బుధవారం 03 జూన్ 2020
Telangana - May 16, 2020 , 02:33:54

వివరణ కోరినా స్పందనేదీ?

వివరణ కోరినా స్పందనేదీ?

  • ఏపీ ప్రభుత్వం తీరుపై కృష్ణాబోర్డు అసంతృప్తి
  • ఏపీ నీటిపారుదలశాఖకు బోర్డు సభ్యుడి లేఖ
  • రాయలసీమ ఎత్తిపోత, పోతిరెడ్డిపాడు విస్తరణ డీపీఆర్‌ ఇవ్వాలని ఆదేశం

రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణకు ఏపీ యోచిస్తున్నదంటూ తెలంగాణ ప్రభుత్వం జనవరిలోనే బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీనిపై వివరణకు ఫిబ్రవరి 5న బోర్డు లేఖరాసినా ఏపీ స్పందించలేదు. దాన్ని గుర్తుచేస్తూ ఈ నెల 13న మరో లేఖ పంపినా దానికీ స్పందించలేదు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శ్రీశైలం జలాశయం నుంచి పెన్నా బేసిన్‌కు కృష్ణా జలాల తరలింపునకు చేపడుతున్న చర్యలపై రెండుసార్లు వివరణ కోరినా ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంపై కృష్ణా యాజమాన్యబోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ మేరకు శుక్రవారం బోర్డు సభ్యుడు హరికేశ్‌ మీనా పేరిట ఏపీ జల వనరులశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శికి లేఖ రాశారు. తెలంగాణప్రభుత్వం చేసిన ఫిర్యాదు కాపీతోపాటు, ఏపీ జీవోను జతచేస్తూ రాసిన ఈ లేఖ ప్రతులను కేంద్రజల వనరుల మంత్రిత్వశాఖకు కూడా పంపించారు. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తరలించేందుకు కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడంతోపాటు, పోతిరెడ్డిపాడు కాల్వ విస్తరణకు ఏపీ ప్రభుత్వం యోచిస్తున్నదంటూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే బోర్డుకు ఫిర్యాదు చేసిందని గుర్తుచేశారు. దీనిపై వివరణ కోసం ఫిబ్రవరి 5న బోర్డు లేఖరాసినా ఏపీ స్పందించలేదని తెలిపారు. సమాధానం ఇవ్వలేదనే విషయాన్ని గుర్తుచేస్తూ ఈనెల 13న మరో లేఖ పంపినా దానికీ స్పందించలేదని పేర్కొన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని రెండు పేరాలను కూడా బోర్డు ఈ లేఖలో ప్రస్తావించింది. సెక్షన్‌ 85 (8)(డీ) ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై కొత్త ప్రాజెక్టులు కట్టేముందు బోర్డులకు కచ్చితంగా ప్రతిపాదనలు సమర్పించాలని, జల వివాద ట్రిబ్యునల్‌ ఉల్లంఘన జరుగడంలేదని తేలాకనే బోర్డు అనుమతి ఇస్తుందని తెలిపారు. ఆ తర్వాతే ప్రాజెక్టులపై ముందుకుపోవాల్సి ఉంటుందని గుర్తుచేశారు. పదో షెడ్యూల్‌ పేరా-7 ప్రకారం కొత్త ప్రాజెక్టుకు అపెక్స్‌ కౌన్సిల్‌ సాంకేతిక అనుమతి పొందాల్సిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. తెలంగాణ ఫిర్యాదుపై అభిప్రాయాలు తెలుపడంతోపాటు, జీవో 203 ప్రకారం నిర్మాణ అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టుల డీపీఆర్‌ను కూడా సమర్పించాలని ఏపీకి స్పష్టంచేశారు. 

తాత్కాలిక ఒప్పందం మేరకే జలాల పంపిణీ

ఏపీ కొత్త ప్రాజెక్టుకు పాలనా ఆమోదం ఇవ్వడంలో పునర్వ్యవస్థీకరణ చట్టం-2014ను ఉల్లంఘించిందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేంద్రానికి వివరించినట్టు తెలిసింది. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇంకా అమల్లోకి రాలేదని, ఉమ్మడి ఏపీకి బచావత్‌ కేటాయించిన 811 టీఎంసీలను రెండు తెలుగురాష్ర్టాలు తాత్కాలిక ఒప్పందం మేరకు నీటిని పంపిణీ చేసుకుంటున్నాయని కేంద్రానికి పంపిన లేఖలో పేర్కొన్నారు. తెలుగు రాష్ర్టాల పరిధిలో కొత్త ప్రాజెక్టుల వివాదంపై గతంలో పరస్పర ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై సంబంధిత నదీ యాజమాన్య బోర్డులకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు సమర్పిస్తామని గతంలో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో రెండురాష్ర్టాల ముఖ్యమంత్రులు స్పష్టం చేశారని వివరించారు. ఆ సందర్భంగా తమ పరిధుల్లో కొత్త ప్రాజెక్టులేవీ లేవని సమాచారం ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం బోర్డుకు కూడా సమాచారం ఇవ్వకుండానే పాలనా ఆమోదం ఇచ్చిందని పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టుపై కృష్ణా బోర్డుకు సంబంధించి విచారణ చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.


logo