కేటీఆర్: మీ నాన్న పార్టీకోసం పనిచేస్తున్నారు.. పుట్టినరోజు కానుకగా నీకేం కావాలమ్మా..?
నబీలా: నాకేమీ వద్దు.. తెలంగాణ గెలిస్తే అంతే చాలు.
కేటీఆర్: తండ్రికి తగ్గ బిడ్డ.. ఇదీ తెలంగాణ
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్కు కార్యకర్తలే కుటుంబం. బంగారు తెలంగాణ నిర్మాణమే ఆ కుటుంబం ఆకాంక్ష. వారే కాదు.. వారి కుటుంబసభ్యులదీ అదే కోరిక. ఓ సామాన్య కార్యకర్త కూతురు ‘తెలంగాణ గెలవాలె’ అనేదే తన పుట్టినరోజు కానుకగా మంత్రి కేటీఆర్‌తో పేర్కొన్నది. స్పందించిన కేటీఆర్.. ‘ఇదీ తెలంగాణ’ అని ఆ చిన్నారిని కీర్తించారు. శనివారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ కార్యకర్తలు, నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో అంకితభావంతో పనిచేస్తున్న కరీంనగర్‌కు చెందిన ఖాజా నవాజ్ హుస్సేన్ అనే కార్యకర్త గురించి హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి గంగుల కమలాకర్.. మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ‘ఖాజా 20 రోజులుగా హైదరాబాద్‌లో పార్టీ అప్పగించిన విధులు నిర్వహిస్తున్నారు. ఇంటివద్ద ఆయన తల్లి క్యాన్సర్‌తో బాధపడుతున్నది. భార్య నిండు గర్భిణి. నాలుగురోజుల క్రితం అతడి మామ తాహెర్ మరణించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ పార్టీ అప్పగించిన బాధ్యతల నుంచి అతడు తప్పుకోలేదు’ అని కేటీఆర్‌కు వివరించారు. అతడి నిబద్ధతకు చలించిపోయిన కేటీఆర్.. యోగక్షేమాలు విచారిస్తున్న సమయంలోనే శనివారం తన కూతురు నబీలా మహమ్మద్ పుట్టినరోజు విషయాన్ని ఖాజీ ప్రస్తావించారు. ‘కేటీఆర్ సాబ్.. ఆజ్ మేరా బేటీకా బర్త్‌డే హై.. ఫిర్ భీ మై పార్టీ కే లియే కామ్ కరే’ అని పేర్కొన్నారు.
కరీంనగర్ పార్టీ నాయకుల ద్వారా మంత్రి కేటీఆర్‌కు ఖాజా కూతురు నబీలాకు రూ.45 వేల విలువైన ట్యాబ్‌ను పుట్టినరోజు కానుకగా పంపించారు. చిన్నారికి ఫోన్‌చేసి బర్త్‌డే విషెస్ చెప్పారు. మీ నాన్న పార్టీకోసం పనిచేస్తున్నారు.. పుట్టినరోజు కానుకగా నీకేం కావాలి అని కేటీఆర్.. నబీలాను అడిగారు. వెంటనే చిన్నారి ‘నాకేమీ వద్దు.. తెలంగాణ గెలిస్తే అంతే చాలు’ అని పేర్కొన్నది. ‘తండ్రికి తగ్గ బిడ్డ.. ఇదీ తెలంగాణ’ అని కేటీఆర్ కీర్తించారు. టీఆర్ఎస్ పట్ల కార్యకర్తలకు, వారి కుటుంబానికి ఉన్న అనుబంధానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
పార్టీ అంటే నాకు ప్రాణం. పార్టీ అప్పగించిన బాధ్యత నుంచి పక్కకు తప్పుకుంటే ఇంట్లో బాధ్యతల నుంచి తప్పుకున్నట్టే. పార్టీకోసం బాగా పనిచేస్తానని నన్ను కరీంనగర్ నుంచి పిలిపించారు. నాకు అప్పగించిన పనిని పూర్తిచేశాకే ఇక్కడి నుంచి వెళ్తా. కేటీఆర్ సాబ్ నాకు ఫోన్ చేస్తారని అనుకోలేదు. నా బిడ్డ పుట్టినరోజని తెలుసుకొని నాకు తెల్వకుండానే గిఫ్ట్ ఇచ్చారు. టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ దక్కిన గౌరవమిది.
– ఖాజా నవాజ్ హుస్సేన్