ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 13, 2020 , 01:49:37

నిమ్స్‌కు చేరిన కోబాస్‌

నిమ్స్‌కు చేరిన కోబాస్‌

  • నిమ్స్‌కు చేరిన కోబాస్‌ రోజుకు 4 వేల ఆర్టీపీసీఆర్‌ 
  • కరోనా నిర్ధారణపరీక్షల సామర్థ్యం
  • దక్షిణ భారతదేశంలోనే తొలియంత్రం
  • రెండువారాల్లో అందుబాటులోకి కోబాస్‌
  • కేంద్రం మోకాలడ్డుతో రెండు నెలలు ఆలస్యం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా నిర్ధారణకు అత్యంత ప్రామాణికంగా ఉన్న ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను పెద్దసంఖ్యలో చేసే కోబాస్‌- 8800 యంత్రం ఎట్టకేలకు నిమ్స్‌ దవాఖానకు చేరుకున్నది. 24 గంటల్లో దాదాపు 4 వేల ఆర్టీపీసీఆర్‌ పరీక్షలుచేయడం దీని ప్రత్యేకత. మొత్తం రూ.7 కోట్ల విలువైన ఈ యంత్రం రాష్ర్టానికి వచ్చేందుకు మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ చూపారు. రెండునెలల క్రితమే స్వయంగా రాంకీ సంస్థతో మాట్లాడి కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) కింద ఈ యాంత్రాలను తెప్పించాలని కోరారు. దాంతో రాంకీ సంస్థ కోబాస్‌ యంత్రాన్ని బుక్‌చేసింది. స్విట్జర్లాండ్‌కు చెందిన రోచే కంపెనీ ఆ యంత్రాన్ని తెలంగాణ కోసం జూన్‌లోనే పంపింది. జూన్‌ 8 నాటికి అది చెన్నై దాకా చేరుకోగానే కేంద్ర ప్రభుత్వం సూచనతో ఈ యంత్రాన్ని తెలంగాణకు కాకుండా కోల్‌కతాకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్‌ అప్పట్లో ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ రాష్ట్ర యంత్రాన్ని తన్నుకుపోయారని మండిపడ్డారు. ఇప్పుడు మరో యంత్రాన్ని ఒప్పందం ప్రకారం రోచే కంపెనీ తెలంగాణకు పంపింది. కోబాస్‌ యంత్రం నిమ్స్‌కు చేరుకున్నది.

రూ.కోటితో నిమ్స్‌లో ల్యాబ్‌

ఈ యంత్రం కోసం ఇప్పటికే రూ.కోటితో నిమ్స్‌లో ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటుచేశారు. 10 రోజుల్లో యంత్రం ఇన్స్టలేషన్‌ అవుతుందని, రెండువారాల్లో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని నిమ్స్‌ ఉన్నతాధికారులు తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలో గోల్డెన్‌ టెస్టులుగా చెప్పుకొనే ఆర్టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్య పెరుగుతుందని, తద్వారా కరోనా బాధితులను త్వరగా గుర్తించి చికిత్స అందించడం సాధ్యమవుతుందని చెప్పారు. మరో యంత్రానికి ఆర్డర్‌ ఇచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ దృష్ట్యా సరఫరాలో ఆలస్యమయ్యే అవకాశమున్నదన్నారు. మన రాష్ర్టానికి రావాల్సిన కోబాస్‌ యంత్రం పశ్చిమబెంగాల్‌కు వెళ్లిందని, మనది దక్షిణ భారత్‌లోనే తొలి అత్యాధునిక యంత్రం గల రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని వివరించారు.


logo