ఆదివారం 05 జూలై 2020
Telangana - Jul 01, 2020 , 00:07:49

రచయితగానే కొనసాగితే.. జ్ఞానపీఠం దక్కేది

రచయితగానే కొనసాగితే.. జ్ఞానపీఠం దక్కేది

  • ప్రముఖ సాహితీవేత్త కోవెల సుప్రసన్నాచార్యతో ‘నమస్తే తెలంగాణ’ప్రత్యేక ఇంటర్వ్యూ

పుట్టింది సామాన్య కుటుంబంలోనే..గడిపింది సామాన్య జీవితమే.. సాహితీ గడ్డపై పుట్టిన పీవీ  నరసింహారావు  చదువుకునే రోజుల్లోనే ఆ రంగంపై మక్కువ పెంచుకున్నారని అంటున్నారు ప్రముఖ సాహితీవేత్త, కవి కోవెల సుప్రసన్నాచార్య. పీవీని చాలా దగ్గరి నుంచి చూసిన వ్యక్తుల్లో  ఈయన ఒకరు. పీవీ సాహిత్యరంగంలోనే కొనసాగి ఉంటే జ్ఞానపీఠ్‌ దక్కేదని, తెలుగు భాషకు ఆయన చేసిన కృషి మరే సీఎం చేయలేదని, తెలంగాణలో తెలుగు టీచర్లు పుట్టుకురావడానికి ఆయనే కారణమని చెప్తున్నారు. కోవెల సుప్రసన్నాచార్యతో ‘నమస్తే తెలంగాణ’ జరిపిన ప్రత్యేక ఇంటర్యూ విశేషాలు..

తెలంగాణను ఆంధ్రతో కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పాటు చేసినపుడు పీవీ వైఖరి ఎలా ఉండేది?

ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటును పీవీతో పాటు కాళోజీ, దాశరథి స్వాగతించారు. సాంస్కృతిక అనైక్యత నుంచి ఏకం కావాలన్న భావన వారిలో ఉండేది. పీవీ, బూర్గుల రామకృష్ణారావు, హనుమంతరావు కూడా ఆంధ్రదేశ సమైక్యతను కోరుకున్నారు. తెలుగువాళ్లంతా ఒక్కటైతే ఒకరినొకరి అండ ఉంటుందని వాళ్లు అనుకున్నారు. అందుకే తెలంగాణలో ఆంధ్ర సాహిత్యానికి బాగా ఆదరణ లభించింది. కానీ అక్కడ అలా జరగలేదు. చిన్నచూపు చూసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

సాహిత్య రంగంలో పీవీ స్థానాన్ని రచయితగా ఎలా అంచనా వేస్తారు?

పీవీ నరసింహారావు రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే, సాహిత్యరంగంలోనే కృషిచేసి ఉంటే దేశంలోనే అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ్‌ అవార్డు వచ్చి ఉండేది. అంతటి అర్హత కలిగినవాడాయన. తన కృషి అంతా రాజకీయ ఉద్యమాల్లో, పదవుల్లో, వాటికి సంబంధించిన పద్ధతుల్లో సాగటం వల్ల సాహిత్యరంగానికి అంతగా కృషి చేయలేకపోయారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చారాయన. తెలంగాణలో కరణాల ఇండ్లలో సాహిత్య సంభాషణ సర్వసాధారణం. భారతం, భాగవతం తప్పక చదువుతుంటారు. పద్యాలు చదువుకుంటారు. అలా వరంగల్‌లోని మడికొండ సాహిత్య కేంద్రంలా ఉండేది. సాహిత్యం వెల్లవిరిసేది. మడికొండకు, పీవీ సంబంధం ఏమిటో తెలియదు కానీ, కాళోజీ నారాయణరావుతో, వానమామలై వరదాచార్యులతో సన్నిహితంగా ఉండేవారు. కాళోజీ అంటే పీవీకి చాలా ఇష్టం. ఆ ఇష్టమే కాళోజీకి పద్మవిభూషణ్‌ ఇప్పించేలా చేసింది. 

వరదాచార్యుల వారికి ఎమ్మెల్సీగా గౌరవాన్ని కల్పించారు. నేరెళ్ల వేణుమాధవ్‌కు ఎమ్మెల్సీ ఇప్పించారు. గార్లపాటి రాఘవరెడ్డి వల్లే సాహిత్యంపై పీవీ నరసింహారావు, సదాశివరావుకు సాహిత్యంపై మక్కువ ఏర్పడింది. పీవీ ప్రాథమిక విద్య వరంగల్‌లో దాదాపు ఉర్దూలోనే సాగింది. వరంగల్‌లో ఇంటర్‌ పూర్తిచేశాక పీవీ హైదరాబాద్‌కు వచ్చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని సీ-హాస్టల్‌లో ఉండి చదువుకునేవారు. ఆ సమయంలో పీవీతో పాటు మరికొందరు విద్యార్థులు వందేమాతరం పాడారు. అప్పటి నిజాం ప్రభుత్వానికి కోపం వచ్చి, ఆ విద్యార్థులందర్నీ సస్పెండ్‌ చేసింది. మధ్యలోనే చదువు ఆగిపోయింది.

అప్పట్లో పీవీ రాజకీయ అభిప్రాయాలు ఎలా ఉండేవి?

విద్యార్థి దశ నుంచే ఉద్యమంలో పాల్గొన్న పీవీ.. జాతీయోద్యమం, గ్రంథాలయోద్యమం, సారస్వతోద్యమంలో పాల్గొన్నారు. బూర్గుల రామకృష్ణారావు వద్ద పనిచేశారు. రామానందతీర్థకు శిష్యుడిగా ఉన్నారు. అలా కాంగ్రెస్‌ పార్టీలో క్రమంగా ఎదుగుతూ వచ్చారు. నిజాంపై పీవీకి అతి సానుకూలతో లేక అతి వ్యతిరేకత ఉండేది కాదని నాకనిపించింది. 1947 ప్రాంతంలో పీవీ వరంగల్‌లో పాములపర్తి సదాశివరావుతో కలిసి కాకతీయ పత్రికను ప్రారంభించారు. ఆ పత్రిక రాజకీయంగానే కాకుండా సాంస్కృతిక, సామాజిక అంశాలను స్పృషించేలా ఉండేది. ఆ పత్రికకు మారుపేరుతో కొన్ని వ్యాసాలు రాసినట్టు తెలుసు. కాకతీయ గ్రంథమాల అని కొన్ని పుస్తకాలు వేశారు. కాకతీయ కళాసమితి అని ఓ సంస్థను కూడా ప్రారంభించారు. అదే సమయంలో పలు భాషలు నేర్చుకున్నారు. పీవీకి హిందీ కవిత్వంపై ప్రేమ ఉండేది. మహాదేవివర్మ అనే కవయిత్రి కవిత్వం అంటే ఆయనకు చాలా ఇష్టం.

తెలంగాణలో తెలుగు టీచర్లను తయారు చేయడంలో పీవీ చేసిన కృషి ఏంటి?

పీవీ ఎమ్మెల్యే నుంచి పలు మంత్రి పదవులు చేపట్టారు. ఆ సమయంలో తెలుగు భాషకు ఏదైనా చేయాలన్న కోరిక ఉండేది. విద్యాభ్యాసం ఇంగ్లిష్‌లో నడుస్తున్న కాలం అది. పదోతరగతి తర్వాత అంతా ఇంగ్లిష్‌ మీడియమే. దాంతో తెలుగు అకాడమీని స్థాపించారు. దానికి ఆయనే మూల స్తంభం. తొలి అధ్యక్షుడు కూడా ఆయనే. ఇంటర్‌ నుంచి పీజీ దాకా తెలుగు మీడియంలోనే కొనసాగాలన్న సంకల్పంతో పండితులను పిలిపించి తెలుగులో పుస్తకాలను రాయించడం ప్రారంభించారు. పీవీ విద్యామంత్రిగా ఉన్నపుడు తెలంగాణలో తెలుగు మీడియంలో తెలుగు పాఠాలు చెప్పేవాళ్లు లేరు. అది తెలిసిన ఆయన.. ఓయూలో ఓరియెంటల్‌ డిగ్రీలు ఏర్పాటు చేశారు. ఆ డిగ్రీలు చేసేవాళ్లందరికీ రూ.60 స్కాలర్‌షిప్‌ కూడా ఇచ్చేవారు. నాలుగైదేండ్లలో తెలంగాణ అంతటా తెలంగాణకు చెందిన అధ్యాపకులే అయ్యారు. తెలంగాణలో సైలెంట్‌గా పీవీ చేసిన కృషి ఇది.

పీవీతో మీ అనుబంధం ఎలా ఉండేది?

మేం ఇంటర్‌లో ఉన్నపుడు సాహితీబంధు అన్న సంస్థను స్థాపించాం. దానికి విశ్వనాథ సత్యనారాయణ గారిని పిలిచాం. ఆ సందర్భంలో వేదికపై మేమంతా ఉన్నా పీవీగారు వచ్చి ప్రేక్షకుల్లో కూర్చొని వెళ్లిపోయారు. అంత సాదాసీదాగా ఉంటారు పీవీ. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగేకంటే ముందు సన్నాహక సమావేశాలు జరిగాయి. ఆ సమయంతో నేను అవధానం చేశాను. ఎలాంటి అట్టహాసం లేకుండా పీవీ వచ్చి ప్రేక్షకుల్లో కూర్చున్నారు. అవధానం అయిపోయాక నాకు సన్మానం చేయాలని పీవీని నిర్వాహకులు కోరారు. ఆయన నా దగ్గరికి వచ్చి శాలువా కప్పుతూ ఇది ఎప్పుడు మొదలు పెట్టావ్‌? అని అడిగారు. అవధానం బాగుందని మెచ్చుకున్నారు. నన్ను ‘నువ్వు’ అని సంభోదించేంత దగ్గరగా ఉండేవాళ్లం. పీవీ ప్రధాని అయ్యాక ఆయన సోదరుడు సదాశివరావు, తను ఉత్తరాలు రాసుకునేవారు. నేను ఓ సారి ఢిల్లీకి వెళ్తున్నానని సదాశివరావుతో చెప్పగా, పీవీని చూస్తావా అని అడిగితే చూస్తానని చెప్పా. అక్కడికి వెళ్లాక సెక్యూరిటీ, ప్రొటోకాల్‌ అదంతా చూసి ఎందుకో ఆగిపోయాను. ఆ తర్వాత పీవీయే స్వయంగా సదాశివరావుకు ఉత్తరం రాసి సుప్రసన్న వస్తాడని చెప్పావ్‌, కానీ రాలేదు అని అడిగారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. పీవీ వ్యక్తిత్వాన్ని. ఒక్కమాటలో పీవీ గురించి చెప్పాలంటే ఆయన ‘రాజకీయ నాయకుడు కాదు.. రాజనీతిజ్ఞుడు’

- ఇంటర్వ్యూ.. శ్రావణ్‌ కుమార్‌ బొమ్మకంటి

ఆంధ్రా యూనివర్సిటీలో సీటు కోసం పీవీ ప్రయత్నించారా?

పీవీతో సహా సస్పెండ్‌ అయిన విద్యార్థులంతా అడ్మిషన్‌ కోసం ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌ రామలింగారెడ్డిని కలిస్తే అడ్మిషన్‌ ఇవ్వడానికి నిరాకరించారు. అప్పటి వరకు తెలుగువాళ్లమంతా ఒక్కటి అనుకున్న వీళ్ల మనసుకు దెబ్బ తగిలింది. దీంతో పీవీ నాగ్‌పూర్‌కు వెళ్లి చదువుకున్నారు. అక్కడికి వెళ్లడం వల్ల మరాఠీ, హిందీతో సంబంధం ఏర్పడింది. ఉర్దూ, తెలుగు రానేవచ్చు. ఇంగ్లిష్‌ కూడా వచ్చు. అలా తెలంగాణలోని విద్యావంతులంతా ఐదారు భాషల్లో ప్రావీణ్యం సంపాదించేవాళ్లు. పీవీ కూడా అలాగే పలు భాషలు నేర్చుకున్నారు. 

వేయిపడగలు నవలను  అనువదించాలని పీవీ ఉద్యుక్తులైన సందర్భం గురించి వివరించండి?

1956లో కరీంనగర్‌లో విశ్వనాథ సత్యనారాయణ షష్టిపూర్తి ఉత్సవాలు జరిగాయి. వాటికి పీవీ కూడా వచ్చారు. విశ్వనాథ నవలల మీద గంట సేపు మాట్లాడారు.  ఉత్సవాలప్పుడే పీవీ ‘వేయి పడగలు’ అనువాదం చేయడం ప్రారంభించారు. ముందుగా 29వ అధ్యాయం గిరిక నాట్యాన్ని అనువాదం చేసి విశ్వనాథ సత్యనారాయణగారికి వినిపిస్తే బాగుందని అన్నారు. సరే.. అనువాదం కొనసాగించు అని చెప్పారు. దాంతో సహస్రఫణ్‌గా రూపుదిద్దుకున్నది. ఈ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది.

నేను మాట్లాడను పొమ్మన్నారు..

పోతన విషయంలో ఏదైనా చేయాలనే సంకల్పం ఉండేది పీవీకి. ఆ సంకల్పమే పోతన భాగవతం ఆధారంగా పోతన పంచశతి ఉత్సవాలను 1982లో నిర్వహించేలా చేసింది. వాస్తవానికి ఆ ఉత్సవాలకు సంకల్పం చేసింది నేనే. నెల్లూరులో తిక్కన తిరునాళ్లు జరిగాయి. దానికి నేను, మరొకరు వెళ్లాం. వరంగల్‌లోనూ పోతనకు సంబంధించి ఉత్సవాలు చేస్తామని చెప్పాం. అనుకున్నట్టుగానే పోతన పంచశతి ఉత్సవాలను నిర్వహించాం. దానికి పీవీ పూర్తి మద్దతిచ్చారు. ఢిల్లీ నుంచి హిందీ పండితులను తీసుకొచ్చారు. ఇతర రాష్ర్టాల నుంచి కొందర్ని తీసుకొచ్చారు. ఉత్సవాలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఈ ఉత్సవాలకు అప్పటి ఉపరాష్ట్రపతి హిదయతుల్లా కూడా వచ్చారు. ఆ ఉత్సవాల్లో విశేషం ఏంటంటే.. కొండపల్లి శేషగిరిరావు వేసిన పోతన చిత్రపటాన్ని కాళోజీ రామేశ్వరరావుతో ఆవిష్కరణ చేయించారు పీవీ. అదీ సాహిత్యంపై, సాహితీవేత్తలపై పీవీకి ఉన్న అభిమానం. అయితే, ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చూసినా, తాను మాత్రం ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధం కాలేదని వెళ్లిపోయారు. ఆయన కోసం నేను, సదాశివరావు వెళ్లి అడిగితే రానన్నారు. కచ్చితంగా రావాలని కోరగా చివరికి ఓకే అని వచ్చేశారు. ఆ రోజు పోతనపై మహాద్భుతంగా మాట్లాడారు. ఆ తర్వాత పోతన స్మారక చిహ్నాన్ని ఏర్పాటుచేయాలనుకొని చాలా ప్రయత్నాలు చేసినా ఆ కోరిక తీరకుండానే కాలం చేశారు.


logo