శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 01:08:31

భవిష్యత్‌లో బీజేపీలో చేరుతా

భవిష్యత్‌లో బీజేపీలో చేరుతా

  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటన

హైదరాబాద్‌, జనవరి 1 (నమస్తే తెలంగాణ): బీజేపీపై గతంలో తానుచేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, భవిష్యత్‌లో ఆ పార్టీలో చేరే అవకాశం ఉన్నదని కాంగ్రెస్‌కు చెందిన మునుగోడు ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నా.. తాను మాత్రం బీజేపీలో చేరే అవకాశమున్నదని చెప్పారు.  రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పీసీసీ రేసులో ఉన్నారని, ఎవరిని వరిస్తుందనేది కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌లో కలకలం

పీసీసీ పదవి రేవంత్‌రెడ్డికి ఇస్తారనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ఆయన వ్యతిరేకవర్గం విమర్శలకు దిగుతున్నది. రేవంత్‌కు పీసీసీ ఇస్తే పార్టీని వీడటం ఖాయమంటూ ఇప్పటికే కాంగ్రెస్‌ సీనియర్లు ప్రకటనలు చేశారు. ఇక చివరి అస్త్రంగా రాజగోపాల్‌రెడ్డిని దింపినట్టు తెలుస్తున్నది. కాగా, రాజగోపాల్‌రెడ్డి ప్రకటనపై కాంగ్రెస్‌ నేత మల్లు రవి ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు రేవంత్‌ సహా పలువురు నేతలు రాజగోపాల్‌కు నచ్చచెప్పేందుకు యత్నిస్తున్నారు.