గురువారం 04 జూన్ 2020
Telangana - May 02, 2020 , 16:20:32

హైదరాబాద్‌ నగర మాస్టర్‌ ప్లాన్‌ను అప్‌డేట్‌ చేస్తాం:మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ నగర మాస్టర్‌ ప్లాన్‌ను అప్‌డేట్‌ చేస్తాం:మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: బుద్ధభవన్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ తదితరులు హాజరయ్యారు. ఎస్‌ఆర్‌డీపీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కేంద్ర సడలింపుల నేపథ్యంలో చేయాల్సిన పనులు, పెండింగ్‌ ప్రాజెక్టులపై సమీక్ష చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ..' ప్రస్తుతం నగరంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు అధికారులు మరింత వేగంగా ముందుకు పోవాలి.  ఇది వర్కింగ్‌ సీజన్‌..ఒక నెలపాటు పనులు చేయవచ్చు. జూన్‌ నుంచి వర్షాలు వస్తాయి. హైదరాబాద్‌ను ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యం. దేశంలో లాక్‌డౌన్‌ను చక్కగా వినియోగించుకున్న  రాష్ట్రంగా తెలంగాణకు మంచి గుర్తింపు లభించింది. మే నెలలో మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. లింక్‌ రోడ్లలో ఆటంకాలు ఉన్న చోట భూసేకరణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నిర్వాసితుల పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాలని' మంత్రి సూచించారు. 

'జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న లింక్‌ రోడ్ల వెడల్పు 120 అడుగులు ఉండాలి. ఎస్‌ఆర్‌డీపీ, లింక్‌, సర్వీస్‌ రోడ్లను పొడిగించేందుకు హెచ్‌ఎండీఏ, ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవాలి. భవిష్యత్‌ అవసరాలు, పెరిగే ట్రాఫిక్‌ రద్దీని అంచనా వేసి పనులు చేపట్టాలి. హైదరాబాద్‌ నగర మాస్టర్‌ ప్లాన్‌ను అప్‌డేట్‌ చేస్తాం. రైల్వే అండర్‌ పాస్‌లు, రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలతో పాటు, కొత్త ప్రాజెక్టులకు కూడా అవసరమైన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను' మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.  


logo