శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 04, 2020 , 04:07:24

ఫైబర్‌గ్రిడ్‌కు రుణం

ఫైబర్‌గ్రిడ్‌కు రుణం

 మా కార్యక్రమాల్లో భాగం కండి 

 గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకారం

 నాబార్డ్‌కు మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి

 ప్రభుత్వ పథకాలు స్ఫూర్తిదాయకం 

 అభివృద్ధిలో భాగస్వాములవుతాం

 నాబార్డు సీజీఎం వైకే రావు

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి చేపడుతున్న అనేక కార్యక్రమాలు మా బ్యాంకు లక్ష్యాలకు, స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వంతో మరిన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.

- నాబార్డ్‌ సీజీఎం వైకే రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి నాబార్డ్‌ పూర్తిస్థాయిలో సహకారం అందించేందుకు ముందుకు వచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం నాబార్డ్‌ సీజీఎంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వైకేరావు మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండేందుకు నాబార్డ్‌కున్న అవకాశాలను మంత్రి కేటీఆర్‌ వివరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల ఏర్పాటుకు అవకాశం ఉన్నదని చెప్పారు. వీటి ఏర్పాటుకు నాబార్డ్‌ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. ఐటీ శాఖ  ఆధ్వర్యంలో ఇంటింటికి ఇంటర్నెట్‌ అందించే లక్ష్యంతో చేపట్టిన తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటుకు వీలవుతుందని తెలిపారు. తద్వారా వ్యవసాయరంగంలో అద్భుతమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని కేటీఆర్‌ చెప్పారు. ఈ ప్రాతిపదికపై తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌కు రుణ సదుపాయం అందించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఇప్పటికే నాబార్డ్‌ పాడి పశువుల అభివృద్ధి కార్యక్రమం ద్వారా అనేక రుణాలు ఇస్తున్నదని, అయితే ఏదైనా ఒక జిల్లాలో సంతృప్తస్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాలని చెప్పారు. అవసరమైతే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో ఈ కార్యక్రమం చేపడితే పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని      చేపట్టడం ద్వారా గ్రామాల్లోని కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని     పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వ్యవసాయ సొసైటీల ద్వారా సుమారు రెండు వేల టన్నుల సామర్థ్యం కలిగిన   500 గోదాముల నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. దీంతో పాటు గ్రామాల్లోని రైతుబంధు కమిటీలను మరింత బలోపేతం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వీటి ద్వారా వ్యవసాయరంగానికి సంబంధించి అవసరమైన రుణాలను, రుణ సౌకర్యాన్ని కల్పించే అంశాన్ని కూడా       పరిశీలించాలని సూచించారు. 

నాబార్డ్‌ లక్ష్యాలకు అనుగుణంగా పథకాలు

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి చేపడుతున్న అనేక కార్యక్రమాలు తమ బ్యాంకు లక్ష్యాలకు, స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నాయని నాబార్డ్‌ సీజీఎం వైకే రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో మరిన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.


logo