శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 11, 2021 , 01:55:10

సహకారం బలోపేతం

సహకారం బలోపేతం

  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
  • ఖమ్మం డీసీసీబీ అగ్రగామిగా నిలవాలి: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం/ఖమ్మం వ్యవసాయం, జనవరి 10: రాష్ట్రంలో సహకార సంఘాలను మరింత బలోపేతం చేస్తామని, దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకుసాగుతామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలో నిర్వహించిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శతాబ్ది ఉత్సవాలకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి హాజరయ్యారు. అంతకుముందు నగరంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంప్‌లో రూ.4 కోట్లతో ఏర్పాటు చేసిన ఆధునిక సమీకృత మార్కెట్‌ను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. డీసీసీబీల మనుగడ కేవలం సహకార సంఘాలపైనే ఆధారపడి ఉందన్నారు. 

కొనుగోలు కేంద్రాల ద్వారా సొసైటీలు బలోపేతం అవుతాయన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికలతోనే సహకార సంఘం పటిష్టమవుతుందన్నారు. అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఖమ్మం డీసీసీబీ రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్నదని, మున్ముందు కరీంనగర్‌కు పోటీగా నిలవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా సొసైటీ చైర్మన్లు మరింత కష్టపడి పనిచేసి బ్యాంకు పురోభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సహకార రైతులు ఏకతాటిపై నడవాలన్నారు. కార్యక్రమంలో నాఫ్‌క్యాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, హరిప్రియ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.