ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 29, 2020 , 17:49:45

అమిత్‌షా వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌

అమిత్‌షా వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌

హైదరాబాద్‌:  ఆరేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చిందని మంత్రి కేటీఆర్‌ బీజేపీ నేతలను ప్రశ్నించారు. మోదీ సర్కార్‌ వరదసాయం కింద రూ.25వేలు ఇస్తే ఎవరైనా ఆపుతున్నారా? అని విమర్శించారు.  హైదరాబాద్‌కు గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ తదితర ప్రముఖ కంపెనీలను తెచ్చింది ఎవరు? అని  కేటీఆర్‌ అడిగారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గం శాంతినగర్‌ చౌరస్తాలో కేటీఆర్‌ రోడ్‌షో నిర్వహించారు.

'పొలిటికల్‌ టూరిస్టులందరికీ స్వాగతం. కేంద్ర మంత్రులు ఉత్తచేతులతో వచ్చారు. వరదలు వచ్చినప్పుడు నేను, మంత్రులు నగరంలో తిరిగాం.  వరదసాయం చేస్తే కేసీఆర్‌ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని ఆపారు.    జంగల్‌రాజ్‌ నుంచి వచ్చిన ఉత్తరప్రదేశ్‌ సీఎం ఇక్కడకు వచ్చి నీతులు చెబుతున్నారు. మాది నిజాం సంస్కృతి కాదు అమిత్‌షా గారు. మీరు చెప్పేది వినేందుకు ఇది అహ్మదాబాద్‌ కాదు..హుషారైన హైదరాబాద్‌. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న నరేంద్ర మోదీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు.  జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15లక్షలు ఎంతమందికి వేశారు?' అని కేటీఆర్‌ అన్నారు.

'హైదరాబాద్‌లో ఎలాంటి గొడవలు, కర్ఫ్యూలు లేవు. హైదరాబాద్‌లో మంచి వాతావరణం ఉంది కాబట్టే భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.  ఇది అందరి హైదరాబాద్‌..కానీ దీన్ని కొందరి హైదరాబాద్‌గా చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు.   ఐటీఆర్‌ను రద్దు చేసినవాళ్లు ఐటీహబ్‌ చేస్తారా?  బేచో ఇండియా అని మోదీ కొత్త స్కీమ్‌ పెట్టారని' కేటీఆర్‌ పేర్కొన్నారు.