గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 02:11:38

‘రాయలసీమ’ టెండర్లు ఆపండి

‘రాయలసీమ’ టెండర్లు ఆపండి

  • ఏపీ ఎత్తిపోతల పథకంపై కృష్ణా బోర్డు పునరుద్ఘాటన
  • అనుమతులు తీసుకున్నాకే చేపట్టాలని ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పరిపాలనా అనుమతులివ్వడం.. కేంద్రం, కృష్ణాబోర్డు ఆదేశాలను పెడచెవినపెడుతూ దానికి టెండర్లు పిలిచిన ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌పై కృష్ణానదీ యా జమాన్యబోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించి జారీచేసిన టెండర్‌ నోటిఫికేషన్‌ను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు గురువారం బోర్డు సభ్యుడు హరికేశ్‌మీనా.. ఏపీ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు లేఖరాశారు. 

రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గతంలోనే రెండు పర్యాయాలు ఫిర్యాదుచేసిందని, ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి ఆదేశానుసారం ప్రాజెక్టుపై ముందుకు పోవద్దంటూ కృష్ణా బోర్డుకూడా ఆదేశాలు జారీచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా ఇటీవల టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడంపై తెలంగాణ జలవనరులశాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు బోర్డుకు మరోసారి ఫిర్యాదుచేశారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన బోర్డు రాయలసీమపై ముందుకు పోవద్దని మరోసారి స్పష్టంచేస్తూ.. టెండర్‌ నోటిఫికేషన్‌ను వెంటనే నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిబంధనల ప్రకారం ముందుగా బోర్డుకు ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌) సమర్పించాలని సూచించారు. బోర్డు సాంకేతిక అనుమతితోపాటు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తీసుకున్నాకే ప్రాజెక్టును చేపట్టాలని మీనా ఆదేశాలు జారీచేశారు. 

నాలుగు రోజులు మీనమేషాలు

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా ఏపీ సర్కారు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిందంటూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌రావు ఈనెల 25న ఫిర్యాదు చేశారు. స్వయంగా బోర్డు ఆదేశాలను బేఖాతరు చేసినా ఏపీపై స్పందించేందుకు నాలుగురోజుల సమయం పట్టింది. కానీ, కొన్నిరోజుల క్రితం శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో కరెంటు ఉత్పత్తి ద్వారా తెలంగాణ దిగువకు నీటిని తీసుకెళుతున్నదంటూ ఏపీ నీటిపారుదలశాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి వాట్సాప్‌లో చేసిన ఫిర్యాదుకే బోర్డు ఆగమేఘాలమీద స్పందించింది. వాస్తవంగా బోర్డుకు ఏదైనా ఫిర్యాదుచేయాలంటే లేఖ రూపంలో పంపించాలి. కానీ, ఏపీ వాట్సాప్‌ ఫిర్యాదుకే కృష్ణా యాజమాన్యబోర్డు స్పందించడం గమనార్హం.

తాజావార్తలు


logo