శుక్రవారం 10 జూలై 2020
Telangana - May 30, 2020 , 02:32:20

ఘనంగా కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభం

ఘనంగా కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభం

  • జజ్జలకరి జనారే!
  • ఘనంగా కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభం
  • మర్కూక్‌లో మోటర్లు ఆన్‌చేసిన సీఎం కేసీఆర్‌
  • రెండుసార్లు రిజర్వాయర్‌ బండ్‌ సందర్శించి పరవశం
  • ఉప్పొంగే జలాలను చూసి మైమరిచిన ముఖ్యమంత్రి
  • ఇక ఏడాదికి మూడుపంటలు.. సంబురంలో రైతులు

నెర్రెలిడిన నేల ఎదురు చూస్తుండగా..హోమ గుండపు అగ్ని ప్రజ్వరిలుతుండగా..ఉద్విగ్న జీవులు గాలినుగ్గబట్టిండగా..అటుపైని ఆకాశ మాసక్తి చూపగా..పంచ భూతాల సాక్షిగా.. దీక్షగా..నీల వర్ణపు జల ధార జాలువారింది! పోచమ్మసాగర్‌కు పొంగిపొర్లింది !బాహుబలి పంపుల నుంచి పైకి  లేచిన జల ఛత్రం నిండు సంతోషాన్ని నింగి నుంచి గుమ్మరించినట్టు..ధవళ వర్ణంలో ధడేలున పైకి లేచి ధప్పున కురిసింది! పోచమ్మ సాగరంలోకి  పెను కెరటమై విరుచుకుపడింది!! తెలంగాణ జనానందానికి ఇది సజీవ జల చిత్రం!! కాళేశ్వరం ప్రాజెక్టులో ఇదొక చరిత్రాత్మక ఘట్టం. ముఖ్యమంత్రి కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి చేతుల మీదుగా కొండపోచమ్మ సాగర్‌లోకి గోదావరి జలం ప్రవేశించింది. 

హైదరాబాద్‌/ సిద్దిపేట, నమస్తే తెలంగాణ: కొండపోచమ్మ ఒడిలో గంగమ్మ సవ్వడి చేసింది.. కొండపోచమ్మ రిజర్వాయర్‌లో గోదారమ్మ ఉవ్వెత్తున ఎగిరి దుంకింది.. ఊర్థముఖంగా తరలించిన కాళేశ్వర జలం అపరభగీరథుడి మోముపై పడి పరవశింపజేసింది. రికార్డు సమయంలో ప్రాజెక్టులను పూర్తిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కొండపోచమ్మలోకి గోదారమ్మ ఉబికివస్తుంటే ఓ సాధారణ వ్యక్తిలా అబ్బురంగా చూస్తూ ఉండిపోయారు. శుక్రవారం కొండపోచమ్మ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవం పండుగ వాతావారణంలో జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మర్కూక్‌ పంప్‌హౌజ్‌లో మోటర్లను ఆన్‌చేసి కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల ఎత్తిపోతను ప్రారంభించారు. ముందుగా సీఎం కేసీఆర్‌ దంపతులు మర్కూక్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ దేవాలయంలో జరిగిన చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అక్కడి నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి మర్కూక్‌ పంప్‌హౌజ్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ త్రిదండి చినజీయర్‌స్వామితో కలిసి సుదర్శనహోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం మర్కూక్‌ పంప్‌హౌజ్‌ను ప్రారంభించారు. పంప్‌హౌజ్‌లో సీఎం కేసీఆర్‌.. కంప్యూటర్‌ ద్వారా స్విచ్‌ఆన్‌ చేసి మొదటి మోటర్‌ను ప్రారంభించారు. నిమిషాల్లోనే గోదావరి జలాలు పంప్‌హౌజ్‌ను కొండపోచమ్మ రిజర్వాయర్‌ సిస్టిర్న్‌ నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. పంప్‌హౌజ్‌ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌ బండ్‌పైకి సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు. పంపునుంచి ఉప్పొంగుతున్న జలాలను చూసి పరవశించారు. సీఎం దంపతులు, చినజీయర్‌స్వామి అక్కడ గంగమ్మకు చీరెసారె సమర్పించారు. గోదారమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం మర్కూక్‌ పంప్‌హౌజ్‌కు చేరుకుని సీఎం కేసీఆర్‌ రెండో నంబర్‌ మోటర్‌ను ప్రారంభించారు. రెండు మోటర్ల నుంచి ఉప్పొంగిన జలాలను చూసి రిజర్వాయర్‌ వద్దకు తరలివచ్చిన రైతులు, ప్రజాప్రతినిధులు పరవశించిపోయారు. మర్కూక్‌ పంప్‌హౌజ్‌ నుంచి వరదరాజపురం వెళ్లిన ముఖ్యమంత్రి.. అక్కడ ఆలయంలో వరదరాజస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అపరభగీరథుడు ఆనంద పరవశం

వరదరాజపురం నుంచి తిరుగుపయనంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మరోసారి కొండపోచమ్మ రిజర్వాయర్‌ వద్దకు చేరుకున్నారు. రెండు పంప్‌ల నుంచి నీళ్లు పొంగివస్తుండటం చూసి ఉప్పొంగిపోయారు. కొంతసమయంపాటు నీటి ప్రవాహాన్ని అలాగే చూస్తూ ఉండిపోయారు. మంత్రుల, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కలిసి రిజర్వాయర్‌ బండ్‌పై కలియతిరిగారు. జలాల్లోకి నాణేలు వేసి.. విజయసంకేతం చూపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంలోనూ అందరినీ ఒకసారి పంప్‌హౌజ్‌ నుంచి వస్తున్న నీళ్లను చూసిరండి అంటూ సూచించారు. తాను రెండుసార్లు తిరిగివచ్చానని ఆనందంగా చెప్పారు. నీళ్లను చూస్తే అందరికీ సంబురం ఉంటుందని.. పిల్లలనెవరినీ కాలువల్లో ఈతకు పంపవద్దని పేర్కొన్న సీఎం కేసీఆర్‌.. ఎక్కడికక్కడ గ్రామాల్లో ఈతకోసం కూడా ఏర్పాట్లుచేయాలని సూచించారు.అన్నదాతల్లో హర్షం

మెతుకు సీమలో జలసంబురంపై అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతున్నది. వానకోసం మొగులుకేసి చూసే నేలల్లో కాళేశ్వర గంగ జలాభిషేకం చేయడం చూసి ఆనంద పరవశులు అవుతున్నారు. వందల కిలోమీటర్ల దూరంలోఉన్న గోదావరి జలాలు ఇక్కడికి వస్తాయా? వందల మీటర్ల ఎత్తుకు ఎక్కి ఇక్కడి భూములను తడుపుతయా? అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ గోదారమ్మ.. కొండపోచమ్మ ఒడిలో సవ్వడి చేసింది. బోరుబావులు, వర్షాలపై ఆధారపడి పంటలు పండించిన తమకు ఇక మంచిరోజులొచ్చాయని, బీడుభూముల్లో గోదావరి జలాలు పారించిన దేవుడు కేసీఆర్‌ అంటూ అన్నదాత మురిసిపోతున్నాడు. ఏడాదికి మూడు పంటలేసి మా భూముల్లో బంగారం పండిస్తామంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓ అద్భుత ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వందమీటర్ల నుంచి 618 మీటర్ల ఎత్తుకు గోదావరి పరుగులు పెట్టించారని, ఇక ఈ ప్రాంతంలో ఇక సాగునీటికి గోస ఉండదని విశ్రాంత ఇంజినీర్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. తాగు, సాగునీరు తీసుకొస్తానని అటు రైతులు, ఇటు ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు.మొత్తంగా లక్ష కోట్ల రూపాయల పంట పండించే బంగారు తెలంగాణ, భాగ్యరాశుల తెలంగాణ, పసిడి పంటల తెలంగాణ అనతికాలంలో తయారుకావడం గర్వకారణం. ‘పల్లెపల్లెలో పల్లేర్లు మొలిచె తెలంగాణలోనా’ అని కవులు పాటలు పాడుకున్న తెలంగాణ. తలాపున పారుతుంది గోదారి, మన సేను మన సెలక ఏడారి అని సదాశివుడు రాసిన పాటలు. ఒకనాడు ఏడుపు పాటల తెలంగాణ. ఇయ్యాల పసిడి ధాన్యపు రాశుల తెలంగాణ. ఇది నాకు చాలా గర్వంగా, చాలా సంతృప్తిగా ఉన్నది.

- సీఎం కేసీఆర్‌logo