శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 05, 2020 , 01:42:37

కృష్ణా ‘మిగులు’పై మథనం

కృష్ణా ‘మిగులు’పై మథనం

  • తొలిసారిగా బచావత్‌ కేటాయింపులుదాటి వినియోగం
  • రెండురాష్ర్టాల ఇంజినీర్లతో త్వరలో కృష్ణాబోర్డు భేటీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కృష్ణాబేసిన్‌లో రెండు తెలుగురాష్ర్టాల వినియోగం తొలిసారి బచావత్‌ కేటాయింపులను మించింది. దీంతో మిగులు జలాల పంపిణీ ఎలాఅనే దానిపై మథనం మొదలయింది. బేసిన్‌లోని నాలుగురాష్ర్టాల మధ్య జలాల పంపిణీకి బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులే ప్రామాణికం. ఇందులోభాగంగా ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల కేటాయింపులు జరిగాయి. రాష్ట్ర విభజన తర్వాత అందుకులోబడి ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకుంటూవస్తున్నాయి. అంతకుమించి వరదవస్తే ఎలాగనే దానిపై విధి విధానాలు రూపొందించుకోలేదు. కానీ 2019-20లో బేసిన్‌కు భారీస్థాయిలో వరదరావడంతో రెండురాష్ర్టాల మధ్య వినియోగం 811 టీఎంసీలు దాటింది. ఏప్రిల్‌ 30 లెక్కల ప్రకారం.. ఏపీ 637, తెలంగాణ 269 కలిపి మొత్తం 906 టీఎంసీలు వినియోగించుకున్నాయి. 

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో ఎండీడీఎల్‌ ఎగువన ఉన్న నీటివినియోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది 950-980 టీఎంసీలకు చేరుకునే అవకాశమున్నది. వరద సమయంలో వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని ఏపీ కృష్ణా బోర్డును కోరుతూ వస్తుండటంతో కేంద్ర జలవనరులశాఖ.. రెండురాష్ర్టాల అంతర్రాష్ట్ర విభాగం చీఫ్‌ఇంజినీర్లతోపాటు కృష్ణా బోర్డు సభ్యుడు హరికేశ్‌మీనా, కేంద్ర జలసంఘంలోని ఐఎండీ విభాగానికి చెందిన చీఫ్‌ఇంజినీర్‌తో గతంలోనే కమిటీ వేసింది. ఈ కమిటీని కృష్ణాబోర్డు అధికారులు ఈ వారంలో సమావేశపర్చి మిగులు జలాల వినియోగంపై విధివిధానాలను రూపకల్పన చేయనున్నట్టు తెలిసింది. దీనిపై రెండురాష్ర్టాలు ఏకాభిప్రాయానికి వస్తే.. తదుపరి ట్రిబ్యునల్‌ కేటాయింపులు జరిగేవరకు అవే అమలులో ఉండనున్నాయి.


logo