బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 01:29:52

ఒక్కరోజుముందు బోర్డుకు ఎజెండా పంపిన ఏపీ

ఒక్కరోజుముందు బోర్డుకు ఎజెండా పంపిన ఏపీ

  • నేడు కృష్ణా బోర్డు సమావేశం
  • సాంకేతిక అస్ర్తాలతో  రెండురాష్ర్టాలు సన్నద్ధం

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: శ్రీశైలం నుం చి అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ పాల నాఉత్తర్వులు ఇచ్చిందంటూ తెలంగాణ.. కృష్ణాపై అనుమతులు లేకుండా తెలంగాణ కొత్త, పాత ప్రాజెక్టులు నిర్మిస్తున్నదంటూ ఏపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న సమయంలో గురువారం కృష్ణా యాజమాన్యబోర్డు సమావేశం జరుగుతున్నది. ఏపీ జారీచేసిన 203నంబర్‌ జీవోతో రెండురాష్ర్టాల మధ్య వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిన నేపథ్యంలో బోర్డు భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నది. జలసౌధలోని బోర్డు కార్యాలయంలో ఉదయం 11గంటలకు చైర్మన్‌ పరమేశం అధ్యక్షతన జరిగే సమావేశానికి రెండురాష్ర్టాల అధికారులు సర్వం సన్నద్ధమయ్యారు.

తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌, ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, రెండురాష్ర్టాల ఈఎన్సీలు మురళీధర్‌రావు, నారాయణరెడ్డితోపాటు ఇతర ఇంజినీర్లు సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆదేశానుసారం జరుగుతున్న సమావేశం కావడం, త్వరలో అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో ఈ భేటీ అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే బోర్డు రెండు రాష్ర్టాలకు ఎజెండా అంశాలు పంపగా.. అందులో పరస్పరం చేసుకున్న ఫిర్యాదులపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

విజయవాడకే కృష్ణా బోర్డు కార్యాలయం

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణాబోర్డు కార్యాలయం ఏపీ పరిధిలో ఉండాలి. గతంలో దీనిపై అనేకసార్లు పట్టుబట్టిన ఏపీ.. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చాక అంతగా ప్రాధాన్యమివ్వలేదు. కార్యాలయాన్ని ఎక్కడకు తరలించాలనేదానిపైనా స్పష్టత ఇవ్వలేదు. కానీ, తాజాగా విజయవాడలోనే బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలంటూ బోర్డుకు స్పష్టంచేసింది. దీనితోపాటు, మరో నాలుగు అంశాలను ఎజెండాలో చేర్చాలంటూ ఏపీ అధికారులు బుధవారం బోర్డుకు లేఖరాశారు.


logo