బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:06:17

శ్రీశైలానికి చేరిన కృష్ణమ్మ

శ్రీశైలానికి చేరిన కృష్ణమ్మ

  • 1,05,220 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు
  • జూరాల 11 గేట్ల ద్వారా నీటి విడుదల 
  • పరవళ్లు తొక్కుతున్న ప్రాణహిత

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం జలాశయానికి చేరుతున్నది. గురువారం జూరాల ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తగా 1,05,220 క్యూసెక్కుల నీరు వస్తున్నది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 824.50 అడుగుల వద్ద  నీటిమట్టం ఉన్నది. మొత్తం 215. 807 టీఎంసీలకు తాజాగా నీటి నిల్వ 44.3482 టీఎంసీలున్నట్లు అధికారులు తెలిపారు.  జూరాల కు ఇన్‌ఫ్లో 80 వేల క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 1,11,501 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.542 టీఎంసీల నీరున్నది. 33,282 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ మొత్తం ఐదు యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. అల్మట్టికి 24,707 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 46,130 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. నారాయణపురకు ఇన్‌ఫ్లో 46,045 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 45,995 క్యూసెక్కులుగా ఉన్నది. శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రాల నుంచి సాగర్‌కు 450 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. తుంగభద్రకు 6,723 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాతున్నది.  

ప్రాణహిత పరవళ్లు

ప్రాణహిత పరవళ్లు తొక్కుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మి బరాజ్‌కు పోటెత్తుతున్నది. 35,200 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 12.512 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకుంటూ వచ్చింది వచ్చినట్లే గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. అన్నారంలోని సరస్వతి బరాజ్‌కు 6,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. సరస్వతి పంప్‌హౌజ్‌లో 5వ మోటర్‌ను ఆన్‌ చేసి 2,900 క్యూసెక్కుల నీటిని పార్వతి బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు.  పార్వ తి పంపుహౌజ్‌లో ఒక మోటర్‌ ద్వారా 2,610 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లిలోకి ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లిలో ప్రస్తుతం  5.499 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో  ఎస్సారెస్పీకి 4,029 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందన్నారు. శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి గురువారం ఎల్‌ఎండీకి 7,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.


logo