శనివారం 23 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 01:22:53

లాల్‌గడీలో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు

లాల్‌గడీలో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు

  • లాల్‌గడీ మలక్‌పేట సమీపంలో విహారకేంద్రం 
  • వాకింగ్‌ ట్రాక్‌, సైక్లింగ్‌ట్రాక్‌ ప్రారంభం
  • కొండగొర్రె  వైల్డర్‌నెస్‌ పార్కుగా పేరు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ నగరవాసులకు శివార్లలో మరో అటవీ ఉద్యానవనం అందుబాటులోకి వచ్చింది. కరీంనగర్‌ హైవేపై శామీర్‌పేట ఔటర్‌రింగ్‌ రోడ్డు సమీపంలోని లాల్‌గడీ మలక్‌పేటలో ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు ను అభివృద్ధి చేసింది. ఈ అటవీ ప్రాంతం కొండగొర్రెకు ప్రసిద్ధి కావడంతో అర్బన్‌ పార్క్‌కు కొండగొర్రె వైల్డర్‌నెస్‌ పార్క్‌గా పేరుపెట్టాలని నిర్ణయించారు. ఇక్కడ అభివృద్ధి చేసిన ఐదు కిలోమీటర్ల వాకింగ్‌ ట్రాక్‌, 25 కిలోమీటర్ల సైక్లింగ్‌ ట్రాక్‌ను అటవీ అభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీ రఘువీర్‌ శుక్రవారం ప్రారంభించారు. లాల్‌గడీ మలక్‌పేట అటవీప్రాంతం 2,635 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో కొంత ప్రాంతాన్ని అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుగా అభివృద్ధి చేసి, మిగ తా అటవీ ప్రాంతానికి మొత్తం ఫెన్సింగ్‌ వేయటంతోపాటు, పునరుద్ధరణ పనులు చేపట్టారు. 

కొంతమేర క్షీణించిన అటవీ ప్రాంత పునరుద్ధరణ కోసం దశలవారీగా ఇప్పటికే పదివేల మొక్కలను  నాటి సంరక్షిస్తున్నట్టు రఘువీర్‌ తెలిపారు.  హైదరాబాద్‌తో పాటు, ఔటర్‌ సమీపంలోని కాలనీల ప్రజలకు పచ్చదనాన్ని  అందించే ఈ అర్బన్‌ ఫారెస్ట్‌  పార్కును పూర్తి హం గులతో అందుబాటులోకి తెస్తున్నామని అటవీ అధికారులు తెలిపారు. సహజ అటవీ ప్రాంతం దెబ్బతినకుండా, సందర్శకులకు అహ్లాదాన్ని పంచేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దశలవారీగా నేచర్‌ ట్రేల్స్‌, నేచర్‌ ఫొటోగ్రఫీ పాయింట్స్‌, గ్రీన్‌ కెఫే, క్యాంపింగ్‌ సైట్స్‌ అభివృద్ధి చేసే ప్రణాళికలు కూడా ఉన్నాయని రఘువీర్‌ తెలిపారు. ఈనెలాఖరున పదవీ విరమణ పొందనున్న ఫారెస్ట్‌ కార్పొరేషన్‌ ఎండీ పీ రఘువీర్‌ను ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ సందర్భంగా సన్మానించారు. 


logo