బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 02:01:01

జగిత్యాలలో కశ్మీర్‌ పోలీసులు

జగిత్యాలలో కశ్మీర్‌ పోలీసులు
  • అదుపులోకి కుస్తాపూర్‌ యువకుడు లింగన్న
  • ఉగ్రవాద కేసులో అరెస్టయిన వ్యక్తికి మనీ ట్రాన్స్‌ఫర్‌

మల్లాపూర్‌: కశ్మీర్‌లో ఐఎస్‌ఐ ఉగ్రవాదులకు సాయం చేశాడన్న అనుమానంతో అక్కడి పోలీసులు మంగళవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం కుస్తాపూర్‌కు చెందిన సరికెల లింగన్నను అదుపులోకి తీసుకున్నా రు. జమ్ముకశ్మీర్‌కు చెందిన రాకేశ్‌కుమార్‌ అక్కడి ఆర్నియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ఆర్మీ క్యాంప్‌లో కూలీ. అతడికి ఫేస్‌బుక్‌లో అనిత పేరుతో ఉన్నవారితో పరిచయమైంది. తాను జర్నలిస్టునని,భారత సైనిక శిబిరంలోని వస్తువులు, వాహనాలు, ఆ ప్రాంత ఫొటోలు పంపితే వార్తలుగా రాస్తానని అనిత చెప్పడం తో రాకేశ్‌ ఆ పనులు చేశాడు. దీనికోసం అనిత నుంచి రూ.27 వేలు రాకేశ్‌ ఖాతా లో జమయ్యాయి. రాకేశ్‌ ఫొటోలను తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేయడంతో స్థానిక పోలీసులు జనవరి 5న అరెస్టుచేశారు. రాకేశ్‌ ఖాతాలు పరిశీలించగా లింగన్న గూగుల్‌పే ద్వారా గతనెల 13న రూ.5 వేలు, 25న రూ.4 వేలు పంపినట్టు తేలింది. దీని ఆధారంగా ఆర్నియా పోలీసులు లింగన్న విచారించారు. దుబాయ్‌లో ఉన్న బంధువైన శ్రీనివాస్‌ ఓ బ్యాంకు ఖాతాకు నగదు పంపాలని సూచించడంతో డబ్బు పంపానని తెలిపాడు. దీంతో లింగన్నను విచారణకు తీసుకెళ్లేందుకు ఆర్నియా పోలీసులు  మెజిస్ట్రేట్‌ను సంప్రదించగా అనుమతిచ్చారు. 


దుబాయ్‌ టు కశ్మీర్‌ వయా కుస్తాపూర్‌

లింగన్నకు బంధువైన శ్రీనివాస్‌ కొన్నేండ్లుగా దుబాయ్‌లో ఓ ఎలక్ట్రికల్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదేదుకాణంలో పాకిస్థాన్‌  వ్యక్తి కూడా పనిచేస్తుండటంతో ఇద్దరి మధ్య స్నే హం ఏర్పడినట్టు సమాచారం. ఈ నేపథ్యం లో ఆ వ్యక్తి భారత్‌లో తమ బంధువు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, గూగుల్‌పే ద్వారా రూ.9 వేలు పంపే ఏర్పాటుచేయాలని శ్రీనివాస్‌ను కోరినట్టు తెలిసింది. దీంతో శ్రీనివాస్‌ ఫోన్‌లో  బ్యాంకు ఖాతాను లింగన్నకు పంప గా, ఆ ఖాతాకు లింగన్న రూ.9 వేలు పంపి నట్టు తెలుస్తున్నది.


logo