శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 01:21:45

బోనమో.. మల్లన్న

బోనమో.. మల్లన్న
  • 60వేల బోనాలతో మొక్కులు

బోనాలు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో జగిత్యాల మల్లన్నజాతర హోరెత్తింది. మన రాష్ట్రం నుంచే కాక పొరుగు రాష్ర్టాల నుంచి వేల సంఖ్యలో వచ్చిన భక్తజనంతో జాతర జనసంద్రంగా మారింది. ఒకేసారి దాదాపు 60వేల మంది బోనాలతో తరలివచ్చి మల్లన్నకు మొక్కులు తీర్చుకొని తమ భక్తిని చాటిన అపూర్వచిత్రం మల్లికార్జునస్వామి ఆలయం వద్ద ఆవిష్కృతమైంది. ఏటా కాముని (ఫాల్గుణ) పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌లోని మల్లన్న ఆలయంలో జాతర నిర్వహిస్తారు. జగిత్యాల జిల్లా నుంచేకాకుండా మహారాష్ట్రలోని ముంబై, జాల్నా, కర్ణాటకలోని బీదర్‌ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన యాదవులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. తమ పిల్లాపాపలను, గొడ్డూగోదను చల్లంగ చూడాలని వేడుకుంటూ స్వామివారికి గొర్రె పిల్లలను సమర్పించారు. సాయంత్రం మల్లన్నస్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.            

- మారుతీనగర్‌


logo