గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 01:58:50

వరద కష్టాలనుంచి శాశ్వత విముక్తి

వరద కష్టాలనుంచి శాశ్వత విముక్తి

  • వాననీరు పోయేలా మూసీలోకి భూగర్భ పైప్‌లైన్‌
  • పాడైన స్టడీ సర్టిఫికెట్లు ఉచితంగా ఇప్పిస్తా
  • వరద బాధితులను ఓదార్చిన మంత్రి కేటీఆర్‌
  • మోకాలులోతు నీటిలో తిరుగుతూ పరామర్శ
  • మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

హైదరాబాద్‌ సిటీబ్యూరో, మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన హైదరాబాద్‌లోని ఆయా ప్రాంతాల ప్రజల కష్టాలు తెలుసుకొనేందుకు పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు వరుసగా నాలుగోరోజు పర్యటించారు. వరద కష్టాలను చెప్పుకొంటూ కన్నీటిపర్యంతమైన బాధితులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఎవ్వరూ ఏడ్వొద్దని చేతులు జోడించి విజ్ఞప్తిచేశారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని, వరద నుంచి శాశ్వత విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు. 

మంత్రి కేటీఆర్‌ శనివారం నగరశివార్లలోని పీర్జాదిగూడ, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌లో పర్యటించారు. వరదనీటితో నిండిన వీధుల్లో తిరుగుతూ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత ప్రజలు తమ కష్టాలను మంత్రి వద్ద వెళ్ల్లబోసుకుంటూ కంటతడి పెట్టుకున్నారు. ఈ వరదలో తమ బతుకుదెరువు కొట్టుకుపోయిందని ఒకరు, తమ పిల్లల చదువు సర్టిఫికెట్లు పోయాయని మరొకరు, నిలువనీడలేదని ఇంకొకరు తమ బాధలు చెప్పుకున్నారు. వాటిని సావధానంగా ఆలకించిన కేటీఆర్‌ చలించిపోయారు. మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రగతినగర్‌ నుంచి పర్వతాపూర్‌ వరకు మోకాలు లోతు వరద నీటిలో తిరుగుతూ ప్రజలను ఓదార్చారు. 

ఈ సందర్భంగా ఆయన బాధితులతో.. ‘అమ్మా! చేతులు జోడించి చెప్తున్నా.. మీరు ఏడ్వొద్దు. మీ కన్నీటి కష్టాలకు శాశ్వత విముక్తి కల్పిస్తా. వరదనీరు నేరుగా మూసీలో కలిసేలా భూగర్భం నుంచి భారీ పైప్‌లైన్‌ నిర్మిస్తాం. భవిష్యత్తులో మరోసారి మీకీ కష్టం రాకుండా చెంగిచెర్ల నుంచి మేడిపల్లి మీదుగా పర్వతాపూర్‌ వరకు, బోడుప్పల్‌ నుంచి పీర్జాదిగూడ మీదుగా పర్వతాపూర్‌ వరకు త్వరలోనే భూగర్భ పైప్‌లైన్‌ నిర్మిస్తాం. వరదలో కొట్టుకుపోయిన పిల్లల చదువు సర్టిఫికెట్లను ఉచితంగా ఇప్పించే బాధ్యత తీసుకుంటా. బతుకుదెరువు కోల్పోయిన కిరాణా దుకాణాదారుడిని, పిండిగిర్ని నిర్వాహకుడిని, బొట్టు బిళ్లలు అమ్ముకునే ఆ అమ్మను, ఆ టైలర్‌ అన్నను ఆదుకొనేందుకు త్వరలోనే ఒక జీవో జారీచేస్తాం. మీ బతుకుదెరువుకు భరోసా కల్పిస్తా. అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం’ అని భరోసా కల్పించారు. భూగర్భ పైప్‌లైన్‌ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని, చిరువ్యాపారులను ఆదుకొనేందుకు ఉత్తర్వులు జారీచేయాలని మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శిని అప్పటికప్పుడు ఆదేశించారు.

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చెక్కుల పంపిణీ

వదరల కారణంగా మృతి చెందినవారి పది కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులను మంత్రి కేటీఆర్‌ అందజేశారు. వర్షాలు, వరదల్లో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, అధైర్యపడాల్సినవసరం లేదని చెప్పారు. రాజేంద్రనగర్‌ పరిధిలో గండిపడి ఆస్తి, ప్రాణనష్టానికి కారణమైన పల్లెచెరువు, అప్పచెరువులను పరిశీలించారు. చెరువులు తెగడంపై ఆరా తీశారు. ఆక్రమణలను వెంటనే తొలిగించాలని అధికారులను ఆదేశించారు. కొట్టుకుపోయిన జాతీయరహదారి, అంతర్గత రోడ్లతోపాటు డ్రైనేజి నిర్మాణాలను పునరుద్ధరించాలని సూచించారు. మంత్రి కేటీఆర్‌తో మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎంపీలు రంజిత్‌రెడ్డి, అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, పీర్జాదిగూడ మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌, సీపీ సజ్జనార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రదీక్‌ జైన్‌ ఉన్నారు. 


బాధితులకు నెలకు సరిపడా సరుకుల కిట్‌లు

హైదరాబాద్‌లో వరదలకు ముందున్న సాధారణ స్థితిని పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం రిలీఫ్‌ కిట్‌లను వరద బాధిత కుటుంబాల ఇండ్లకు వెళ్లి అందజేయాలని స్పష్టంచేశారు. ఈ కిట్‌లో రూ. 2800 విలువగల ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు, మూడు బ్లాంకెట్లు ఉన్నట్టు చెప్పారు. వరద ప్రాంతాల్లో ఆరోగ్యకర వాతావరణాన్ని తెచ్చేందుకు యుద్ధప్రాతిపదికన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ను చేపట్టాలని ఆదేశించారు. యాంటీ లార్వా స్ప్రేయింగ్‌, సోడియం హైపోక్లోరైట్‌, క్రిమిసంహారక ద్రావణాలు పిచికారీ చేయాలన్నారు. ఇందుకు అవసరమైతే అదనపు వాహనాలను సమకూర్చుకోవాలన్నారు. వరదప్రాంతాల్లో నిలిచిన నీళ్లను తొలిగించాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్తగా ప్రత్యేక శానిటేషన్‌డ్రైవ్‌తోపాటు వరద ప్రాంతాల్లో మొబైల్‌ మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేయాలని చెప్పారు. వీటి నిర్వహణలో జీహెచ్‌ఎంసీతోపాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ డీఎంఈ డాక్టర్‌ శ్రీనివాస్‌కు సూచించారు. భారీవర్షాలు, వరదతో దెబ్బతిన్న ఇండ్ల సంఖ్యను సేకరించాలని చెప్పారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి, ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజీత్‌కంపాటి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.logo