ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 19:21:36

ప్రైవేటు ఆస్ప‌త్రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోండి : మంత్రి కేటీఆర్‌

ప్రైవేటు ఆస్ప‌త్రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోండి : మంత్రి కేటీఆర్‌

హైద‌రాబాద్ : కోవిడ్ రోగుల నుండి ఫిర్యాదులు ఎదుర్కొంటూ అధిక మొత్తంలో మెడిక‌ల్ బిల్లులు వ‌సూలు చేస్తున్న‌ ప్రైవేటు ఆస్ప‌త్రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా రాష్ర్ట వైద్యారోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను మంత్రి కేటీఆర్ కోరారు. ప్రైవేటు ఆస్ప‌త్రి వ‌ల్ల త‌ను ఎదుర్కొన్న దుర్భ‌ర ప‌రిస్థితుల‌ను వివ‌రిస్తూ మ‌హేశ్వ‌రం మండ‌లం, దుబ్బ‌చెర్ల గ్రామానికి చెందిన అన్రెడ్డి రాధేష్ అనే యువ‌కుడు ట్విట్ట‌ర్ ద్వారా మంత్రికి ఫిర్యాదు చేశాడు. కోవిడ్‌-19 కార‌ణంగా త‌న‌ తండ్రి, త‌ల్లి, సోద‌రుడిని కోల్పోయిన‌ట్లు తెలిపాడు.

క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో రాధేష్ కుటుంబ స‌భ్యులు హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స నిమిత్తం చేరారు. రాధేశ్‌కు సైతం క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ల‌క్ష‌ణాలు లేక‌పోవ‌డంతో హోం ఐసోలేష‌న్‌లో ఉన్నాడు. స‌రైన చికిత్స అందించ‌క‌పోవ‌డం, అదేవిధంగా అధిక బిల్లులు వ‌సూలు చేయ‌డంపై యువ‌కుడు మంత్రి కేటీఆర్‌కు ట్విట్ట‌ర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ముగ్గురు కోవిడ్ రోగుల చికిత్సకు ఇప్ప‌టికే ఆస్ప‌త్రికి రూ. 40 ల‌క్ష‌లు చెల్లించిన‌ట్లుగా తెలిపాడు. అయినా మిగ‌తా బిల్లు క్లియ‌ర్ చేయ‌క‌పోతే తండ్రి మృత‌దేహాన్నిఅప్ప‌గించేది లేదంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ రాధేష్‌కు జ‌రిగిన న‌ష్టం గురించి తీవ్ర వేద‌న వ్య‌క్తం చేశారు. ఈ క‌ష్ట‌ సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి పాల్ప‌డ‌టం సిగ్గుచేటు అన్నారు. ఇటువంటి బాధ్యతా రహితమైన సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను కోరుతున్న‌ట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. 


logo