నేతన్నకు చేయూతనివ్వండి

- కొవిడ్ ముగిసేదాకా స్వల్పకాలిక పాలసీ సపోర్ట్ చేయాలి
- కనీసం 50% యార్న్ సబ్సిడీ ఇవ్వాలి
- చేనేత, జౌళి పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలి
- వార్షిక బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించండి
- కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్క్‌ను ఆదుకోవాలి
- సిరిసిల్లను మెగాపవర్ క్లస్టర్‌గా గుర్తించాలి
- బ్లాక్లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లు మంజూరుచేయాలి
- హ్యాండ్లూమ్స్పై రెండేండ్లపాటు జీఎస్టీని ఎత్తేయాలి
- పవర్లూమ్ అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు సిద్ధం
కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో కొట్టుమిట్టాడుతున్న చేనేత, జౌళి రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు ఆర్థికంగా చేయూతనివ్వడంతోపాటు, సిరిసిల్లలో మెగాపవర్ క్లస్టర్ మంజూరుకు సహకరించాలి. కరోనా సమస్య తొలగిపోయేదాక స్వల్పకాలిక పాలసీ సపోర్ట్ అవసరం. తెలంగాణకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని మంజూరు చేయాలి. చేనేత పరిశ్రమను ఆదుకొనేందుకు కనీసం 50 శాతం యార్న్ సబ్సిడీ అవసరం. హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై రెండేండ్లపాటు జీఎస్టీని ఎత్తేయాలి.
- కేంద్రమంత్రికి రాసిన లేఖలో మంత్రి కేటీఆర్
ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వచ్చే వార్షిక బడ్జెట్లో రాష్ట్ర చేనేత, జౌళి పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఐటీ, చేనేత జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు కేంద్రప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమ ఔన్నత్యానికి అన్ని విధాలా సహకారమందించాలని విజ్ఞప్తిచేశారు. వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు ఆర్థికంగా సహకరించాలని, సిరిసిల్లలో మెగాపవర్ క్లస్టర్ మంజూరుకు కృషిచేయాలని అభ్యర్థించారు. కరోనా సమస్య సమసిపోయేదాకా స్వల్పకాలిక పాలసీ సపోర్ట్ అందించాలని కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ గురువారం కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. రాష్ట్రంలో చేనేత, జౌళి పరిశ్రమ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన పలు అంశాలను వివరించారు. మంత్రి కే తారకరామారావు రాసిన లేఖలోని పూర్తి వివరాలు..
‘కాకతీయ’లో వసతులకు 300 కోట్లు
తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ.1,552 కోట్ల ఖర్చుతో వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ను చేపట్టింది. ఇందులో మౌలిక వసతుల కల్పనకు దాదాపు రూ.1,100 కోట్లు అవసరమవుతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మెగా టెక్స్టైల్ పార్క్ పథకంలో భాగంగా కాకతీయ మెగాపార్క్కి మద్దతు అందించాలి. ఈ పథకం ద్వారా రూ.500 కోట్లు అందించే అవకాశమున్న నేపథ్యంలో కాకతీయ మెగాపార్క్లో వసతుల కల్పనకు అందులోనుంచి కనీసం రూ.300 కోట్లు మంజూరు చేసి ఆర్థికంగా చేయూతనందించాలి.
పవర్‌లూం క్లస్టర్‌గా సిరిసిల్ల
కేంద్ర ప్రభుత్వ పథకం కింద 5 వేల మందికిపైగా పవర్లూమ్ మగ్గాలు ఉండే ప్రాంతాలకు కాంప్రహెన్సివ్ పవర్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీమ్ పథకం వర్తిస్తుంది. ఈ పథకంలో భాగంగా సిరిసిల్ల పవర్లూమ్ క్లస్టర్‌కు సహాయమందించాలి. ఇందులోభాగంగా టెక్నాలజీ అక్రెడిటేషన్, నైపుణ్యఅభివృద్ధి, మౌలిక వసతుల కింద కేంద్ర సహాయం అందించేందుకు వీలు కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పవర్లూమ్ మగ్గాలకు జియో ట్యాగింగ్ చేసింది. రాష్ట్రంలో ఉన్న 35,600 పవర్లూమ్ మగ్గాల్లో సిరిసిల్లలోనే 25,500 ఉన్నాయి. ఈ కారణంగా సిరిసిల్లను మెగాపవర్ క్లస్టర్‌గా గుర్తించాలి. పవర్లూమ్, మెగా సిల్క్క్లస్టర్ ప్రాజెక్టు కింద కేంద్రం సుమారు రూ.100 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించే వీలుంది. తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్లలో అనేక కార్యక్రమాలు చేపట్టింది. దీనిని మరింత విస్తరించేందుకు, ఆధునీకరించేందుకు నిధులు అవసరం. వాల్యూచైన్ బలోపేతం, మార్కెట్ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, కెపాసిటీ బిల్డింగ్, ప్రాజెక్ట్ మానిటరింగ్ వంటి ఖర్చుల నిమిత్తం సుమారు రూ.994 కోట్లు అవసరమవుతాయి. పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం. ఈ కార్పొరేషన్ ద్వారా సుమారు రూ.756 కోట్లు భరించేందుకు సంసిద్ధం.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ
రాష్ట్రంలో పవర్లూమ్తోపాటు, చేనేత పరిశ్రమ అత్యంత ప్రాధాన్యం కలిగి ఉన్నది. సుమారు 40 వేల హ్యాండ్లూమ్ కార్మికులు పని చేస్తున్నారు. చేనేత కళపైన డిప్లొమా చేసేందుకు అవకాశం లేక ఇక్కడి విద్యార్థులు ఏపీ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ర్టాలకు వెళ్లి శిక్షణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ర్టానికి ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ’ సంస్థను మంజూరు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇందుకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాలో అవసరమైన స్థలం అందుబాటులో ఉన్నది. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లను మంజూరు చేయాలని కోరారు.
పరిశ్రమపై కొవిడ్ దెబ్బ
కొవిడ్ కారణంగా చేనేత, జౌళి పరిశ్రమలో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. పలు కంపెనీలు తమ కార్యకలాపాలను పునరుద్ధించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాటి రికవరీ మెల్లగా జరిగే అవకాశం ఉన్నది. లక్షల మంది ఉపాధిపొందుతున్నవారి సంక్షేమం దృష్ట్యా కొన్ని అంశాలకు కేంద్రం బడ్జెట్లో ఊరట కల్పించాలి. కొవిడ్ సంక్షోభం ముగిసేదాకా కేంద్రం నుంచి స్వల్పకాలిక ‘పాలసీ సపోర్ట్' రావాలి. కార్మికులకు ఆర్నెళ్లపాటు జీతాలు చెల్లించేందుకు వీలుగా పరిశ్రమలకు దీర్ఘకాలిక రుణాలు అందించాలి. ఇప్పటికే బంగ్లాదేశ్‌లాంటి దేశాల్లో పరిశ్రమలకు ఇలాంటి మద్దతు లభిస్తున్నది. పీఎఫ్, ఈఎస్ఐ డిపాజిట్ల గడువును మూడ్నెళ్లపాటు పొడిగించాలి. కేంద్రం ప్రకటించిన ‘రిబేట్ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ లేవిస్' పథకాన్ని మరింతగా విస్తరించాలి. ఈ పరిశ్రమ చేసే ఎగుమతులకు సహకారం అందించడంతోపాటు జీఎస్టీ పన్ను రీఫండ్లను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. కనీసం 50 శాతం యార్న్ సబ్సిడీ ఇవ్వడంతోపాటు, హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై రెండేండ్లపాటు జీఎస్టీని ఎత్తివేయాలి.
కేంద్రానికి సలహాలు, సూచనలు
పరిశ్రమకు మరిన్ని అంతర్జాతీయ, జాతీయస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రం కొన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. పరిశ్రమ స్థాపించేందుకు ప్రధాన అడ్డంకులైనా వేజ్ కాస్ట్, పవర్కాస్ట్ విషయంలో మద్దతివ్వాలి. ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్ఐ విషయంలో ప్రభుత్వం ఇచ్చే నిధుల సహకారాన్ని గతంలో మాదిరి కొనసాగించాలి. కేంద్రం గతేడాది ప్రకటించిన కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు మాదిరి మరిన్ని సంస్కరణలు ఈ పరిశ్రమలో తీసుకొస్తే విదేశాల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నది. ప్రస్తుత సమయంలో పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తెలంగాణప్రభుత్వం సిద్ధంగా ఉన్నది.
తాజావార్తలు
- రామ మందిరానికి వజ్రాల వ్యాపారుల రూ.17 కోట్ల విరాళాలు
- ఆఫ్ఘన్లో కారుబాంబు పేలుడు:35 మంది మృతి
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయావతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్‌తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ