గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 03:35:20

తెలంగాణ వాటాపై కృష్ణాబోర్డు దగా

తెలంగాణ వాటాపై కృష్ణాబోర్డు దగా

  • 51 టీఎంసీల వాటాపై మాటమార్పు
  • ఆగస్టుదాకా వినియోగంపై గతంలోని ఉత్తర్వులకు మంగళం
  • ఆంధ్రప్రదేశ్‌ ఒత్తిడితో వాటాలో భాగమిచ్చేందుకు కుట్ర

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్ర సర్కార్‌ ఏర్పాటుచేసిన ప్రభుత్వ విభాగం కృష్ణా బోర్డు ఏపీకి తొత్తులా మారుతున్నది. తాను జారీచేసిన ఉత్తర్వుల మీద నిలబడటానికీ వెనుకాడుతున్నది. తెలంగాణకు ఈ ఏడాది ఆగస్టుదాకా వినియోగించుకొనేందుకు ఇచ్చిన నీటివాటాలో ఏపీకి కూడా వాటా ఇచ్చేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. 2019-20 నీటి సంవత్సరానికి సంబంధించి ఆగస్టు దాకా నీటిఅవసరాల కోసం తెలంగాణ ఈఎన్సీ ఇచ్చిన ఇండెంట్‌ ప్రకారం శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో దాదాపు 143 టీఎంసీలను వాడుకొనేందుకు బోర్డు అనుమతిచ్చింది. 

ఈ మేరకు ఈ ఏడాది ఆగస్టు వరకు వాడుకోవచ్చని బోర్డు ఉత్తర్వులు జారీచేసింది. కృష్ణా బేసిన్‌కు ఆగస్టు తర్వాతే వరద వస్తుందనే ఉద్దేశంతో.. అప్పటి వరకు హైదరాబాద్‌, మిషన్‌ భగీరథ తాగునీటి అవసరాలతోపాటు సాగర్‌ ఎడమ కాలువ కింద రైతులకు నిర్ణీత సమయంలో తడులు ఇచ్చేందుకు తెలంగాణ 50.851 టీఎంసీలను నాగార్జునసాగర్‌లో ఉంచుకున్నది. అందులోనుంచి 30 టీఎంసీలు వాడుకుంటున్నామని ఇటీవల తెలంగాణ ఈఎన్సీ బోర్డుకు లేఖ కూడా రాశారు. అయితే, ఏపీ ఒత్తిడి మేరకు ఆ వాటాకు ఎసరు పెట్టేందుకు బోర్డు పావులు కదుపుతున్నది. 

2019-20 నీటి సంవత్సరం మే 31తో ముగిసినందున.. జూన్‌ ఒకటో తేదీ తర్వాత తెలంగాణ ఆ నీటిని వాడుకొనేందుకు (క్యారీఓవర్‌) ఏపీ అంగీకరించడం లేదు. పైగా, తన వాటాకంటే ఎనిమిది టీఎంసీలు ఎక్కువ వాడుకున్న ఏపీ.. తెలంగాణ వాటాలో మిగిలిన 51 టీఎంసీల్లోనూ వాటా కావాలంటూ బోర్డు అధికారులతో సంప్రదింపులు చేస్తున్నది. దీంతో బోర్డు గతంలో తాను ఇచ్చిన అనుమతిని పక్కకు పెట్టి.. ఆ నీటిపై కమిటీ వేసేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతోపాటు గత ఉత్తర్వుల మేరకు సాగర్‌ కింద తెలంగాణ వాడుకుంటున్న పరిమాణానికి తాజాగా సంవత్సరంలో నీటి విడుదల ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఏపీ అధికారుల ఒత్తిడికి బోర్డు తలొగ్గుతున్నట్టు సమాచారం.

సాగర్‌లో నీళ్లన్నీ తెలంగాణవేనా?!

నాగార్జునసాగర్‌లోని నీటిని రెండు తెలుగు రాష్ర్టాలు తాగు, సాగునీటి కోసం వాడుకుంటాయి. అందులోనూ తెలంగాణ కంటే  ఏపీకే ఎక్కువ ఆయకట్టు ఉన్నది. కానీ, సాగర్‌లోకి వచ్చే నీళ్లన్నీ తెలంగాణవే అన్నట్టుగా ఏపీ జలవనరులశాఖ అధికారులు వాదిస్తున్నారు. తాజాగా, కృష్ణాబోర్డుకు ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీ సీ నారాయణరెడ్డి రాసిన లేఖ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. శ్రీశైలంలో తెలంగాణ కరెంటు ఉత్పత్తిపై పదేపదే ఫిర్యాదుచేసిన ఏపీ అధికారులు.. తాజాగా మరో వింత వాదనకు దిగారు. ఈ నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి ఆగస్టు 1 నాటికి 106.170 టీఎంసీల వరద వచ్చిందని, అందులో తెలంగాణ వాటా 34 శాతం మేరకు 36.100 టీఎంసీలను ఆ రాష్ర్టానికి కేటాయించాలని ఏపీ ఈఎన్సీ తాజాగా కృష్ణాబోర్డుకు లేఖరాశారు. 36 టీఎంసీల మేర జలాలను శ్రీశైలం నుంచి కరెంటు ఉత్పత్తి ద్వారా సాగర్‌కు తరలించవచ్చని, లేకపోతే అక్కడే నిల్వ చేసుకోవచ్చని ఏపీ వాదనలా ఉన్నది. అంతకుమించి తరలించవద్దనేది ఉద్దేశం. వాస్తవంగా రెండురాష్ర్టాల నీటి లెక్కలను బేసిన్‌లోని ఇతర అన్ని ప్రాజెక్టుల ఆధారంగా నిర్ధారించాల్సి ఉంటుంది. కానీ శ్రీశైలం జలాశయానికి వచ్చిన వరదలోనే వాటాలు వేయడం.. పైగా వాటా మేరకే కరెంటు ఉత్పత్తి చేయాలనడంపై సాగునీటిరంగ నిపుణులు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నారు. పోతిరెడ్డిపాడు ధ్యాసలో సాగర్‌కు తరలించిన నీటిలో ఏపీకి కూడా వాటా ఉంటుందనే విషయాన్ని ఏపీ అధికారులు మరిచిపోతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. 


logo