గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 00:17:16

కేసీఆర్‌ గొప్ప హిందువు

కేసీఆర్‌ గొప్ప హిందువు

  • ప్రతి పథకంలో సామాజిక న్యాయం  
  • బీజేపీ పాలిత రాష్ర్టాల్లో  అరాచకాలు
  • హైదారాబాద్‌లో వారి  ఆటలు సాగవు  
  • టీఆర్‌ఎస్‌ పార్లీమెంటరీ పార్టీ నేత కేకే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కన్నా పెద్ద హిందువు ఎవరూ లేరని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి పథకంలో, ప్రతి ఆచరణలో సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నదని చెప్పారు. ఎన్నికల కోసమే సామాజిక న్యాయం అనే ఎజెండాను టీఆర్‌ఎస్‌ తీసుకోలేదని, సీఎం కేసీఆర్‌ ఆలోచనా విధానం అందుకు విరుద్ధమని అన్నారు. తెలంగాణ, ప్రత్యేకించి హైదరాబాద్‌ అన్ని మతాలు, వర్గాలు, కులాలకు ఆలవాలమని చెప్పారు. హిందుత్వం మతం కాదని, అదొక జీవన విధానమని తెలిపారు. ప్రజల జీవితాల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అహర్నిశలు కృషిచేస్తున్నదని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేత లింగంపల్లి కిషన్‌రావుతో కలిసి కేకే మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ మాదిరిగా ఏనాడూ ఏ ప్రభుత్వం ఇంతటి సామాజిక న్యాయాన్ని తమ విధానంగా అనుసరించిన దాఖలాలను తన రాజకీయ జీవితంలో చూడలేదని చెప్పారు. సీఎం కేసీఆర్‌ అద్భుతమైన దార్శనికతో ముందుకు సాగుతున్నారని, ప్రతి మనిషి, ప్రతి వర్గం బాగుపడాలనే తపనతో ఆరేండ్లుగా పాలిస్తున్నారని కొనియాడారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఒకనాడు ఆలయ ప్రవేశం లేదని, అది గ్రహించే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రతి ఇంటిని ఒక గుడిగా మార్చుకున్నాయని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, సహా పేదలందరూ సమానమనే ఆలోచనతో ముందుకు సాగుతున్నదన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్‌ పరిమితికి మించి సీట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. హిందువుల పేరిట, మతం పేరిట రాజకీయాలు చేసే దౌర్భాగ్యం నెలకొనడం దురదృష్టమన్నారు. తన 80 ఏండ్ల జీవితంలో ప్రతి రెండేండ్లకోసారి కర్ఫ్యూ విధించే పరిస్థితులుండేవని, కేసీఆర్‌ సీఎం అయినంక తెలంగాణలో ప్రశాంతత నెలకొన్నదని చెప్పారు. ఇటువంటి హైదరాబాద్‌పై హిందుత్వం పేరుతో కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని, వారి ఆటలు సాగవని హెచ్చరించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో బలహీన వర్గాలపై నిత్యం ఏదో ఒకచోట అరాచకాలు కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధివైపు చిత్తశుద్ధితో పనిచేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.

డైనమిక్‌ లీడర్‌ కేటీఆర్‌

తన రాజకీయ జీవితంలో మంత్రి కేటీఆర్‌ వంటి డైనమిక్‌ లీడర్‌ను చూడలేదని కేశవరావు చెప్పారు. కేటీఆర్‌ను ‘యంగ్‌బాయ్‌.. విత్‌ ఏ డైనమిక్‌ విజన్‌'గా అభివర్ణించిన కేకే.. హైదరాబాద్‌ను ఆయన అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు.

ప్రజల మధ్య చిచ్చు.. బీజేపీ తీరు: కొప్పుల

సామరస్యంతో జీవిస్తున్న ప్రజల మధ్య చిచ్చుపెట్టడమే బీజేపీ విధానంగా మారిందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మండిపడ్డారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు వారివారి సిద్ధాంతాలను ప్రచారం చేసుకుంటాయి.. లేదా తాము చేసిన అభివృద్ధిని, అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమలను చెప్పుకొంటాయని, బీజేపీ మాత్రం హైదరాబాద్‌లో అరాచకం చేయబోతామనేలా ప్రచారం చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నంబర్‌వన్‌ స్థానానికి తీసుకుపోయిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. మంత్రి కేటీఆర్‌ కష్టపడి పనిచేస్తూ హైదరాబాద్‌కు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారని గుర్తుచేశారు. ఇటువంటి వాతావరణాన్ని చెడగొట్టేందుకు బీజేపీ నేతలు కుటిల యత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ఇంత ఎగిరెగిరి పడుతున్నారని ఎంపీలు బండి సంజయ్‌, అర్వింద్‌లను నిలదీశారు. బీజేపీ పుట్టక ముందే దేశభక్తి దేశం నిండా ఉన్నదని గుర్తుచేశారు. నిత్యం దేవుడి గురించి మాట్లాడే బీజేపీ నాయకులు భద్రాద్రి రామాలయానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.