మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 03, 2020 , 02:23:45

రైతుకు బహుముఖ ప్రోత్సాహం

రైతుకు బహుముఖ ప్రోత్సాహం
  • అన్నివిధాలుగా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌
  • ఓ రైతు సీఎంగా ఉన్నందునే సంక్షేమ కార్యక్రమాలు
  • కొత్తపుంతలు తొక్కుతున్న వ్యవసాయరంగం
  • డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, వైస్‌చైర్మన్లతో సమావేశంలోటీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారక రామారావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: స్వయంగా రైతు అయిన కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండటంవల్లే రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధితోపాటు, రైతు సంక్షేమానికి అనేక కార్యక్రమాలు, పథకాలు అమలవుతున్నాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీరు, సాగు పెట్టుబడికోసం రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర.. ఇలా అన్నిరకాలుగా ప్రోత్సాహంతో రాష్ట్రంలో వ్యవసాయరంగం కొత్తపుంతలు తొక్కుతున్నదని తెలిపారు. సోమవారం తెలంగాణభవన్‌లో డీసీసీబీ, డీసీఎంఎస్‌ నూతన చైర్మన్లు, వైస్‌చైర్మన్లతో కేటీఆర్‌ సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, గంగుల కమలాకర్‌, మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్లుగా, వైస్‌చైర్మన్లుగా ఎన్నికైనవారికి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. సహకార ఎన్నికలను సవాల్‌గా తీసుకొని ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రతి జిల్లా మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. కేసీఆర్‌కు రైతులంటే ప్రత్యేకమైన ప్రేమ ఉన్నదని చెప్పారు. 


అనునిత్యం తమను విమర్శించే వర్గాలు సైతం ఈ రోజు సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిఫలాలను అంగీకరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పెద్దఎత్తున వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి వ్యవసాయరంగం కోసం ప్రత్యేక చొరువ తీసుకున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా రైతు సంక్షేమంకోసం ముందుకెళుతున్నామని.. ఒకవైపు భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతూనే.. వివిధ పథకాలను అమలుచేస్తున్నామని వివరించారు. అందుకే రైతులు టీఆర్‌ఎస్‌పై అపారమైన ప్రేమతో 906 సంఘాల్లో 94 శాతానికిపైగా గెలిపించి అపూర్వమైన విజయాన్ని అందించారని హర్షం వ్యక్తంచేశారు. కేంద్రప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ రైతులకు హామీఇచ్చిన మేరకు రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీచేశారని కేటీఆర్‌ తెలిపారు. రైతులకు ఇచ్చినమాట మేరకు ఆర్థిక పరిమితులున్నప్పటికీ కేసీఆర్‌ దృఢసంకల్పంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్‌ చెప్పారు. 


ఇదీ అసలైన సామాజికన్యాయం అంటే..

ప్రతి ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కు తిరుగులేని విజయాన్ని అందిస్తూ వస్తున్నారని.. సహకార ఎన్నికల్లోనూ గెలిపించి పార్టీని మరింతగా బలోపేతం చేశారని కేటీఆర్‌ కొనియాడారు. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవుల్లో 45 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించామని తెలిపారు. ఆదిలాబాద్‌ నుంచి దళితుడ్ని, మహబూబ్‌నగర్‌ నుంచి మైనార్టీని, అనేకచోట్ల బీసీలను చైర్మన్లుగా ఎంపిక చేసుకున్నామన్నారు. ఎలాంటి రిజర్వేషన్లు లేకున్నా కేసీఆర్‌ ప్రత్యేక చొరువతో బలహీన, బడుగువర్గాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఎన్నికలముందు ఎలాంటి హామీ ఇవ్వకున్నా.. ఫలితాల తర్వాత అసలైన సామాజిక న్యాయం అంటే ఏమిటో చూపిస్తున్నారని చెప్పారు. పురపాలక ఎన్నికల్లోనూ నిర్ధారిత రిజర్వేషన్ల కన్న ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు పెద్దపీట వేశారన్నారు. వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను రైతుల్లోకి పెద్దఎత్తున తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎల్లవేళలా రైతుల మధ్యలో ఉంటూ రైతుల సంఘటితశక్తిని వారి సంక్షేమం కోసం వాడుకునేలా సహకార సంఘాల నేతలు పనిచేయాలని సూచించారు. రైతాంగ సమస్యలపైన ప్రతిపక్షాల దుష్ప్రచారాలను గట్టిగా తిప్పి కొట్టా ల్సిన బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.


logo
>>>>>>