించనున్న బృందానికి మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుదర్శన్‌ రెడ్డి నేతృత్వం వహించనున్నారు. ఈ బృందంలో జీహెచ్‌ఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌ దేవేందర్‌రెడ్డి, డీటీసీపీ విద్యాధర్‌, మున్సిపల్‌శాఖ మంత్రి ఓఎస్డీ పీ మహేందర్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ ఏపీవో సురేశ్‌, మేడ్చల్‌ – మల్కాజ్‌గిరి, సిద్దిపేట జిల్లాల అదనపు కలెక్టర్లు సభ్యులుగా ఉన్నారు. గుజరాత్‌లో పర్యటించే బృందానికి సీడీఏంఏ ఎన్‌ సత్యనారాయణ నేతృత్వం వహించనున్నారు. ఈ బృందంలో ఐఏఎస్‌ అధికారి హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఎండీ బీఎం సంతోష్‌, మున్సిపల్‌, పట్టణాభివృద్ధి ప్లానింగ్‌ డైరెక్టర్‌ బాలకృష్ణ, జీహెచ్‌ఎంసీ డైరెక్టర్‌ కే శ్రీనివాస్‌, డీటీసీపీ జాయింట్‌ డైరెక్టర్‌ రమేశ్‌బాబు , సంగారెడ్డి, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల అదనపు కలెక్టర్లు సభ్యులుగా ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement