బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 03:55:27

ప్రతి ప్రయాణికుడికి స్క్రీనింగ్‌

ప్రతి ప్రయాణికుడికి స్క్రీనింగ్‌
  • విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ పరికరాలను పరిశీలించిన ఈటల
  • వ్యాధి నియంత్రణలో అప్రమత్తంగా ఉన్నామని కేంద్రానికి సీఎస్‌ వివరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  విమానాశ్రయంలో ప్రతి ప్రయాణికునికి కొవిడ్‌-19 వైరస్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా స్క్రీనింగ్‌ పరికరాలను మంత్రి సోమవారం పరిశీలించి వైరస్‌ స్కానింగ్‌ విధానాన్ని తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఎయిర్‌పోర్టుకు నిత్యం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారని, వారిని స్కానింగ్‌ చెయ్యడం తప్పనిసరిఅని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టులోని నాలుగు ప్రధానదారుల వద్ద ప్రయాణికులను స్కానింగ్‌ చేసేందుకు వైద్యులు నర్సులు, హెల్పర్లు ఉంటారని తెలిపారు. ఎవరికైనా వైరస్‌ లక్షణాలుంటే.. విమానాశ్రయంలోని ప్రత్యేకగదిలోకి తీసుకువెళ్లి, ఆ వ్యక్తికి పూర్తిగా మాస్కులువేసి ప్రత్యేకద్వారం నుంచి గాంధీ దవాఖానకు తరలిస్తారని చెప్పారు. మంత్రి వెంట విమానాశ్రయ ప్రత్యేక వైద్యాధికారిణి అనూరాధ, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ జీ శ్రీనివాస్‌రావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి తదితరులున్నారు.


కరోనా కట్టడిలో పూర్తి అప్రమత్తం

కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగాఉందని, అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కేంద్రానికి తెలిపారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబ సోమవారం రాష్ర్టాల సీఎస్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యల్ని సీఎస్‌ ఆయనకు వివరించారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఏర్పాటుచేసేందుకుగాను రెండు థర్మల్‌స్కానర్లను వెంటనే సమకూర్చాలని కోరారు. అదేవిధంగా ఎన్‌-95 మాస్క్‌లను, కరోనా వైరస్‌ పరీక్షాకేంద్రాలు రెండింటిని వెంటనే ఏర్పాటుచేయాలని చెప్పారు. కరోనావైరస్‌ కట్టడికి ప్రత్యేకచర్యలు తీసుకోవాలని, వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాజీవ్‌గౌబ సూచించారు. 


మన రాష్ట్రంలో కేరళ విధానం

కరోనా విస్తరించకుండా ప్రత్యేకశ్రద్ధ చూపుతామని, ఆయా విభాగాలను అప్రమత్తం చేస్తామని కేరళ వెళ్లివచ్చిన రాష్ట్ర ప్రతినిధులు పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు కేరళ విధానాలను తెలుసుకొనేందుకు ఆ రాష్ట్రం వెళ్లిన 12మందితో కూడిన రాష్ట్రబృందం ఆదివారం తిరిగివచ్చింది. ఈ బృం దంలోని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ సోమవారం ‘నమస్తే తెలంగాణ’ తో మాట్లాడుతూ, కేరళలో రాష్ట్రస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు 15 ప్రత్యేకబృందాలు ఏర్పాటుచేసి ప్రత్యేక కార్యాచరణ అమలుచేస్తున్నట్లు చెప్పారు. వైద్యులు, నర్సులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు గ్లౌజ్‌లు, మాస్క్‌లను అందుబాటులో ఉంచారని తెలిపారు. జీవవ్యర్థాలను నిర్మూలించడంపై శ్రద్ధ పెట్టారని, గ్రామాలకు వెళ్లేవారికి కరోనా అనుమానిత లక్షణాలుంటే తక్షణచర్యలు చేపట్టేలా అన్ని పీహెచ్సీలను అప్రమత్తం చేశారని చెప్పారు. 


logo
>>>>>>