మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 02:26:27

డిజిటల్‌ మీడియాలో మేటి

డిజిటల్‌ మీడియాలో మేటి

  • ఆన్‌లైన్‌ ద్వారా విస్తృతంగా ప్రభుత్వ సేవలు
  • ఐటీశాఖ దన్నుతో పక్కాగా పోర్టల్స్‌ 
  • తెలంగాణ సీఎంవో ట్విట్టర్‌ మొదటిస్థానంలో
  • ప్రభుత్వ పోర్టల్స్‌, మాధ్యమాలకు కోట్ల వ్యూస్‌
  • ‘డిజిటల్‌ తెలంగాణ- డిజిటల్‌ మీడియా’ రిపోర్టును విడుదలచేసిన ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ పాలనా వ్యవహారాలపై సమగ్ర పోర్టల్‌.. సీఎం కార్యాలయం, ఐటీ శాఖలకు ప్రత్యేక వెబ్‌సైట్‌.. అసత్య ప్రచారాలను దనుమాడే ఫ్యాక్ట్‌చెక్‌.. ప్రతి సందర్భానికీ ప్రత్యేక అంతర్జాల వేదికలతో తెలంగాణ డిజిటల్‌ మీడియాలో దూసుకుపోతున్నది. రాష్ట్రంగా ఏర్పడిన ఆరేండ్లలోనే డిజిటల్‌ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. సాంకేతికతను గరిష్ఠస్థాయిలో వినియోగించుకుంటూ ప్రభుత్వంలో అన్ని శాఖలకు ఆన్‌లైన్‌ సేవలను విస్తరిస్తున్నది. సీఎంవోతోపాటు ఐటీ మంత్రి కేటీఆర్‌ సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలంగా ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారంలో ఎప్పటికప్పుడు చొరవ తీసుకుంటున్నారు. తెలంగాణ సీఎంవో ట్విట్టర్‌ వినియోగంలో దేశంలో మొదటిస్థానంలో, ఫేస్‌బుక్‌ వినియోగంలో మూడోస్థానంలో ఉన్నది. ఈ మేరకు ఐటీ శాఖలోని డిజిటల్‌ విభాగం రూపొందించిన ‘డిజిటల్‌ తెలంగాణ- డిజిటల్‌ మీడియా’ రిపోర్టును ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం విడుదల చేశారు. కార్యక్రమంలో ఐటీశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌, డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఐటీ శాఖలో భాగమైన డిజిటల్‌ విభాగం తెలంగాణ స్టేట్‌పోర్టల్‌ను సమర్థంగా నిర్వహిస్తున్నది. ఈ పోర్టల్‌ ద్వారా లక్షల మంది తమకు అవసరమైన సమాచారాన్ని వినియోగించుకుంటున్నారు. వినియోగదారులకు వెబ్‌సైట్‌ల నిర్వహణ సులభంగా, రక్షణ కల్పించేలా నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ), గైడ్‌లైన్స్‌ ఫర్‌ ఇండియన్‌ గవర్నమెంట్‌ వెబ్‌సైట్స్‌ (జీఐజీడబ్ల్యూ) మార్గదర్శకాలను రూపొందించింది. తెలంగాణ ప్రభుత్వం ఆ మార్గదర్శకాలను అనుసరించి వెబ్‌సైట్లను నిర్వహణకు టీ-వెబ్‌ ప్రాజెక్టును తీసుకొచ్చింది. ప్రభుత్వ వెబ్‌సైట్లు, పోర్టల్‌లోని ఆధార్‌ సమాచారం, పౌరుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమాచారం లీక్‌కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విజయవంతంగా ముందుకెళుతున్నది. అంతేకాదు కంటిచూపులేని వారు కూడా అన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లు, పోర్టల్‌ల ద్వారా అవసరమైన సమచారాన్ని తెలుసుకునేలా టీ-వెబ్‌ ఏర్పాట్లు చేస్తున్నది.

జిల్లాలకు ఎస్‌3వాస్‌ ప్లాట్‌ఫాం

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన జిల్లాలకు కూడా డిజిటల్‌ మీడియా ఆధ్వర్యంలో ప్రత్యేంగా వెబ్‌సైట్‌ను రూపొందించింది. కేంద్రం సూచనల మేరకు ప్రతిజిల్లా వెబ్‌సైట్‌ను నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో కొనసాగే ఎస్‌3వాస్‌ (సెక్యూర్‌, స్కేలబుల్‌, సుగమ్య వెబ్‌సైట్‌ యాజ్‌ ఏ సర్వీస్‌) ప్లాట్‌ఫాం ద్వారా రూపొందించింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. సెప్టెంబర్‌ 23వ తేదీ వరకు 1,02,64,425 వ్యూస్‌ లభించాయి. ఇక స్టేట్‌ పోర్టల్‌ వ్యూస్‌ 5,89,00,016 గా ఉన్నాయి. 

ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో అందుబాటులో కేటీఆర్‌

ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు. ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ ఫాలోవర్స్‌ 2020 సెప్టెంబర్‌ 23 నాటికి 6,85,546 మంది ఉన్నారు. 2015-16లో 2.59 లక్షలు, 2016-17లో 3.47 లక్షలు, 2017-18లో 4.41 లక్షలు, 2018-19లో 5.02 లక్షలు, 2019-20లో 6.27 లక్షలకు పెరిగారు. ఫేస్‌బుక్‌లో కేటీఆర్‌ ఫాలోవర్స్‌ 5,12,376 ఉన్నారు. మంత్రి కేటీఆర్‌ 2014లో ట్విట్టర్‌ ద్వారా 9.38 లక్షల మందికి చేరువకాగా.. 2020 ఆగస్టు 31 నాటికి 7.37 కోట్ల మందికి దగ్గరయ్యారు. మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాల నుంచి ఫాలోవర్స్‌ ఉన్నారు. అమెరికాలో 17,166, యూఏఈలో 8,670 మంది, సౌదీఅరేబియాలో 8,670 మంది ఫాలో అవుతుండగా.. హైదరాబాద్‌ నుంచి 2.54 లక్షలు, వరంగల్‌ నుంచి 16,528 మంది, కరీంనగర్‌ నుంచి 11,835 మంది అనుసరిస్తున్నారు. 

అసత్యప్రచారాలకు కళ్లెం

ఇతర రాష్ర్టాలకు అనేక రంగాలలో మార్గదర్శిగా నిలిచిన తెలంగాణ తెలుగు సాంస్కృతిక వికాసంలో రాష్ట్రఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పాలనే సంకల్పంతో డిజిటల్‌ మాధ్యమాల్లో తెలుగు వాడకాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నది. అందుకనుగుణంగా డిజిటల్‌ మాధ్యమాల్లో తెలుగు వాడటానికి ఉపయోగపడే పనిముట్లు, అప్లికేషన్స్‌ తదితర సాధనాలను అభివృద్ధి చేసింది. వాటిని ఒకేచోట చేర్చి ప్రత్యేకంగా వెబ్‌పేజీని రూపొందించింది. సోషల్‌మీడియాలో విచ్చలవిడిగా వ్యాప్తి చెందున్న అసత్యప్రచారాలను అడ్డుకొనేందుకు సైతం ఐటీ విభాగం కృషిచేస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు సత్యమా? అసత్యమా? అనేది తెలుసుకొనేందుకు ప్రత్యేక వెబ్‌అప్లికేషన్లను అభివృద్ధి చేసింది. ఫ్యాక్ట్‌లీ మీడియా, పరిశోధన సంస్థతో కలిసి ఫ్యాక్ట్‌చెక్‌ అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది.

తెలంగాణ పోర్టల్‌ ఫాలోవర్స్‌

తెలంగాణ పోర్టల్‌ను 2014లో 37.54 లక్షలు మంది వీక్షించగా ఆ సంఖ్య 2017 నాటికి 96.08 లక్షలకు చేరింది. 2020 ఆగస్టు 31వరకు 49.86 లక్షలు వీక్షించారు. వీరిలో పురుషులు 79.1%, మహిళలు 20.9% ఉన్నారు.

వయస్సుల వారీగా: 18-24 ఏండ్ల మధ్య: 25.7%, 25-34: 39.5%, 35-44 : 19.5%, 45-54 ఏండ్ల 7.5% వీక్షించారు.

వివిధ దేశాల్లో వీక్షణం: వివిధ దేశాల్లో మొత్తం యూజర్లు 16,37,227. అమెరికా- 22,990 (1.4%), యూఏఈ- 5709 (0.35%), సౌదీ అరేబియా 4,571 (0.28%), యూకే నుంచి 2,791 (0.17%), ఆస్ట్రేలియా 2,409 (0.15%) మంది ఉపయోగించారు. 

దేశంలోని ప్రాంతాలు: మొత్తం 1,637,227. హైదరాబాద్‌-1,222,568 (72.03%), సికింద్రాబాద్‌ 34,041 (2.01%), బెంగళూరు- 30,813 (1.82%), చెన్నై- 28,854 (1.70%), విజయవాడ -27,186 (1.06%), విశాఖపట్నం- 19,871 (1.17%), వరంగల్‌- 19,348 (1.14%), పుణె -14,801 (0.08%), ఢిల్లీ-12,685 (0.75%) మంది యూజర్లు ఉన్నారు.

ఇంటివద్దకు ఇంటర్నెట్‌ సేవలు

  • డిజిటల్‌ విప్లవం అనేది అంతర్జాల సేవలను ప్రజలకు చేరువ చేసింది. 
  • దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నవారు 60 కోట్ల మంది.
  • స్మార్ట్‌ ఫోన్లు ఉన్నవారు 45 కోట్ల మంది
  • 42 శాతం మంది భారతీయులు సామాజిక మాధ్యమాల్లో అత్యధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు.
  • సోషల్‌ మీడియాలో వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ తదితర అప్లికేషన్లను 90 కోట్ల మంది వినియోగిస్తుండగా, అందులో 40 కోట్ల మంది క్రియాశీలంగా ఉన్నారు.
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీ మంత్రి కేటీఆర్‌ ఇప్పటివరకు సుమారు 120 వెబ్‌కాస్ట్‌లను నిర్వహించారు.

డిజిటల్‌ మీడియా నిర్వహిస్తున్న పోర్టల్స్‌ 

  1. తెలంగాణ స్టేట్‌ పోర్టల్‌ https://telangana.gov.in/
  2. తెలంగాణ ఐటీ శాఖ https://it.telangana.gov.in/
  3. సీఎంవో పోర్టల్‌ https://cm.telangana.gov.in/
  4. ఫ్యాక్ట్‌ చెక్‌ పోర్టల్‌ https://factcheck.telangana.gov.in/
  5. కొవిడ్‌ 19 పోర్టల్‌ https://covid19.telangana.gov.in/
  6. ఓపెన్‌ డాటా పోర్టల్‌ https://data.telangana.gov.in/
  7. తెలంగాణ మాస పత్రిక http://magazine.telangana.gov.in
  8. ప్రపంచ తెలుగు మహాసభలు-2017 పోర్టల్‌ http://wtc.telangana.gov.in/
  9. బతుకమ్మ ఉత్సవాల పోర్టల్‌ http://bathukamma.telangana.gov.in
  10. గోదావరి, కృష్ణా పుష్కరాల పోర్టల్‌ http://pushkaralu.telangana.gov.in/
  11. తెలంగాణ రాష్ట్ర అవతరణ https://telangana.gov.in/formationday 2018

తెలంగాణ సీఎంవో ట్విట్టర్‌లో ఫస్ట్‌, ఫేస్‌బుక్‌లో థర్డ్‌

సాంకేతికత, సామాజిక మాధ్యమాలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలు తెలుసుకొనేందుకు, వాటిని పరిష్కరించేందుకు 2014లో ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లోకి అడుగుపెట్టింది. టాప్‌-10 రాష్ర్టాలను పరిశీలిస్తే ఫాలోవర్స్‌లో తెలంగాణ సీఎంవో ట్విట్టర్‌లో మొదటి స్థానంలో, ఫేస్‌బుక్‌లో మూడో స్థానంలో ఉన్నది. 2020 సెప్టెంబర్‌ 23వ తేదీ నాటికి ట్విట్టర్‌లో తెలంగాణ సీఎంవో ఫాలోవర్స్‌ సంఖ్య 10,06,682. తెలంగాణ సీఎంవో ఫేస్‌బుక్‌ ఫాలోవర్స్‌ సంఖ్య 8,37,008గాను ఉన్నది. సీఎంవో ట్విట్టర్‌ ద్వారా 2014లో 17.50 లక్షల మందికి చేరువ కాగా 2020 ఆగస్టు 31వ తేదీ వరకు ఏకంగా 8.29 కోట్ల మందికి చేరువ కావడం విశేషం. ట్విట్టర్‌లో ప్రతి వెయ్యి మందికి 28% మంది తెలంగాణ సీఎంవోను ఫాలో అవుతున్నారు. తెలంగాణ తర్వాత 24.6 శాతంతో హర్యానా రెండోస్థానంలో, మధ్యప్రదేశ్‌ 19.5 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. ఫేస్‌బుక్‌లో ప్రతి వెయ్యిమందికి 23.5% మంది తెలంగాణ సీఎంవోను ఫాలో అవుతున్నారు. రాజస్థాన్‌ 31.2%, కేరళ 27.5 శాతంతో తెలంగాణ కంటే ముందున్నాయి. యూఏఈలో ఎక్కువగా 14,312 మంది ఫేస్‌బుక్‌లో తెలంగాణ సీఎంవోను ఫాలో అవుతుండగా, సౌదీ అరేబియాలో 12,888 మంది, యూఎస్‌ఏలో 12,653 మంది ఫాలో అవుతున్నారు.