శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 02:37:23

ముంపు గ్రామాలు ఖాళీ

ముంపు గ్రామాలు ఖాళీ

  • సామగ్రితో తరలిన కొండపోచమ్మ నిర్వాసితులు
  • ప్రత్యేక వాహనాలు ఏర్పాటుచేసిన సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి 
  • రెండ్రోజుల్లో పూర్తిగా ఖాళీకానున్న మామిడ్యాల, బైలాంపూర్‌ గ్రామాలు

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వారం క్రితం సామూహిక గృహప్రవేశాలు చేసుకున్న కొత్తకాలనీలోకి కొండపోచమ్మ రిజర్వాయర్‌ ముంపు బాధితులు తరలివెళ్తున్నారు. ముం పు గ్రామాలైన బైలాంపూర్‌, మామిడ్యాల ప్ర జలు సామగ్రిని ములుగు మండలం తున్కిబొల్లారంలో ప్రభుత్వం నిర్మించిన కేసీఆర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి తరలించుకొన్నారు. 

సామగ్రి తీసుకెళ్లేందుకు సిద్దిపేట కలెక్టర్‌ పీ వెంకట్రామ్‌రెడ్డి  ప్రత్యేకంగా 50 డీసీఎం వాహనాలు ఏర్పాటుచేశారు. గురు, శుక్రవారాల్లో రెండు గ్రామాల్లోని ప్రజలు పూర్తిగా తరలివెళ్లనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ఒక్కోగ్రామానికి వందచొప్పున రెండొందల డీసీఎంలను అందుబాటులో ఉంచుతున్నది. కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలోనే ఉండి నిర్వాసిత కుటుంబాలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నారు. ఆయనతోపాటు గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, వివిధ మండలాల తాసిల్దార్లు, రెవెన్యూ సిబ్బంది నిర్వాసితుల కుటుంబాలకు తోడుగా ఉంటూ అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తున్నారు.


ఆర్టీవో రామేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో వాహన సదుపాయాన్ని కల్పించారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌తో ఐదు జిల్లాలకు ప్రయోజనం కలుగనున్నది. సుమారు 2,85,250 ఎకరాలకు సాగునీరు అందనున్నది. నిర్వాసిత కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు 400 ఎకరాల్లో పరిశ్రమలను ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే ఈ భూమిని టీఎస్‌ఐఐసీకి అప్పగించారు. 200 కంపెనీలు ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చాయి. సుమారు 4వేల నుంచి 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సీఎం కేసీఆర్‌ మీద ఉన్న నమ్మకంతో ప్రాజెక్టుల కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారనీ, భూములిచ్చిన నిర్వాసితుల కుటుంబాలు గౌరవంగా ఉండేలా ఆధునిక హంగులతో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీని నిర్మించామని కలెక్టర్‌ తెలిపారు. రైతులకు పరిహారాన్ని వారి గ్రామాల్లోనే ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేసి అందించామని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా భూసేకరణ చేసిన జిల్లా సిద్దిపేట అని వెల్లడించారు.  


logo