గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 31, 2020 , 01:13:27

పచ్చటి పోటీ

పచ్చటి పోటీ

  • రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో ‘గ్రీన్‌స్పేస్‌ ఇండెక్స్‌' 
  • కొత్త కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ శ్రీకారం
  • పచ్చదనం పెంపు ఆధారంగా అవార్డులు
  • ఏటా ఐదు క్యాటగిరీల్లో అవార్డుల ప్రదానం
  • నాలుగేండ్లపాటు నిర్వహణ
  • ఆలోపు 100% పచ్చదనం
  • జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం

గ్రీన్‌స్పేస్‌ ఇండెక్స్‌లో పార్కుల అభివృద్ధి, మొక్కల పెంపకంలో వినూత్నమైన డిజైన్లు, రోడ్ల వెంట పచ్చదనం పెంపు, ఇండ్లలో మొక్కల పెంపకం అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. జీఐఎస్‌, ఉపగ్రహచిత్రాలు, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, జియో ట్యాగింగ్‌ వంటి పద్ధతులతో రికార్డుచేసి ప్రస్తుతం ఉన్న పచ్చదనం.. వచ్చేఏడాది నాటికి ఏ మేరకు పెరిగిందో మదింపు చేస్తారు.

-మంత్రి కే తారకరామారావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పట్టణాల్లో ఓ పద్ధతి ప్రకారం పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల జీవనప్రమాణాలను పెంచేందుకు పురపాలికలను వందశాతం గ్రీనరీగా మార్చేలా ప్రణాళిక రూపొందించింది. పచ్చదనాన్ని పెంపొందించడంలో మున్సిపాలిటీలను మరింత ప్రోత్సహించేలా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీల్లో పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా పురపాలకశాఖమంత్రి కే తారకరామారావు ఆదివారం ‘గ్రీన్‌స్పేస్‌ ఇండెక్స్‌' పేరుతో కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందులోభాగంగా ఉత్తమంగా నిలిచిన మున్సిపాలిటీలకు మున్సిపల్‌శాఖ ఆధ్వర్యంలో ప్రతిఏటా అవార్డులు అందజేస్తామని చెప్పారు. మున్సిపాలిటీల మధ్య పోటీతత్వంతో పట్టణప్రాంతాల్లో పచ్చదనం మరింతగా మెరుగవుతుందని తెలిపారు. దీనిద్వారా ప్రజల జీవనప్రమాణస్థాయి కూడా పెరుగుతుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. హరితహారం పేరుతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున మొక్కల పెంపకాన్ని చేపడుతున్నదని చెప్పారు. పట్టణాల్లోనూ ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని వివరించారు. 

జియోట్యాగింగ్‌తో పచ్చదనం మదింపు

గ్రీన్‌స్పేస్‌ ఇండెక్స్‌లో పార్కుల అభివృద్ధి, మొక్కల పెంపకంలో వినూత్నమైన డిజైన్లు, రోడ్ల వెంట పచ్చదనం పెంపు, ఇండ్లలో మొక్కల పెంపకం అంశాలకు ప్రాధాన్యం ఉంటుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీఐఎస్‌, ఉపగ్రహచిత్రాలు, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, జియో ట్యాగింగ్‌ వంటి పద్ధతులతో రికార్డుచేసి ప్రస్తుతం ఉన్న పచ్చదనం.. వచ్చేఏడాది నాటికి ఏ మేరకు పెరిగిందనేది మదింపు చేయనున్నట్టు చెప్పారు. అవార్డుల ఎంపికలో.. ఒక పట్టణంలో మొత్తం పచ్చదనానికి 85శాతం వెయిటేజీ ఉంటుందని తెలిపారు. పచ్చదనం పెంపులో అనుసరించిన వినూత్న పద్ధతులకు ఐదుశాతం, మొక్కల పెంపకంలో ఆకట్టుకునే డిజైన్లకు మరో పదిశాతం వెయిటేజీ ఇవ్వనున్నట్టు వివరించారు. మున్సిపాలిటీలో మొత్తానికి అవార్డుతోపాటు అత్యధిక అర్బన్‌ గ్రీన్‌స్పేస్‌, బెస్ట్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫ్‌ అర్బన్‌ గ్రీన్‌స్పేస్‌, తలసరి అర్బన్‌ గ్రీన్‌స్పేస్‌, రోడ్ల వెంట మొక్కల పెంపకం వంటి క్యాటగిరీల్లో అవార్డులు ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ అవార్డులను ఈ ఏడాది ప్రారంభించి నాలుగేండ్లపాటు కొనసాగించాలని భావిస్తున్నట్టు చెప్పారు. నాలుగేండ్లలోపు మున్సిపాలిటీలన్నింటినీ గ్రీనరీగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. పట్టణాల్లో పచ్చదనం, ఖాళీస్థలాలపై కేంద్రప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంటుందని వివరించారు.logo