శనివారం 04 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 02:57:48

చదువులమ్మ చెట్టు నీడలో..

చదువులమ్మ చెట్టు నీడలో..

  • ఇంటర్‌ ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ విద్యార్థులు
  • మోడల్‌ స్కూళ్లు మేటి.. గురుకులాలు ఘనం 
  • తొలి బ్యాచ్‌లోనే కేజీబీవీల ఉత్తమ ప్రదర్శన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇంటర్‌ ఫలితాల్లో ‘సర్కారీ’ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. మోడల్‌ స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీలు.. ఇలా అన్నింటా విద్యార్థుల ఉత్తీర్ణతశాతం మెరుగ్గా ఉన్నది. ఫలితాల్లో తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ సొసైటీ (టీఆర్‌ఈఐఎస్‌) ఆధ్వర్యంలోని 35 జూనియర్‌ కాలేజీలు టాప్‌లేపాయి. మిగతా కాలేజీల కంటే అధిక ఉత్తీర్ణత సాధించాయి. సెకండియర్‌ ఫలితాల్లో 95.3 శాతం, ఫస్టియర్‌లో 90.9 శాతంతో తొలిస్థానంలో నిలిచాయి. ఆ తర్వాత స్థానం లో మహాత్మాజ్యోతిరావుపూలే బీసీ సంక్షేమశాఖ గురుకుల జూనియర్‌ కాలేజీలున్నాయి. ఆ కాలేజీల్లో సెకండియర్‌లో 91.77 శాతం, ఫస్టియర్‌లో 87.29 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 194 మోడల్‌ స్కూల్‌ జూనియర్‌ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఇంటర్‌ ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించారు. ఒక మోడల్‌జూనియర్‌ కాలేజీలో 100 శాతం ఫలితాలు నమోదయ్యాయి. మొత్తంగా ద్వితీ య సంవత్సరంలో 68.61 శాతం మంది, ప్రథమ సంవత్సరంలో 55.42 శాతం మం ది ఉత్తీర్ణులయ్యారు. కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ) జూనియర్‌కాలేజీలకు చెందిన విద్యార్థుల ఉత్తీర్ణతశాతం 78.76గా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 170 కేజీబీవీలు ఉండగా వాటిలో 88 కేజీబీవీల్లో జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీల్లో 4,483 మంది విద్యార్థులు సెకండియర్‌ పరీక్షలకు హాజరుకాగా 3,531 మంది ఉత్తీర్ణులయ్యారు. 2018-19 విద్యాసంవత్సరం నుంచి కేజీబీవీల్లో జూనియర్‌ కాలేజీలు ప్రారంభం కాగా, 2019-20తో తొలిబ్యాచ్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలురాసి మంచి మార్కులు సాధించింది. ద్వితీయ సంవత్సరంలో మూడు, ప్రథమ సంవత్సరంలో నాలుగు కేజీబీవీ కాలేజీల్లో 100 శాతం ఫలితాలు వచ్చాయి. సెకండియర్‌లో 61 కేజీబీవీ కాలేజీల్లో, ఫస్టియర్‌లో 79 కాలేజీల్లో 90శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థల సొసైటీ కార్యదర్శి వేంకటేశ్వరశర్మను, అన్ని కాలేజీల విద్యార్థులను, అధ్యాపకులను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ అభినందించారు.

పేదింట విద్యాకుసుమం 


కాగజ్‌నగర్‌ టౌన్‌: కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లోని ద్వారకాగనర్‌కాలనీకి చెందిన కాటి కల్యాణి.. ఇం టర్‌ ఎంపీసీలో 992/1000 మార్కులు సాధించి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. కాటి శేషగిరి-అనిత దంపతుల రెండో కుమార్తె కల్యాణి టెన్త్‌లో 9.7 జీపీ ఏ సాధించింది. హైదరాబాద్‌కు చెందిన మేథా ట్రస్ట్‌ ప్రతిభా పరీక్షల్లో టాపర్‌గా నిలిచింది. వారి సహకారంతో హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కాలేజీలో చేరి ఇప్పుడు ప్రథమస్థానంలో సాధించింది.   తండ్రి శేషగిరి ఊరూరా తిరుగుతూ గతంలో అ ల్యూమినియం పాత్రలను అ మ్మి కుటుంబాన్ని పోషించారు. ఇప్పుడు శేషగిరి తన భార్యతో కలిసి ఇంట్లోనే ఇడ్లీలను తయారుచేసుకొని సైకిల్‌పై తిరుగు తూ అమ్ముతున్నారు. కల్యాణిని సిర్పూ రు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సన్మానించారు. విద్యార్థి ఉన్నత చదువులకు రూ. లక్ష అందజేస్తామని హామీఇచ్చారు.

గురుకులాల వారీగా ఫలితాలు ఇలా.. 

గురుకులాలు
    ఫస్టియర్‌     ఉత్తీర్ణత శాతం
సెకండియర్‌ ఉత్తీర్ణతశాతం
టీఆర్‌ఈఐఎస్‌ 
90.9
95.3
బీసీ గురుకులాలు 
87.29
91.77 
మైనార్టీ గురుకులాలు 
87.0
91.7
సాంఘిక సంక్షేమ గురుకులాలు 
79.9
89.38
గిరిజన సంక్షేమ గురుకులాలు 
72.5
85.08
logo