మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:39:30

కరోనాపై కదం తొక్కుతూ..

కరోనాపై కదం తొక్కుతూ..

  • మహమ్మారిని జయిస్తున్న తెలంగాణవాసులు
  • జాతీయ సగటుకంటే 11 శాతం ఎక్కువ
  • వైరస్‌ మరణాల రేటు ఒక్కశాతం లోపే
  • అందుబాటులో నాణ్యమైన వైద్యసేవలు
  • ప్రజల్లో వైరస్‌ పట్ల పెరిగిన అప్రమత్తత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : అప్పుడే పుట్టిన పసికందు నుంచి 94 ఏండ్ల ముసలవ్వ దాకా కరోనాను జయిస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్న ది. ప్రజల్లో పెరిగిన అప్రమత్తత, ప్రభుత్వ చర్యల ఫలితం గా రాష్ట్రంలో కరోనా కేసుల రికవరీ రేటు బాగా పెరిగింది. గత నెల 18న కరోనా నుంచి కోరుకున్నవారు 41 శాతంగా ఉండగా, నెల తర్వాత(సోమవారం నాటికి) రికవరీ రేటు 74 శాతానికి చేరుకున్నది. రాష్ట్రంలో మొత్తం 46,274 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అందులో 34,323 మంది కోలుకున్నారు. గత నెల 18న రికవరీ రేటు 41శాతంగా ఉండగా, జూలై 13న 65 శాతానికి, జూలై 19 నాటికి 72 శాతానికి, సోమవారం నాటికి 74 శాతానికి చేరింది. ఇది దేశ రికవరీ రేటు కంటే 11శాతం ఎక్కువగా ఉండటం విశేషం. యాక్టివ్‌ కేసుల నమోదు కంటే రికవరీ రేటు మూడింతలు ఎక్కువగా ఉండటం మంచి పరిణామం. ప్రస్తుతం 12వేలకుపైగా యాక్టివ్‌ కేసులు ఉండగా, రికవరీ అయిన వారి సంఖ్య 32వేల దాకా ఉన్నది. మరణాల రేటు కూడా ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో తక్కువగా ఉండటం ఊరట కలిగించే అంశం. రాష్ట్రంలో కొవిడ్‌ వల్ల మరణిస్తున్న వారి సంఖ్య 0.91శాతం ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా మరణాల రేటు 2.42గా ఉన్నది.

ఎక్కడికక్కడ పరీక్షలు, చికిత్స

కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దమొత్తంలో పరీక్షలు నిర్వహిస్తున్నది. ఆర్టీపీసీఆర్‌, యాంటీజెన్‌ పరీక్షలు చేస్తున్నది. 16 ప్రభుత్వ, 23 ప్రైవేటు ల్యాబ్‌లలో, క్యాంపుల్లో ఎక్కడిక్కడే యాంటీజెన్‌ పరీక్షలను నిర్వహిస్తున్నది. ఇప్పటివరకు 2.5 లక్షల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసింది. అటు.. కరోనా సోకిన వాళ్ల బాగోగులుచూస్తూ రికవరీ రేటును పెంచుతున్నది. మొత్తం 33 జిల్లాల పరిధిలో 61 ప్రభుత్వ, 57 ప్రైవేటు దవాఖానల్లో చికిత్స అందిస్తున్నది. 22 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోనూ ఉచితంగా చికిత్స ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నది. హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి ఔషధాలతో కూడిన కిట్ల ను అందిస్తున్నది. వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు టెలిమెడిసిన్‌ ద్వారా సేవలందిస్తున్నది. దీంతో రికవరీరేటు ఆశించినస్థాయికి చేరుతున్నది. ప్రజలు కూడా నాణ్యమైన ఆహారం, విటమిన్లు తీసుకుంటూ, వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యాన్ని పాటిస్తున్నారు. వైరస్‌ వచ్చాక బాధపడేకంటే, ముందుగా జాగ్రత్తలు పాటిస్తే మేలనుకుంటున్నారు. మిరియాలు, శొంఠి, అల్లం, దాల్చిన.. వంటి పదార్థాలతో తయారుచేసిన కషాయాన్ని తాగుతూ, పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.


logo