గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 01:24:51

వరంగల్‌కు మోనో, మెట్రో రైలు

వరంగల్‌కు మోనో, మెట్రో రైలు
  • ప్రతిపాదనలు సిద్ధంచేయండి
  • మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
  • పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌
  • హైదరాబాద్‌లో వరంగల్‌ ప్రతినిధులతో భేటీ
  • కుడా మాస్టర్‌ ప్లాన్‌కు ఆమోదం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వరంగల్‌ నగరంలో 15 కిలోమీటర్ల మేర మోనో రైలుతోపాటు హైదరాబాద్‌ తరహాలో మెట్రోరైలు ప్రతిపాదనలను సిద్ధంచేయాలని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు.. అధికారులను ఆదేశించారు. మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు వెల్లడించారు. బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన సమావేశంలో వరంగల్‌ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సమక్షంలో కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) మాస్టర్‌ప్లాన్‌కు ఆమోదం తెలిపారు. ప్లాన్‌ ఫైల్‌పై సంతకం చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. 2020-2041 వరకు భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ మాస్టర్‌ ప్లాన్‌తో వరంగల్‌ మహానగరానికి మహర్దశ పట్టనున్నదని చెప్పారు. అన్నిరంగాల్లో వరంగల్‌ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధంచేసి, పనులు వేగంగా పూర్తిచేయాలన్నారు. వరంగల్‌కు మంజూరైన 68 కి.మీ. రింగ్‌రోడ్డులో 29 కి.మీ. మేర పనులను మేనెల చివరినాటికి పూర్తిచేసి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2న ప్రారంభించాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. వరంగల్‌ స్మార్ట్‌సిటీ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా నగరంలో దసరాలోపు 1000 పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణాలను పూర్తిచేయాలని చెప్పారు. పందుల నివారణకు పటిష్ఠ ప్రణాళిక రూపొందించాలని, ప్రజాప్రతినిధులు జోక్యంచేసుకొని పెంపకందార్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని సూచించారు.


దసరానాటికి 3900 డబుల్‌ బెడ్‌రూంలు

సీఎం కేసీఆర్‌ వరంగల్‌కు వచ్చిన సందర్భం గా ఇచ్చిన హామీలను వేగంగా అమలుచేయాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. 3,900 డబుల్‌ బెడ్‌రూంలను మంజూరుచేశారని, వీటిని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని చెప్పారు. ఇప్పటికే పూర్తయిన 900 ఇండ్లను త్వరలో ప్రారంభించాలని, దసరానాటికి మిగతావాటి నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు. కాళోజీ కళాక్షేత్రం, ఏకశిలా పార్కు నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, రోడ్లవిస్తరణ పనులు కూడా వేగంగా చేపట్టాలని సూచించారు. శానిటేషన్‌ ప్రణాళికలను, గ్రీనరీప్లాన్‌ తయారుచేయాలన్నారు. నగరానికి నాలుగువైపుల డంపింగ్‌ యార్డులను గుర్తించాలని చెప్పారు.


శివారుప్రాంతాలకు మూడోవంతు నిధులు

శివారు ప్రాంతాల అభివృద్ధి జరిగేలా కార్పొరేషన్‌ బాధ్యత తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. కార్పొరేషన్‌లో కలిసిన శివారు ప్రాంతాలకు ఆ కార్పొరేషన్‌ బడ్జెట్‌లో మూడోవంతు నిధులు కేటాయించి ఖర్చుచేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని, కచ్చితంగా దీన్ని అమలుచేయాలన్నారు. ఈ నెల 16న మరోసారి సమావేశమై ముఖ్యమైన అంశాలపై చర్చిస్తామని, అధికారులు పూర్తి సమాచారంతో రావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, టీ రాజయ్య, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్‌, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, సీడీఎంఏ సత్యనారాయణ, వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, వరంగల్‌ కమిషనర్‌ పమేలా శత్పథి, ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు, కుడా చీఫ్‌ ఫ్లానర్‌ అజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo