శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 23:10:55

నిత్య చైతన్యానికి నిలువెత్తు రూపం

నిత్య చైతన్యానికి  నిలువెత్తు రూపం

కల్వకుంట్ల తారకరామారావు.. టీఆర్‌ఎస్‌  పార్టీలోనూ, రాష్ట్ర ప్రభుత్వంలోనూ తారకమంత్రం.  ప్రజా శ్రేయస్సు, అభివృద్ధి తపస్సు ఇవే ఆయనకు తెలిసిన విషయాలు. ఆశ్రిత పక్షపాతం, సిఫారసులకు తలవొగ్గడమనేవి ఆయనకు తెలియని విషయాలు. ఏదైనా ఒక పనివల్ల ప్రజలకు ఎంత ఉపయోగం.. అభివృద్ధికి ఏ మేరకు దోహదం అన్న విషయాలే ఆయనకు తెలుసు. విస్తృత ప్రయోజనాలు న్నాయనుకుంటే.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆయన ముందుకే సాగుతారు. రాజకీయ నాయకుల్లో  ప్రత్యర్థుల నుంచి కూడా ప్రశంసలందుకునే నేతలు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన నేతల్లో కేటీఆర్‌ ముందువరుసలో నిలుస్తారు. సంక్షోభంలోనూ ప్రగతి అవకాశాలను అన్వేషించే సాహసి కేటీఆర్‌... 

కరోనా కష్టకాలంలో ప్రపంచమంతా స్తంభించిపోతే.. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మౌలిక సదుపాయాల కల్పనారంగం నాణ్యమైన పనులతో ప్రగతి పరుగులు తీసింది. దీనికి కేటీఆర్‌ సృజనాత్మక ఆలోచనే కారణం.  విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో ‘ట్రాఫికర్‌' లేకుండా చేయడానికి రోడ్లు, వంతెనల నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి కేటీఆర్‌ లాక్‌డౌన్‌ సమయాన్ని అవకాశంగా తీసుకున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా.. ఫ్లై ఓవర్లు, అప్రోచ్‌ రోడ్లు, స్టీల్‌ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టి అత్యంత వేగంగా పూర్తయ్యేలా చేశారు. ఎన్నడూ లేనివిధంగా కేవలం నాలుగు నెలల వ్యవధిలో దాదాపు రూ. రెండు వేల కోట్ల విలువైన రోడ్ల అభివృద్ధి పనులు కరోనా సమయంలో పూర్తయ్యాయంటే అందుకు కేటీఆర్‌ చొరవ, పట్టుదల, దీక్షా దక్షతలే కారణం.

 కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులతో సహపంక్తి భోజనం చేసి వారిలో మనోధైర్యాన్నీ నింపారు. కరోనా విజృంభణతో అన్నిరంగాలూ కుదేలై.. ఆ ప్రభావం అధికంగా ఐటీరంగం మీదే పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీరంగం ఒడిదుడుకులకు లోనైతే తెలంగాణలో మాత్రం ఆ ప్రభావం కనిపించలేదు. అందుకు ఐటీ మంత్రిగా కేటీఆర్‌ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలే కారణం.   కేటీఆర్‌ పనులు, వాటి నాణ్యత విషయంలో చాలా కచ్చితంగా వ్యవహరిస్తారు. అదే సమయంలో ట్విట్టర్‌ వేదికగా ఆయన సహాయం కోరేవారికి  అందిస్తున్న సహాయం గురించి ఎంతచెప్పినా తక్కువే.    లాక్‌డౌన్‌తో చెట్టుకొకరు, పుట్టకొకరుగా ఉన్న వారిని ఆదుకోవడంలో కేటీఆర్‌ చూపిన మానవీయమైనది. హైదరాబాద్‌ మెట్రో ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీ కేటీఆర్‌ పని తీరుకు ముగ్ధుడయ్యారు.ప్రత్యేకంగా అభినందించారు. అభివృద్ధి, సంక్షేమాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్న ప్రజా నేత కేటీఆర్‌ అనడంలో సందేహం లేదు. జన హృదయాల్లో ఆత్మీయుడిగా స్థానం ఏర్పర్చుకున్న కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఆపన్నులను ఆదుకోవడంలోనూ ఆలస్యం చేయరు. సామాజిక మాధ్యమంలో అత్యంత చురుగ్గా ఉండే కేటీఆర్‌ సహాయం కావలసిన వారిని ఆదుకోవడంలో ముందుంటారు. అభివృద్ధికి సాంకేతికతను అనుసంధానిస్తూ అన్నిరంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు అహరహం కృషిచేస్తున్నారు. 

డాక్టర్‌ సంగని మల్లేశ్వర్‌


logo