మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 02:13:30

ఆదుకుంటాం.. అధైర్యపడొద్దు

ఆదుకుంటాం.. అధైర్యపడొద్దు

  • హైదరాబాద్‌ ప్రజలకు కేటీఆర్‌ హామీ
  • ఉదయం నుంచి పొద్దుపోయేదాకా నగరంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన
  • ముంపు బాధితులకు పరామర్శ
  • వరద పరిస్థితిపై ఉదయాన్నే సమీక్ష
  • సహాయచర్యలపై అధికారులు, నేతలు, కార్పొరేటర్లకు ఆదేశాలు

హైదరాబాద్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో వరద ముంపు బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటామని.. ఎవరూ అధైర్యపడొద్దని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు భరోసానిచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం సహాయ కేంద్రాలను ఏర్పాటుచేసి.. దాదాపు 80 వేల మందికి అన్నపూర్ణ కేంద్రాల ద్వారా భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. రెండ్రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షంతో నగరంలో పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రి కేటీఆర్‌ బుధవారం ఉదయమే సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో కలిసి జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి చేరుకొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి పురపాలకశాఖ విభాగాల అధిపతులు, హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో అం దుబాటులో ఉండాలని.. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు సహాయచర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బాధితులను సమీపంలోని ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్ల కు తరలించాలన్నారు. వారికి ఆహారంతోపాటు అవసరమైన దుప్పట్లు, వైద్యసదుపాయం కల్పించాలని కోరారు. అధికారులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితులకనుగుణంగా ఇప్పటికే సహాయ చర్యలు చేపడుతున్నారని.. ప్రభుత్వం వైపునుంచి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రెండురోజులపా టు భారీవర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తిచేశారు. 

కష్టం తెలుసుకుని.. ఓదార్చి..

మంత్రి కేటీఆర్‌ బుధవారం ఉదయం నుంచి రాత్రి దాకా హైదరాబాద్‌లోని పలు ముంపు ప్రాంతాల్లో కలియతిరిగారు.  బైరామల్‌గూడ, రామంతాపూర్‌, హబ్సిగూడ, సలీంనగర్‌, ఎల్బీనగర్‌, మలక్‌పేట, చాదర్‌ఘాట్‌తోపాటు పాతబస్తీలోని అనేక ప్రాంతా ల్లో పర్యటించారు. వరద పరిస్థిని స్వయంగా పరిశీలించి.. అవసరమైన చర్యలపై అక్కడికక్కడే ఆదేశాలు జారీచేశారు.

భోజనం అందిందామ్మా!

మలక్‌పేట హైటెక్‌ గార్డెన్‌లో ఆశ్రయం పొందుతున్న బాధితులను కేటీఆర్‌ పరామర్శించారు. తమ సమస్యలు చెప్పేందుకు వచ్చినవారిని ఆప్యాయంగా పలుకరించిన కేటీఆర్‌.. భోజనం అందిందామ్మా? అని అడిగారు. ‘తిన్నాం సార్‌' అని వారు బదులివ్వగానే.. మరో రెండురోజులు శిబిరాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్థానిక కార్పొరేటర్లు, అధికారులు అవసరమైన ఆహారం, దుప్పట్లు అందిస్తారని చెప్పారు.  

స్వాతికి సాంత్వన

తమ ఇల్లు వరదలో చిక్కుకుని, కూలిపోయేలా ఉన్నదనిస్వాతి అనే యువతి మంత్రికి వివరించింది. సమీపంలోని డీజేఆర్‌ గార్డెన్‌లో శిబిరం ఏర్పాటుచేశామని.. ఆహారం, మందులు అందజేస్తామని కేటీఆర్‌ ఆమెకు ధైర్యం చెప్పారు. ఇంటి కి కావాల్సిన నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.

బావమ్మా.. బాధపడకు..

‘ముప్ఫైఏండ్ల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాం సార్‌.. ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోయింది.. ఆదుకోండి’ అంటూ బైరామల్‌గూడకు చెందిన బావమ్మ మంత్రి కేటీఆర్‌ను వేడుకున్నది. స్పందించిన కేటీఆర్‌.. బావమ్మ ఇంటిని స్వయంగా పరిశీలించారు. బాధపడొద్దని సూచి స్తూ నష్టపరిహారం అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. 

మూసారంబాగ్‌ వద్ద బ్రిడ్జి

మూసారాంబాగ్‌ వద్ద మూసీపై ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి స్థానంలో ఎలివేటెడ్‌ బ్రిడ్జిని నిర్మిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మూసారంబాగ్‌ బ్రిడ్జి, ముంపునకు గురైన సలీంనగర్‌ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వరద కారణంగా ఫెన్సింగ్‌ కొట్టుకుపోయిన బ్రిడ్జిని పరిశీలించారు. సహాయచర్యలకు విఘాతం కలుగకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నాణ్యతను పూర్తిగా పరిశీలించాకే బ్రిడ్జిని తెరువాలని సూచించారు. 


logo