'బీజేపీ నేతలవి బోగస్ మాటలు..బోగస్ ముచ్చట్లు'

హైదరాబాద్: హైదరాబాద్‌లో శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయని, గల్లీ గల్లీకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆడ పిల్లలను కాపాడేందుకు, వారి భద్రతకు షీ టీంలు ఏర్పాటు చేశామని చెప్పారు. పేదోడికి ఆకలైతే 5 రూపాయలకే అన్నం పెడుతున్నామని, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ కమాన్ దగ్గర కేటీఆర్ రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించారు.
'డబుల్ బెడ్రూం ఇండ్లను ఇచ్చే బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. డిసెంబర్ 4 తర్వాత అర్హులందరికీ వరద సాయం అందిస్తాం. వరద సాయం అందిస్తుంటే ఈసీకి లేఖ రాసి అడ్డుకున్నారు. నిజంగా బీజేపీ నేతలకు పేదలపై ప్రేమ ఉంటే మేం వరద సాయం చేసిన లిస్టు ఇస్తాం..పేదలకు రూ.25వేలు ఇప్పించండి. ఆరేండ్లలో బీజేపీ నేతలు పేదలకు ఏం చేశారో చెప్పాలి. ఒక్క రూపాయి ఇచ్చినవా అని అడిగితే బీజేపీ వాళ్లకు కోపం వస్తోంది. ఎవరు గెలిస్తే పేదవాళ్లు సంతోషంగా ఉంటారో, ఎవరు గెలిస్తే హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటుందో వారికే ఓటు వేయాలి. ఎవరు మన సమస్యలు తీరుస్తారో వాళ్లకే అండగా ఉండాలి. బీజేపీ నేతలవి బోగస్ మాటలు..బోగస్ ముచ్చట్లు. 15 లక్షలు ఇస్తామనియ దేశ ప్రజలను బీజేపీ మోసం చేసిందని' కేటీఆర్ విమర్శించారు.