ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 02:10:52

కేటీఆర్‌ ఏ పదవికైనా సమర్థుడు

కేటీఆర్‌ ఏ పదవికైనా సమర్థుడు

  • ఉద్యమకారులకు సీఎం కేసీఆర్‌ ఎప్పడూ ప్రాధాన్యమిస్తారు
  • కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగదు
  • మీడియాతో ఇష్టాగోష్ఠిలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏ పదవినైనా సమర్ధంగా నిర్వహించే సత్తా మంత్రి కే తారక రామారావుకు ఉన్నదని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. అయితే ఆయనకు ఎప్పుడు ఏ పదవి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని అభిప్రాయపడ్డారు. సోమవారం శాసనమండలిలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఉద్యమకారులకు ఎప్పుడూ అన్యాయం జరుగనివ్వరని.. వారికి అవకాశాలిచ్చేందుకే మొగ్గుచూపుతూ ఉంటారని అన్నారు. రాజకీయ సమీకరణాలు, రాజకీయ పునరేకీకరణ, పార్టీ బలోపేతం దృష్ట్యా ఇతర పార్టీల నుంచి కొంతమందిని చేర్చుకోవడం అనివార్యమని.. రాజకీయాల్లో ఇది సహజమని చెప్పారు. కరోనా నేపథ్యంలో శాసనమండలి సమావేశాలకు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, సభ్యులు భౌతికదూరం పాటించేలా అదనంగా సీట్లను ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. ఈ నెల 25 వరకు సమావేశాలు జరుగవచ్చని చెప్పారు. నాలుగు అంశాలపై ప్రభుత్వం ఆర్డినెన్స్‌లు జారీచేసిందని, వీటిని సభల్లో ప్రవేశపెట్టే అవకాశముందని తెలిపారు. కృష్ణానది నీటి వాటాలో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరుగదని, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఒక్క చుక్కనీటిని కూడా వదులుకోరని అన్నారు. ఇప్పటికే కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేశారని, సుప్రీంకోర్టులో కేసు వేశారని చెప్పారు. అపెక్స్‌ కౌన్సిల్‌లోనూ దీనినే ప్రధాన ఎజెండాగా చర్చించనున్నారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకుపోతామంటే సీఎం కేసీఆర్‌ చూస్తూ ఊరుకోరని అన్నారు. కృష్ణానదిపై పెండింగ్‌లోఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులు కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాకే పూర్తి చేశారని చెప్పారు. గోదావరిలో తెలంగాణకు పుష్కలమైన నీటివాటా ఉన్నదని, అక్కడ ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఆ వాటా పూర్తికాదని అన్నారు. శ్రీశైలం విద్యుత్‌ ప్రాజెక్టులో జరిగింది కేవలం ప్రమాదం మాత్రమేనని అన్నారు. కుట్ర అనేది ఘోరమైన ఆరోపణ అని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో పిల్లాయిపల్లి కాలువ నిర్మాణంలో 17 గుంటల భూమి పోతున్న అంశం చాలా చిన్నదని, అయితే అధికారులపై గుత్తా మోహన్‌రెడ్డి తుపాకీ చూపించడంతో పెద్దదిగా మారిందన్నారు.


logo