శనివారం 30 మే 2020
Telangana - May 10, 2020 , 19:58:47

తెలంగాణలో సుసంపన్నమైన చేనేత కళ: మంత్రి కేటీఆర్‌

తెలంగాణలో సుసంపన్నమైన చేనేత కళ: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: చేనేత, జౌళి రంగాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. దేశంలో లక్షలాది మంది ఈ రంగాలపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారని వివరించారు.  దేశంలో భారీ టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటు ఆలోచనను స్వాగతిస్తున్నామని తెలిపారు.  ఇవాళ కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి  మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. 

'తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగాలివి. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు చేనేత, జౌళి రంగాలను కొంత ప్రభావితం చేస్తున్నాయి. భారత్‌లో మరిన్ని పెట్టుబడులు ఈ రంగాల్లో వచ్చే అవకాశముంది. తక్షణం 6 నెలల పాటు చేనేత, జౌళి రంగాల్లో పనిచేస్తున్నవారికి 50శాతం కూలీ మద్దతు ఇవ్వాలి. 3 నెలల పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటివి కేంద్రమే భరించాలి. ఈ రంగంలోని పరిశ్రమలకు మరిన్ని బ్యాంకు లోన్లు అందించాలి. రుణాలపై వడ్డీల వసూలుకు కనీసం ఏడాది పాటు మారటోరియం విధించాలని' మంత్రి విజ్ఞప్తి చేశారు.

'తెలంగాణలో సుసంపన్నమైన చేనేత కళ ఉన్నది.  లాక్‌డౌన్‌ వల్ల చేనేత ఉత్పత్తులు చేనేత కళాకారుల వద్దే ఉన్నాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ముందుకు రావాలి. చేనేత రంగంలో 50శాతం యార్న్‌ సబ్సిడీ ఇవ్వాలి. బీ ఇండియన్‌-బై ఇండియన్‌ అనే స్ఫూర్తితో కార్యక్రమం చేపట్టాలి. ఇందుకోసం అవసరమైన పాలసీ మార్పులతో పాటు సంస్కరణలు చేపట్టాలని' మంత్రి కేటీఆర్‌ సూచించారు. 


logo