e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home Top Slides పెట్టుబడిదారులకు పింక్‌ బుక్‌

పెట్టుబడిదారులకు పింక్‌ బుక్‌

  • ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌
  • అందుబాటులో రాష్ట్ర సమగ్ర సమాచారం

హైదరాబాద్‌, జూలై 27(నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడుల అనుకూలతలతో కూడిన సమగ్ర సమాచారం గల ‘పింక్‌ బుక్‌'(ఇన్వెస్టర్స్‌ గైడ్‌-2021)ను మంగళవారం పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలు, వివిధ శాఖల పథకాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులు సంప్రదించాల్సిన కాంటాక్ట్‌ నెంబర్లు తదితర వివరాలను ఈ పుస్తకంలో పొందుపర్చారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (ఈఓడీబీ)లో తెలంగాణ దేశంలోనే అత్యుత్తమ రాష్ర్టాల్లో ఒకటిగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, పింక్‌ బుక్‌ ప్రభుత్వ విధానాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, పెట్టుబడిదారులు సంప్రదించాల్సిన కాంటాక్ట్‌ నంబర్లను అందిస్తున్నదని ఈ సందర్భంగా కేటీఆర్‌ పేర్కొన్నారు. పెట్టుబడిదారులు తమ భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకొనేందుకు ఈ బుక్‌ ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఈవోడీబీని మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుందన్నారు.

పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలతోపాటు పరిశ్రమలకు అవసరమైన నిరంతర విద్యుత్‌ సరఫరా, వనరులు, నైపుణ్యంగల సిబ్బంది అవసరమని, ఇవన్నీ తెలంగాణలో సమృద్ధిగా ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తులు, అనుమతుల్లో పారదర్శకతను పెంపొందించడంతోపాటు ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఈవోడీబీ ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఈ పింక్‌ బుక్‌ను ప్రతిఏటా తాము అప్‌డేట్‌ చేస్తామని వివరించారు. ఈవోడీబీలో రాష్ట్రం దేశంలోని మూడు టాప్‌ స్టేట్‌లలో స్థానం సంపాదించినట్లు గుర్తుచేస్తూ, మిషన్‌ భగీరథ, రైతు బంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌, హరితహారం, టీఎస్‌ ఐ-పాస్‌ తదితర ప్రతిష్ఠాత్మక పథకాలను గురించి వివరించారు. ప్రభుత్వ లక్ష్యాలు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, కల్పిస్తున్న సౌకర్యాలు, ముఖ్యంగా నిరంతర విద్యుత్‌, నీటి సరఫరా, రోడ్లు, రవాణా సౌకర్యాలు తదితర రాష్ట్రంలో పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాల వివరాలను పేర్కొన్నారు.

- Advertisement -

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రధాన పంటలు, ప్రధాన ఎగుమతులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్యాసంస్థలు, భద్రత, ఖనిజాలు, టీఎస్‌ఐఐసీ, జీవశాస్త్ర రంగంలో సాధించిన పురోగతి, ఎలక్ట్రానిక్స్‌ రంగం, విద్యుత్‌ వాహనాలకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టం, వస్త్ర పరిశ్రమ అభివృద్ధి వంటి వివరాలు పింక్‌బుక్‌లో పొందుపరిచారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఆటోమోటివ్‌ పరిశ్రమ, ఏరోస్పేస్‌-డిఫెన్స్‌, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, ప్లాస్టిక్స్‌ అండ్‌ పాలిమర్స్‌, ఇతర ప్రాజెక్టులు, ఆయా శాఖలకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు, సందేహాలు నివృత్తి చేసుకొనేందుకు సంప్రదించాల్సిన కాంటాక్ట్‌ వివరాలను అందించారు. అనంతరం ఈ సమావేశానికి హాజరైన పలువురికి పింక్‌ బుక్‌లను అందజేశారు. రాష్ట్ర పర్యాటక, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎలక్ట్రానిక్స్‌, ఈవీ, ఈఎస్‌ఎస్‌ విభాగాల డైరెక్టర్‌ సుజయ్‌ కారంపురితోపాటు ఎలక్ట్రానిక్స్‌ విభాగానికి చెందిన పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana