గురువారం 04 జూన్ 2020
Telangana - May 12, 2020 , 16:08:45

ఈసారి ఒక్క అడుగు ఎత్తులో ఖైరతాబాద్‌ గణేష్!

 ఈసారి ఒక్క అడుగు ఎత్తులో ఖైరతాబాద్‌ గణేష్!

హైదరాబాద్‌ : వినాయక చవితి పండుగ అనగానే హైదరాబాదీలతో పాటు మిగతా ప్రాంతాల వారికి ఖైరతాబాద్‌ గణేశ్‌ గుర్తుకు వస్తోంది.  ప్రతి ఏడాది ఈ భారీ ప్రతిమను చూసేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపుతుంటారు. ఖైరతాబాద్‌ గణేషుడిని అంత అద్భుతంగా తీర్చిదిద్దుతారు కాబట్టి. కానీ ఈ ఏడాది భారీ ఎత్తులో ఉండే గణనాథుడిని చూడలేరు భక్తులు. కరోనా వైరస్‌ కారణంగా కేవలం ఒక అడుగు ఎత్తులో మాత్రమే గణేషుడి ప్రతిమను ప్రతిష్టించనున్నారు.

ఖైరతాబాద్‌ వినాయక విగ్రహం ఎత్తుపై ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో భారీ విగ్రహ ఏర్పాటును గణేశ్‌ ఉత్సవ కమిటీ విరమించుకుంది. ఈ నెల 18న నిర్వహించాల్సిన కర్ర పూజ కార్యక్రమాన్ని కమిటీ రద్దు చేసింది. ఈ ఏడాది ఒక అడుగు ఎత్తు విగ్రహాన్ని ప్రతిష్టించాలని కమిటీ నిర్ణయించింది. 

2019లో ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా భక్తుల ముందుకు వచ్చాడు ఖైరతాబాద్‌ వినాయకుడు. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో.. 61 అడుగుల ఎత్తులో గణేషుడు భక్తులకు కనువిందు చేశాడు.


logo