బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 01:49:56

మూడునెలల్లో కిసాన్‌ ఎరువులు

మూడునెలల్లో కిసాన్‌ ఎరువులు

  • రామగుండంలో రూ. 6,120 కోట్లతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పునర్నిర్మాణం
  • ఇప్పటికే 99.6 శాతం పనులు పూర్తి
  • రాష్ట్ర అవసరాలకు 50% ఇక్కడి నుంచే
  • ముఖ్యమంత్రి ముందుచూపుతో కర్మాగారానికి పూర్వవైభవం
  • మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 

హైదరాబాద్‌/పెద్దపల్లి,నమస్తేతెలంగాణ: ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి రామగుండంలో ఎరువుల ఉత్పత్తి ప్రారంభమవుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వీటిని దేశీయ మార్కెట్‌లోకి కిసాన్‌బ్రాండ్‌ పేరిట తీసుకురానున్నామని వెల్లడించారు. ఆదివారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను సందర్శించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. 1985లో మూతపడ్డ ఈ కర్మాగారం సీఎం కేసీఆర్‌ చొరవతో పునరుద్ధరణకు నోచుకుంటున్నదని చెప్పారు. రూ. 6,120 కోట్లలో చేపట్టిన పనులు 99.6 శాతం పూర్తయ్యాయన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పనుల్లో కొంత ఆలస్యం జరుగుతున్నదని వివరించారు. ఈ ఫ్యాక్టరీకి రోజూ 3,850 మెట్రిక్‌ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్‌ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. రాష్ట్ర అవసరాలకు 50 శాతం ఎరువులు ఇక్కడి నుంచే అందనున్నాయని తెలిపారు. జూలై చివరి వరకు అమ్మోనియా ప్లాంట్‌ పనులు, ఆగస్టు నెలాఖరుకు యూరియా ప్లాంట్‌ నిర్మాణం పూర్తిచేసి సెప్టెంబర్‌లో ఉత్పత్తి  ప్రారంభిస్తామని వెల్లడించారు. ఫ్యాక్టరీ ప్రారంభమైతే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.  అనంతరం మేడిపల్లిలో రైతువేదిక నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, జడ్పీచైర్మన్‌ పుట్ట మధు, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, సీపీ సత్యనారాయణ, కార్పొరేషన్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


logo