సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 03, 2021 , 02:43:26

కేటీఆర్‌కు సీఎం అయ్యే అర్హత

కేటీఆర్‌కు సీఎం అయ్యే అర్హత

  • సమర్థుడైన నాయకుడు.. పరిపాలనాదక్షుడు: మండలి చైర్మన్‌ గుత్తా 

హైదరాబాద్‌, జనవరి 2 (నమస్తే తెలంగాణ): టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సమర్థుడైన నాయకుడని, ముఖ్యమంత్రి పదవికి కావలసిన అన్ని అర్హతలు ఆయనకున్నాయని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గానే కాకుండా మంత్రిగా ఆయన అన్ని విషయాలను ఆకళింపు చేసుకొని మంచి పరిపాలనాదక్షుడిగా నిరూపించుకుంటున్నారని పేర్కొన్నారు. ఎటువంటి రాజకీయాలనైనా ఆకళింపు చేసుకొని వాటికి దీటైన కార్యాచరణ చేపట్టే సత్తా కేటీఆర్‌కు ఉన్నదని ఆయన స్పష్టంచేశారు. పట్టుదల విషయంలో.. పాలనా అంశంలో కేటీఆర్‌కు దక్షత ఉందని అన్నారు.

తన చాంబర్‌లో గుత్తా శనివారం మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఏ పార్టీ వారైనా సరే హుందాగా వ్యవహరించాలని, అప్పుడే ప్రజలు గౌరవిస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం కొంతమంది నేతలు వాడుతున్న భాష, పద ప్రయోగాలు, ఏకవచన సంబోధన చూస్తే బాధ అనిపిస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలు తమ వ్యవహారశైలిని చూసి ఏమనుకుంటారోనన్న ఇంగిత జ్ఞానాన్ని, తమ స్థానాలకు ఉండే గౌరవాన్ని మరచి వ్యవహరిస్తున్నారని చెప్పారు.

తన 30 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదని తెలిపారు. రాజకీయస్థితిగతులు ఎప్పటికీ ఒకేలాగా ఉండవని, ఒకటి రెండు ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచినంత మాత్రాన విర్రవీగిపోవడం సరైంది కాదని చెప్పారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వేరు, నల్లగొండ రాజకీయాలు వేరు అని గుత్తా తెలిపారు. రాష్ట్ర ప్రజలకు జమిలి ఎన్నికలు కొత్త కాదని చెప్పారు.