మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 02:47:57

చెరువంత సంబురం

చెరువంత సంబురం

పోచమ్మ సిగనుంచి గలగలా గోదారి నేడు కొండపోచమ్మ జలాశయం నుంచి నీటివిడుదల జగదేవ్‌పూర్‌, తుర్కపల్లి కాలువల్లో పారనున్న జలాలు గజ్వేల్‌, ఆలేరు మండలాలకు కాళేశ్వరం తొలి ఫలాలు రెండు నియోజకవర్గాల్లో 42 చెరువులు నింపేలా ప్రణాళిక

కొండకెక్కిన గోదావరి జలాలు.. కొండంత సంతోషాన్ని నింపనున్నాయి. పోచమ్మతల్లి సాక్షిగా కరువునేలను తడుపనున్నాయి.వర్షాభావ ప్రాంతాలైన గజ్వేల్‌, ఆలేరు ప్రాంతాల్లోని 42 చెరువులను నేటి నుంచి నింపబోతున్నారు. తెలంగాణలో అత్యంత ఎత్తైన ప్రాంతానికి చేరుకున్న గంగమ్మ.. పోచమ్మ సిగనుంచి దిగువన చెరువుల్లోకి దుంకుతున్నది. అన్నదాతలను ఆనందంలో ముంచెత్తబోతున్నది. 

హైదరాబాద్‌/యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి/గజ్వేల్‌, నమస్తే తెలంగాణ: గోదావరి నదీమార్గంలో ఎదురెక్కి.. పది అడుగులేసి 618 మీటర్లపైన కొండపోచమ్మ సిగలో చేరిన కాళేశ్వరగంగ బీడుభూముల్లో పారేందుకు సిద్ధమైంది. అంచెలంచెలుగా పైకెక్కుతూ వచ్చిన గోదావరిజలాలు గత నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా కొండపోచమ్మ జలాశయానికి తరలిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి మర్కూర్‌ పంప్‌హౌజ్‌ ద్వారా కాళేశ్వరం జలాలను ఎత్తిపోస్తున్నారు. మంగళవారం కూడా మూడు మోటర్ల ద్వారా 1,250 క్యూసెక్కుల చొప్పున 3,750 క్యూసెక్కుల (0.3 టీఎంసీ) గోదావరిజలాలు పోచమ్మసాగర్‌లోకి ప్రవేశిస్తున్నాయి. 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న జలాశయంలో మంగళవారం రాత్రి వరకు 4.2 టీఎంసీల జలాలు చేరాయి. సీఎం ఆదేశాల మేరకు కాలువల ద్వారా నీటి విడుదలకు అధికారులు ఏర్పాట్లుచేశారు. బుధవారం జలాశయం నుంచి జగదేవ్‌పూర్‌, తుర్కపల్లి కాలువలకు నీటిని వదలనున్నారు. గజ్వేల్‌, ఆలేరు నియోజకవర్గాల్లోని 42 చెరువులతోపాటు పలు కుంటలను నింపనున్నారు. ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి జగదేవ్‌పూర్‌ కాలువ నీటిని విడుదల చేయనున్నారు. ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి జగదేవ్‌పూర్‌ కాలువ నుంచి వెంకటాపూర్‌ వద్ద గేట్లు ఎత్తి ఆలేరు నియోజకవర్గంలోకి నీటిని వదులుతారు. 

రెండు నియోజకవర్గాలకు తొలి ఫలం

కొండపోచమ్మసాగర్‌ జలాశయం కింద ఐదు జిల్లాల పరిధిలో 2.85 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇందుకోసం రిజర్వాయర్‌ చుట్టూ తూములను ఏర్పాటుచేశారు. అందులో జగదేవ్‌పూర్‌ కాలువ తూము ఒకటి. 695 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో 24 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ కాలువ ద్వారా 12,800 ఎకరాలకు నీరందనున్నది. జలాశయం నుంచి కాలువ ప్రారంభమైన 3.5 కిలోమీటర్ల తర్వాత ఆలేరువైపు మరోకాలువను నిర్మించారు. ఈ కాలువ ఎనిమిది కిలోమీటర్లు పోయిన తర్వాత రెండుగా చీలుతుంది. ఒకవైపు తుర్కపల్లి, మరోవైపు తుర్కపల్లి (ఎం) ప్రాంతాల్లోని ఆయకట్టుకు నీళ్లు వెళ్తాయి. బుధవారం కొండపోచమ్మసాగర్‌ జలాశయం నుంచి విడుదలయ్యే జలాలు జగదేవ్‌పూర్‌ కాలువ, ఆపై తుర్కపల్లి (ఎం) కాలువకు అందనున్నాయి. 24 కిలోమీటర్ల పొడవున నిర్మించిన తుర్కపల్లి(ఎం) కాలువ కింద 18,800 ఎకరాల ఆయకట్టు ఉన్నది. జగదేవ్‌పూర్‌, తుర్కపల్లి (ఎం) కాలువ కింద గజ్వేల్‌, ఆలేరు నియోజకవర్గాల పరిధిలోని 200 వరకు చెరువులు ఉన్నాయి. కాలువ నుంచి తూముల ద్వారా చెరువులు నింపనున్నారు. ప్రస్తుతమున్న  తూముల మేరకు గజ్వేల్‌ నియోజకవర్గంలో 28, ఆలేరు నియోజకవర్గంలో 14 చెరువులు నింపే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. మొత్తం 42 చెరువులను నింపేందుకు 0.5 టీఎంసీల నీటిని విడుదలచేస్తామని పేర్కొన్నారు. 

నెల రోజుల్లో గజ్వేల్‌ కాలువకు..

సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు నెలరోజుల్లో గజ్వేల్‌ కాలువకు కొండపోచమ్మసాగర్‌ నీటిని వదిలేలా అధికారులు పను ల్లో వేగం పెంచారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌కు నాలుగు తూములు ఏర్పాటుచేయగా, సాగునీటి అవసరాల కోసం రెండు తూములనుంచి కాలువలకు నీటిని వదులుతారు. మరో తూము కేశవరం రిజర్వాయర్‌కు నీటి విడుదలకు, నాలుగో తూము హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తారు. మొదటి తూము ద్వారా జగదేపూర్‌ కెనాల్‌ కు, రెండో తూము ద్వారా రామాయంపేట, సంగారెడ్డి కాలువలకు నీరు విడుదలవుతుంది. జగదేవ్‌పూర్‌ కాలువ ద్వారా విడుదలయ్యే జలాలు గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కూక్‌, జగదేవ్‌పూర్‌ మండలాలు, ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలంలోని చెరువులు, కుంటల్లోకి చేరునున్నాయి. 

42 ట్యాంకుల్లోకి గోదావరి జలాలు

తొలిసారి కొండపోచమ్మ సాగర్‌ నుంచి విడుదలకానున్న జలాలతో గజ్వేల్‌ నియోజకవర్గలోని 28, ఆలేరు నియోజకవర్గంలో 14 చెరువు, కుంటలు నింపనున్నారు. గజ్వేల్‌ నియోజకవర్గం మర్కూక్‌లోని చిత్తడికుంట, గన్నేరుకుంట, పాతచెరువు, బంజారుకుంట, జనగలకుంట, కుమ్మరోనికుంట, శివా రు వెంకటాపూర్‌కు చెందిన మొల్లోనికుంట, రాగికుంట, తిప్పసముద్రం, ఎర్రవల్లికి చెందిన ఎక్కకుంట, లింగరాజుచెరువు, బ్రహ్మాండ్లకుంట, ఎర్రకుంట, ఇర్రకుంట, నల్లచెరువు, మసిరెడ్డికుంట, పాండురంగసాగర్‌, ఇటిక్యాలకు చెందిన మన్యంకుంట, ఊరచెరువు, బసిరెడ్డికుంట వరదరాజ్‌పూర్‌కు చెందిన పాలరాజుకుంట, మేళ్లచెరువు, మంగకుంట, కోనంచెరువు, పీర్లపల్లికి చెందిన అనంతగిరి చెరువు, బోరబండ ప్రాజెక్టులోకి గోదావరి నీరు చేరుతుంది. మర్కూక్‌ మండలం శివారు వెంకటాపూర్‌లోని వంటిమామిడికుంట, దామరకుంటలోని కొండివానికుంట, బుచ్చమ్మకుంట, తిప్పతివాని చెరువు, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలోని గోపాల్‌పూర్‌ వద్ద ఉన్న గొరిమిళ్ల కుంట, పోచమ్మ చెరు వు, చిన్నలక్ష్మాపూర్‌ వద్ద ఉన్న దాపల్‌ చెరువు, మాదాపూర్‌ వద్ద ఉన్న జగ్గయ్య చెరువు, కొత్త చెరువు, బొమ్మలరామారం మండలంలోని రామస్వామితండా వద్ద ఉన్న చౌటకుంట, చీకటిమామిడి వద్ద ఉన్న నల్లచెరువు, ఎర్రకుంట, తిమ్మాపూర్‌లోని తిమ్మప్ప చెరువు, గూడెం చెరువులనునింపనున్నారు.

ఏండ్ల కల నెరవేరుతున్నది

ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాల రాకతో ఏండ్లకల నెరవేరబోతున్నది. సాగు, తాగునీటి కోసం పడ్డ ఇబ్బందులు ఇక శాశ్వతంగా తీరున్నాయి. ఆలేరు ప్రాంత కరువును తీర్చేందుకు గోదావరి జలాలను అందిస్తున్న అపర భగీరథుడు కేసీఆర్‌కు పాదాభివందనాలు. చెరువులు, కాలువల నిర్మాణంలో అహోరాత్రులు శ్రమించిన అధికారులు, ఇంజినీర్లకు, తమ ఊరి చెరువులను నింపుకునేందుకు శ్రమించిన సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు, కూలీలకు ధన్యవాదాలు.

-గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌


logo