గురువారం 02 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 01:53:30

ఆనందం పంచేలా ‘ఈ-చదువులు’

ఆనందం పంచేలా ‘ఈ-చదువులు’

  • ఆన్‌లైన్‌ విద్యలో అగ్రగామిగా నిలవాలి
  • విద్యార్థులకు అందుబాటులో టీశాట్‌ చానళ్లు: మంత్రి కేటీఆర్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి టీశాట్‌ నెట్‌వర్క్‌ చానళ్లు అందుబాటులో ఉండాలని అధికారులకు ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. ఆన్‌లైన్‌ బోధనలో రాష్ట్రం అగ్రగామిగా నిలువాలని, నాణ్యమైన కంటెంట్‌ అందించేలా విద్యాశాఖ, టీశాట్‌ సమన్వయంతో కలిసిపనిచేయాలని తెలిపారు. విద్యాబోధన ఆనందభరితంగా, ఆహ్లాదకరంగా ఉండేలా కంటెంట్‌ రూపొందించాలని ఆదేశించారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని టీశాట్‌ నెట్‌వర్క్‌ కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. టీశాట్‌ ప్రస్తుత ప్రసారాలు, భవిష్యత్తు ప్రసారాలపై సూచనలు, సలహాలు అందించారు. ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు విద్యాబోధన ఉండాలన్నారు. ఇప్పటికే విద్యార్థులు, నిరుద్యోగులకు పాఠ్యాంశాల బోధన, అవగాహన ప్రసారాలకు సంబంధించి టీశాట్‌ విద్య, నిపుణ చానళ్లు మంచి ఫలితాలను సాధించాయని ప్రశంసించారు. శాటిలైట్‌ ప్రసారాలు అందుబాటులో ఉన్నాయని, యూట్యూబ్‌లో వచ్చిన 5.38 కోట్ల వ్యూస్‌ చానళ్ల ప్రాధాన్యతను తెలుపుతున్నాయన్నారు. 3,95,400 సబ్‌స్క్రిప్షన్స్‌, 50.4 లక్షల గంటల వాచ్‌ టైమ్‌ ఉండడం సంతోషించాల్సిన విషయమని అభినందించారు. డీటీహెచ్‌, కేబుల్‌, ఆర్వోటీ, ఓటీటీ వంటి ప్రసార మార్గాలన్నింటిలో టీశాట్‌ నెట్‌వర్క్‌ చానళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు. ఆన్‌లైన్‌ బోధనకు ప్రాధాన్యత పెరగనున్న నేపథ్యంలో మరిన్ని చానళ్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధం కావాలన్నారు. విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులతో కలిసి పనిచేసేలా సంయుక్త కార్యాచరణను రూపొందించాలని, విద్యాశాఖతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఐటీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, టీశాట్‌ సీఈవో ఆర్‌ శైలేష్‌రెడ్డి, డిజిటల్‌ మీడియా డైరెక్డర్‌ కొణతం దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.logo