బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 01:17:59

ఐటీ ఉద్యోగులకు అభయం

ఐటీ ఉద్యోగులకు అభయం

-ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించండి 

-ఐటీ పరిశ్రమవర్గాలతో మంత్రి కేటీఆర్‌

- ప్రభుత్వ చర్యలపై ఐటీవర్గాల హర్షం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించాలని కోరారు. త్వరలోనే పరిస్థితి అంతా సర్దుకుంటుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో శనివారం ప్రగతిభవన్‌లో ఐటీ పరిశ్రమలవర్గాలతో మంత్రి సమావేశమయ్యారు. వివిధ ఐటీ సంస్థలు, సంఘాల ప్రతినిధులతో పరిమితస్థాయిలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి పలు సూచనలు చేశారు. ఐటీ ఉద్యోగుల యోగక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, భవిష్యత్‌ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. ఐటీ కంపెనీలు ముఖ్యంగా శానిటేషన్‌, ఎంట్రీ పాయింట్లలో నిరంతర చెకింగ్‌ కొనసాగించాలని సూచించారు. ఇతర దేశాల్లో పర్యటించి వచ్చిన ఉద్యోగులతోపాటు భవిష్యత్‌లో కంపెనీల కార్యకలాపాల కోసం వచ్చే ప్రతినిధులను ముందుగా క్వారంటైన్‌ పీరియడ్‌ పాటించేలా చూడాలని తెలిపారు. వైరస్‌ పట్ల ఆందోళన అవసరం లేదని, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోతుందని భరోసా ఇచ్చారు. ఈ వైరస్‌ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యల వల్ల ఐటీ పరిశ్రమకు అనుబంధంగా సేవలందిస్తున్న అసంఘటిత రంగం కార్మికులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశమున్నదని, వారి వేతనాల విషయంలో సానుకూలంగా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యల పట్ల ఐటీవర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. రెండువారాల కిందట వైరస్‌ వ్యాప్తిపై భయాందోళనలు నెలకొన్నప్పుడు.. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఐటీ పరిశ్రమకు అండగా నిలిచి భరోసా కల్పించారని గుర్తుచేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో నాస్కామ్‌, హైసియా, సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌కు చెందిన ప్రతినిధులు, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, కాగ్నిజంట్‌, గూగుల్‌, క్వాల్‌ కామ్‌, స్టేట్‌ స్ట్రీట్‌ వంటి కంపెనీల హైదరాబాద్‌ అధిపతులుతోపాటు ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, సైబారాబాద్‌ సీపీ సజ్జనార్‌ పొల్గొన్నారు.


logo