బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 00:52:07

ఈచ్‌ వన్‌.. ప్లాంట్‌ వన్‌

ఈచ్‌ వన్‌.. ప్లాంట్‌ వన్‌

  • హరితహారంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి
  • ఔటర్‌ పక్కన 110ఎకరాల్లో మియావాకి ప్లాంటేషన్‌
  • హరితహారం ప్రారంభంలో మంత్రి కేటీఆర్

మేడ్చల్‌, నమస్తేతెలంగాణ: రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఒక మొక్కనాటి సంరక్షించాలని, ప్రజలంతా ‘ఈచ్‌వన్‌.. ప్లాంట్‌ వన్‌' నినాదంతో ముందుకు సాగాలని ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా మార్చాలన్న దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ఆరేండ్ల కిందట హరితహారానికి శ్రీకారం చుట్టారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో హరితయజ్ఞం కొనసాగుతున్నదని చెప్పారు. బోయిగూడలోని జీహెచ్‌ఎంసీ పార్కులో కేటీఆర్‌ మొక్కలు నాటి ఆరోవిడుత హరితహారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి బల్కంపేట శ్మశానవాటిక వద్ద, ఆ తర్వాత దుండిగల్‌ క్రాస్‌ రోడ్డులో మంత్రి కేటీఆర్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏ రూపొందించిన హరితహారం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. నిజాంపేట, కొంపల్లి, దుండిగల్‌తోపాటు హెచ్‌ఎండీఏ పరిధిలో చిట్టడవులను పెంచేందుకు యాదాద్రి తరహా మియావాకి ప్లాంటేషన్‌ చేపడ్తామని కేటీఆర్‌ చెప్పారు.

ఔటర్‌ రింగురోడ్డు పక్కనే ఉన్న సుమారు 110 ఎకరాల హెచ్‌ఎండీఏ స్థలంలో చిట్టడవిని పెంచుతామన్నారు. హెచ్‌ఎండీఏతోపాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 12.5 కోట్ల మొక్కలు నాటి సంరక్షించనున్నట్టు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్‌రావు, శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్‌, మాధవరం కృష్ణారావు, పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, అదనపు కమిషనర్‌ కృష్ణ, డైరెక్టర్‌ నాగిరెడ్డి, అర్బన్‌ బయోడైవర్సిటీ డీడీ వీ శ్రీనివాస్‌, హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్ట్రీ డైరెక్టర్‌ బీ శ్రీనివాస్‌, ఓఆర్‌ఆర్‌ పీడీ బీఎం సంతోష్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. logo