శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 02:59:36

కేసీఆర్‌ విజన్‌ ఆకర్షించింది

కేసీఆర్‌ విజన్‌ ఆకర్షించింది

  • టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో  అన్నివర్గాలకూ సముచిత స్థానం
  • ప్రగతిని పరుగులు పెట్టిస్తున్న టీఆర్‌ఎస్‌కే మళ్లీ గ్రేటర్‌ పట్టం
  • ‘నమస్తే తెలంగాణ’తో బొగ్గారపు దయానంద్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దూరదృష్టితో తెలంగాణ ప్రగతి పరుగులు పెడుతున్నదని గవర్నర్‌ కోటాలో శాసనమండలికి ఎంపికైన బొగ్గారపు దయానంద్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంతో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని, యావత్తు దేశం తెలంగాణ వైపు చూస్తున్నదని చెప్పారు. ప్రధానంగా సీఎం కేసీఆర్‌ విజన్‌కు ఆకర్షితుడనై టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరానని తెలిపారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవలు చేసే అవకాశాన్ని కల్పించిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ఎమ్మెల్సీగా నామినేట్‌ అయిన సందర్భంగా ఆయన  ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. 

రాజకీయాల్లోకి ఏ లక్ష్యంతో వచ్చారు? ప్రజలకు మీరందించే సేవ ఎలా ఉంటుంది? 

ప్రభుత్వ ఉద్యోగిగా సేవలిందించా. ప్రజా సేవ చేయాలనే ఆశయంతో ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశా. 2003 సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చాను. వైశ్యులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేశాను. సీఎం కేసీఆర్‌ నిర్ణయాలకు ఆకర్షితుడినై టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాను. 2014 నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు నా వంతు కృషి చేశాను. రాజకీయంగా నాకు గుర్తింపునివ్వడమే కాకుండా ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని అందించిన సీఎం కేసీఆర్‌కు ఎల్లవేళలా కృతజ్ఞుడిని. 

ఎమ్మెల్సీగా మీ ప్రాధాన్యాలేమిటి?

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సముచిత గౌర వం దక్కుతున్నది. సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో నా వంతు కృషిగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.

రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మీ పాత్ర ఎలా ఉండబోతున్నది ?

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, కేసీఆర్‌కు మద్దతునివ్వడాన్ని గ్రేటర్‌ ప్రజలు గౌరవంగా భావిస్తున్నారు. అందుకే 2016 గ్రేటర్‌ ఎన్నికల్లో అత్యధిక మంది కార్పొరేటర్లు గెలుపొందారు. అలాగే 2018 శాసనసభ ఎన్నికల్లో నగరవాసులు ఘనమైన విజయాన్ని అందించారు. మంచి పరిపాలనదక్షుడిగా సీఎం కేసీఆర్‌ పేరు ప్రతిష్ఠలు మరే నాయకుడికి సాధ్యపడలేదు. గతంలో ఎన్నడూలేనంతగా హైదరాబాద్‌ అద్భుత ప్రగతిని సాధించింది. నగర బ్రాండ్‌ను పెంచాలంటే ఇలాంటి విజన్‌ ఉన్న ప్రభుత్వంతోనే సాధ్యం. రాబోయే ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీపై మరోసారి గులాబీ జెండాను ఎగురవేస్తాం 

గ్రేటర్‌ ప్రజలకు మీరు చేసే విన్నపం

గ్రేటర్‌ హైదరాబాద్‌ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి. తెలంగాణ సర్కార్‌, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలతో ముందుకుపోతున్నారు. ఇప్పటికే నగరం చాలా రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. కరోనా వంటి క్లిష్ట సమయాల్లోనూ అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ అభివృద్ధి నిరంతరాయంగా  కొనసాగాలంటే గ్రేటర్‌ పీఠం టీఆర్‌ఎస్‌ సొంతమైతేనే సాధ్యమవుతుంది.