బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 01:26:10

ఎయిర్‌పోర్టులోనే కట్టడి

ఎయిర్‌పోర్టులోనే కట్టడి
  • ఏబీసీలుగా విదేశీ ప్రయాణికుల వర్గీకరణ
  • క్వారంటైన్‌ కేంద్రంగా గచ్చిబౌలి స్టేడియం
  • కొవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణ చర్యలు ముమ్మరం
  • నెదర్లాండ్‌ వెళ్లివచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. వైద్య, ఆరోగ్యశాఖతోపాటు వివిధ ప్రభుత్వశాఖలు సమన్వయంతో వైరస్‌వ్యాప్తిని నిరోధించేందుకు ప్రత్యేక బృందాలుగా పనిచేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చేవారితోనే వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడినుంచే ముందుగా కట్టడిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విదేశీ ప్రయాణికులను మూడువర్గాలుగా విభజించి ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నది. గచ్చిబౌలి స్టేడియాన్ని క్వారంటైన్‌ భవనంగా మారుస్తున్నది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణపై అవగాహన కల్పించడంతోపాటు, అనుమానిత లక్షణాలున్నవారిని గుర్తించేందుకు రాష్ట్రస్థాయి రాపిడ్‌ రెస్క్యూ టీమ్‌ (ఆర్‌ఆర్టీ) కృషిచేస్తున్నది. కాగా, శనివారం విదేశాల నుంచి వచ్చిన ఇద్దరి శాంపిళ్లను పుణెలోని నేషనల్‌ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపగా.. నెదర్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్‌గా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.  చైనా, దక్షిణకొరియా, ఇరాన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ నుంచి వచ్చేవారిపై ఎయిర్‌పోర్టులో ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చేవారు అంతకుముందు ఏయే దేశాల్లో పర్యటించారనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చేవారిని మూడు క్యాటగిరీలుగా విభజించి సహాయకచర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కొవిడ్‌-19 అనుమానిత లక్షణాలున్నవారిని ఏ క్యాటగిరీగా గుర్తించి విమానాశ్రయం నుంచి నేరుగా గాంధీ, ఫీవర్‌ దవాఖానకు ప్రత్యేక అంబులెన్సుల ద్వారా తరలిస్తారు. 60 ఏండ్ల పైబడిన వారిని బీ క్యాటగిరీగా గుర్తించి వ్యాధి లక్షణాలు లేనప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా క్వారంటైన్‌కు తరలిస్తారు. 40 ఏండ్లలోపువారిని సీ క్యాటగిరీగా విభజించి అనుమానిత లక్షణాలు లేనప్పటికీ.. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచాల్సిందిగా కేంద్ర ఆరోగ్య విభాగం సూచించింది. కాగా, 40 ఏండ్లలోపు వారిని సైతం క్వారంటైన్‌లో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతి కోరింది.  


ముమ్మరంగా ర్యాపిడ్‌ రెస్క్యూ టీంలు

కొవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణపై అవగాహన కల్పించడంతోపాటు, అనుమానిత లక్షణాలున్నవారిని గుర్తించడంపై రాష్ట్రస్థాయి రాపిడ్‌ రెస్క్యూ టీం (ఆర్‌ఆర్టీ)తోపాటు అన్నిజిల్లాల పరిధిలోని ఆర్‌ఆర్టీలు క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా కృషిచేస్తున్నాయి. కరోనా అనుమానితులను తరలించేందుకు విమానాశ్రయంతోపాటు, గాంధీ, ఫీవర్‌ దవాఖాన, కోఠి ప్రజారోగ్యశాఖ కార్యాలయం ప్రాంగణంలో ప్రత్యేక అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.


గచ్చిబౌలి స్టేడియంలో అందుబాటులో 50 బెడ్లు

శేరిలింగంపల్లి: గచ్చిబౌలి స్టేడియాన్ని కరోనా ప్రత్యేక వార్డులుగా తీర్చిదిద్దుతున్నారు. అథ్లెటిక్‌ క్రీడాప్రాంగణంలోని పరిపాలన విభాగం బ్లాక్‌తోపాటు ఇతర గదులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నది. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది స్టేడియంలోని గదులు, పరిసరాలను శుభ్రంచేశారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అవసరమైన బెడ్లు, వెంటిలేటర్లు, వైద్యసామగ్రిని సమకూర్చే పనులు చేపట్టారు. రెండురోజుల్లో పూర్తిస్థ్ధాయిలో యాభై బెడ్ల సామర్థ్యంతో కేంద్రాన్ని తీర్చిదిద్ది అందుబాటులో ఉంచనున్నట్టు అధికారులు తెలిపారు. 


హద్దుదాటితే దండనే 

కరోనాపై సోషల్‌మీడియా వేదికగా ఎవరైనా వదంతులు సృష్టిస్తే కఠినచర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెడ్తుతున్నారు. వదంతులు సృష్టించేవారిపై డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం, 2005లోని సెక్షన్‌ 54 ప్రకారం కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఈ చట్టం కింద గరిష్ఠంగా ఏడాది జైలు, జరిమానా విధించే అవకాశం ఉన్నది. 

మంత్రి ఈటల సమీక్ష

కొవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణలో భాగంగా అప్రమత్త చర్యలపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదివారం నాడు వైద్యశాఖ అధికారులతో చర్చించారు. అసెంబ్లీ నుంచి వైద్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి పలు సూచనలు చేశారు.


logo