శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 21, 2021 , 01:31:34

జీనోమ్‌వ్యాలీలో టీకా పరీక్షా కేంద్రం!

జీనోమ్‌వ్యాలీలో టీకా పరీక్షా కేంద్రం!

  • మెడికల్‌ స్టోర్‌ డిపోనూ ఇక్కడ నెలకొల్పాలి
  • ప్రపంచ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌
  • ఇక్కడ 6 బిలియన్‌ డోసుల టీకాల ఉత్పత్తి
  • టెస్టింగ్‌, సర్టిఫికేషన్‌ ల్యాబ్‌తో ఎంతో మేలు
  • కేంద్రమంత్రి హర్షవర్ధన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ 

జీనోమ్‌వ్యాలీలో మరిన్ని ప్రయోగాలను, పరిశోధనలను పెంచే ఉద్దేశంతో ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎమ్మార్‌) ఆధ్వర్యంలో దేశంలోనే అతి పెద్ద నేషనల్‌ యానిమల్‌ రిసోర్స్‌ ఫెసిలిటీ ఫర్‌ బయోమెడికల్‌ రిసెర్చ్‌ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిందని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ సంస్థకు కావాల్సిన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందించి, దాని ఏర్పాటులో చొరవ తీసుకొన్న విషయాన్ని మంత్రి కేటీఆర్‌ తన లేఖలో ప్రస్తావించారు. ఈ సంస్థకు నిర్దేశించిన విధుల్లో వ్యాక్సిన్లు, వైద్య పరికరాల పరీక్ష, సర్టిఫికేషన్‌ బాధ్యత కూడా ఉన్నదని, భారత ప్రభుత్వం తరఫున ఈ విధులను నిర్వర్తించాల్సిన సంస్థ హైదరాబాద్‌లోనే ఉన్న నేపథ్యంలో అటు పరిశ్రమలకు, ఈ సంస్థకు ఉభయతారకంగా ఉండేలా నేషనల్‌ డ్రగ్‌ ల్యాబొరేటరీని జీనోమ్‌ వ్యాలీలో ఏర్పాటుచేస్తే ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

హైదరాబాద్‌, జనవరి 20 (నమస్తే తెలంగాణ): వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌, సర్టిఫికేషన్‌ ల్యాబొరేటరీని ఏర్పాటుచేయాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌ నగరం ప్రపంచ వ్యాక్సిన్‌ రాజధానిగా ఎదిగిందని, ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి ఆరు బిలియన్‌ డోసుల టీకాలను బయోటెక్‌ కంపెనీలు తయారుచేసి ఎగుమతి చేస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర కుటుంబ సంక్షేమ వ్యవహారాలు, సెన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖల మంత్రి హర్షవర్ధన్‌కు బుధవారం మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా మూడోవంతు వ్యాక్సిన్ల ఉత్పత్తి హైదరాబాద్‌లోనే జరుగుతున్నదని గుర్తుచేశారు.

అత్యంత ప్రాధాన్యం ఉన్నందునే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం హైదరాబాద్‌కు వచ్చి వ్యాక్సిన్‌ తయారీదారులతో చర్చించారన్నారు. ఆ తర్వాత దాదాపు 80 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు జీనోమ్‌వ్యాలీని సందర్శించి కొవిడ్‌-19 టీకా తయారీ సమాచారాన్ని తెలుసుకొన్నారని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా వ్యాక్సిన్లను తయారుచేస్తున్న జీనోమ్‌వ్యాలీలో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌, సర్టిఫికేషన్‌ ల్యాబొరేటరీని ఏర్పాటుచేయాలని కోరారు. ఇదే విషయాన్ని గతంలోనూ ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని మంత్రి కేటీఆర్‌.. హర్షవర్ధన్‌కు గుర్తుచేశారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ తయారీ కార్యక్రమాలు మరింత వేగంగా చేపట్టాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే జీనోమ్‌వ్యాలీలో  వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీని ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలని మంత్రి కేటీఆర్‌ తన లేఖలో కోరారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ల తయారీకి సంబంధించి సెంట్రల్‌ డ్రగ్‌ ల్యాబొరేటరీ హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలీలో ఉన్నదని.. ప్రతిసారీ అక్కడికి తమ వ్యాక్సిన్లను పంపించి పరీక్షించి సర్టిఫికెట్‌ పొందడంలో హైదరాబాద్‌ బయోటెక్‌ కంపెనీలు సమయాభావాన్ని ఎదుర్కొంటున్నాయని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు.  

మెడికల్‌స్టోర్‌ డిపో ఏర్పాటుతో ఊతం

ప్రస్తుతం కోల్‌కతా, ముంబై, చెన్నై, కర్నాల్‌లో మాత్రమే ఉన్న గవర్నమెంట్‌ మెడికల్‌ స్టోర్‌ డిపోను జీనోమ్‌వ్యాలీలో ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ కేంద్రాన్ని కోరారు. వివిధ సంస్థలు ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున టీకాలను ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో డిపోను అంతర్జాతీయ ప్రమాణాలతో, డాటా మానిటరింగ్‌ అండ్‌ ట్రాకింగ్‌ సిస్టం వంటి సౌకర్యాలతో ఏర్పాటుచేస్తే ఆయా కంపెనీల భవిష్యత్తు ప్రణాళికలకు, భారత వ్యాక్సిన్‌ తయారీరంగానికి ఎంతో మేలుచేసిన వారవుతారన్నారు. ఈ రెండు విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్వీకరించి వెంటనే నిర్ణయం తీసుకుంటుందన్న విశ్వాసాన్ని మంత్రి  కేటీఆర్‌ తన లేఖలో వ్యక్తంచేశారు.

VIDEOS

logo