సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 02:24:13

వరద బాధితులకు భూరి విరాళాలు

వరద బాధితులకు భూరి విరాళాలు

  • ప్రభాస్‌:1.5 కోట్లు
  • చిరంజీవి:1 కోటి
  • మహేశ్‌బాబు:1 కోటి
  • ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ 15 కోట్లు 
  • పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత 2 కోట్లు 
  • అపర్ణ గ్రూప్‌ 6 కోట్లు 
  • మై హోం గ్రూప్‌ 5 కోట్లు 
  • హైదరాబాదీకి ఆపదలో అండగా
  • సీఎంలకు ఫోన్‌చేసి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ముందుకురావాలని, కష్టకాలంలో ఉన్నవారికి సాయమందించి ఉదారత చాటాలని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తున్నది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమత సహా పలువురు నగదు, వస్తు రూపేణా సహాయం ప్రకటించారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, తెలుగు సినీరంగ ప్రముఖులు భూరి విరాళాలందిస్తూ మానవతను చాటుకున్నారు. ఎంపీల నుంచి కార్పొరేటర్ల వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు తమ వేతనాలను విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ ప్రజలను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన లభిస్తున్నది. రాష్ట్రంలో సహాయ, పునరావాస పనుల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తమ రాష్ట్రం తరపున రూ.15 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ‘హైదరాబాద్‌లో వరదలు చాలా విషాదకరం, అనేకమంది అన్నదమ్ములు, అక్కాచెల్లలు ఇబ్బందులకు గురయ్యారు. వారందరికీ ఢిల్లీప్రభుత్వం, ప్రజలు సోదరభావంతో అండగా ఉంటారు’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. కష్ట సమయంలో తెలంగాణకు ఢిల్లీ పూర్తి అండగా ఉంటుందని పేర్కొన్నారు. వర్షాలతో తెలంగాణ ప్రజలు ఇబ్బందిపడడం తమకు బాధ కలిగిస్తున్నదని మమతాబెనర్జీ సీఎం కేసీఆర్‌కు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సుహృద్భావ సూచికగా సోదర భావంతో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం రూ.2 కోట్లను తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అందజేస్తుందని లేఖలో పేర్కొన్నారు.

అపర్ణ గ్రూప్‌ రూ. 6 కోట్ల సహాయం

అపర్ణ గ్రూప్‌ రూ. 6 కోట్ల సహాయాన్ని మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. ఈ సందర్భంగా అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రెడ్డి మాట్లాడుతూ తమకు సాధ్యమైన మేరకు ప్రజాసంక్షేమానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.  ఈ విపత్తు సమయంలో ప్రజలకు, ప్రభుత్వానికి అండగా ఉండేందుకు తమవంతు బాధ్యతగా సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

మైహోం దాతృత్వం రూ.5 కోట్లు

వరద బాధితులను ఆదుకోవాలంటూ  రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పిలుపునకు స్పందించిన మైహోం గ్రూప్‌ సంస్థల అధినేత డాక్టర్‌ రామేశ్వర్‌రావు రూ. 5 కోట్ల  సహాయాన్ని ప్రకటించారు. హైదరాబాద్‌ ప్రజలు వరదల్లో ఉన్నప్పుడు స్పందించడం పౌరుల ధర్మమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అనేక సంస్థలు, వ్యక్తులు ముందుకొచ్చి సహాయ, సహకారాలు అందిస్తున్న వారిని ఆయన అభినందించారు. ప్రజలు త్వరగా వరదల నుంచి విముక్తం కావాలని ఆకాంక్షించారు.

హైదరాబాదీల కోసం సినీతారల వితరణ

వరదలతో అల్లాడుతున్న హైదరాబాద్‌ వాసులను ఆదుకొనేందుకు తెలుగు సినీరంగ ప్రముఖులు ముందుకొచ్చారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపునకు స్పందించిన పలువురు సినీనటులు భూరి విరాళాలందించారు. ప్రభాస్‌ రూ.1.50 కోట్లు, చిరంజీవి, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌, మహేశ్‌బాబు రూ.కోటి చొప్పున, ఎన్టీఆర్‌, నాగార్జున రూ.50 లక్షల చొప్పున, రామ్‌ రూ.25 లక్షలు, రవితేజ, విజయ్‌ దేవరకొండ, దర్శకుడు త్రివిక్రమ్‌, నిర్మాత రాధాకృష్ణ, అనిల్‌ రావిపూడి, మైత్రీ మూవీ మేకర్స్‌ రూ.10 లక్షల చొప్పున, నటుడు బండ్ల గణేశ్‌, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ రూ.5 లక్షల చొప్పున, త్రినాథ్‌ రూ.50వేలు విరాళాలు ప్రకటించారు. 

సీఎం కేసీఆర్‌ ధన్యవాదాలు

పునరావాస కార్యక్రమాల కోసం రూ.15 కోట్లు సహాయం ప్రకటించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు, రూ.2 కోట్లు ప్రకటించిన పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీకి తెలంగాణ ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆయన కేజ్రీవాల్‌కు, మమతాబెనర్జీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. కేజ్రీవాల్‌ ఎంతో ఉదారత చాటుకొని అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు సీఎం పళనిస్వామికి కూడా కేసీఆర్‌ ఫోన్‌చేసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. నగదుతోపాటు వస్తు రూపంలో సహాయం చేయాలని నిర్ణయించి ఉదారత చాటుకున్నారని తమిళనాడు సీఎంను కేసీఆర్‌ అభినందించారు.