సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 02:52:40

రాజకీయం కాదు రణనీతే

రాజకీయం కాదు రణనీతే

  •  దేశ రక్షణ విషయంలో రాజీ వద్దేవద్దు
  • తలవంచొద్దు.. తొందరపడొద్దు 
  • ఓర్వలేకే తరచూ చైనా కయ్యాలు
  • ఆ దేశంతో ఎప్పటికైనా ప్రమాదమే
  • వ్యూహాత్మకంగా వ్యవహరించాలి
  • కశ్మీర్‌ సమస్యను పరిష్కరిస్తున్నాం
  • పీవోకేపై గట్టిగా మాట్లాడుతున్నాం
  • మనం శాంతిని కోరుతాం.. కానీ సహనానికి కూడా హద్దుంది
  • ప్రధాన మంత్రికి తెలంగాణ పూర్తి అండగా నిలుస్తుంది
  • మోదీ అఖిలపక్ష సమావేశంలోటీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భారత్‌- చైనా సరిహద్దులో ఘర్షణల నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరంలేదని స్పష్టంచేశారు. దేశంలో ఇప్పుడు కావాల్సింది రాజనీతి (రాజకీయం) కాదని, రణనీతి (యుద్ధనీతి) కావాలి అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడి హోదాలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. చైనాతో భారత్‌కు ఎప్పటికైనా ప్రమాదం పొంచిఉన్నదని, దాన్ని ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌.. ప్రధానికి సూచించారు. భారత్‌లో పరిపాలన సుస్థిరంగా ఉండటం, గొప్ప ఆర్థికశక్తిగా ఎదగడం ఓర్వలేకనే చైనా కయ్యానికి కాలుదువ్వుతున్నదని ఆయన అభిప్రాయపడ్డారు.

చైనా, పాకిస్థాన్‌కు ఘర్షణలు అలవాటే

‘వారి దేశాల్లో అంతర్గత సమస్యలున్నప్పుడు సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం సృష్టించడం చైనా, పాకిస్థాన్‌కు అలవాటు. ఇప్పుడు చైనాలో కూడా అంతర్గత సమస్యలున్నాయి. దక్షిణ చైనా సముద్రతీర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్‌, జపాన్‌ తదితరాలతో చైనా ఘర్షణలకు దిగుతున్నది. చైనా వైఖరి ప్రపంచవ్యాప్తంగా బాగా బద్నాం అయింది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

ఆదినుం‘చైనా’ ప్రమాదమే

‘భారతదేశంతో చైనా మొదటినుంచి ఘర్షణ వైఖరి అవలంబిస్తున్నది. గల్వాన్‌ లోయవంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. ఇది మొదటిది కాదు, చివరిది కాదు. 1957లో సరిహద్దు వివాదం లేవనెత్తింది. 1962లో ఏకంగా భారత్‌, చైనా మధ్య పూర్తిస్థాయి యుద్ధమే జరిగింది. 1967లో కూడా సరిహద్దులో ఘర్షణ చోటుచేసుకున్నది. అప్పుడు 200 మంది మృతిచెందారు. ఇప్పుడు గల్వాన్‌ వద్ద మళ్లీ ఘర్షణలు జరిగాయి. అందులోనూ మన సైనికులు 20 మంది అమరులయ్యారు. వేల కిలోమీటర్ల సరిహద్దు కలిగిన దేశంతో ఎక్కడో ఓ చోట.. ఏదో ఓ గొడవ జరుగుతూనే ఉన్నది. చైనాతో భారత్‌కు ఎప్పటికైనా ప్రమాదం పొంచిఉన్నది. మనం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ప్రస్తుతం చైనా ఘర్షణాత్మక వైఖరికి ప్రత్యేక కారణాలున్నాయి. మనం కశ్మీర్‌ విషయంలో కొత్త చట్టాలు తెచ్చాం. అక్కడి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం. పీవోకే గురించి గట్టిగా మాట్లాడుతున్నాం. ఆక్సాయ్‌ చిన్‌ మనదే అని, దానిని చైనా ఆక్రమించిందని పార్లమెంట్‌లోనే మన కేంద్రమంత్రి ప్రకటించారు. గల్వాన్‌ లోయ దేశ రక్షణ విషయంలో స్ట్రాటజిక్‌ పాయింట్‌. అక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. ఇదంతా చైనాకు నచ్చడం లేదు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఎవరైనా మీదికొస్తే తీవ్ర ప్రతిఘటనే

‘మనది శాంతికాముక దేశం. అదే సమయంలో సహనానికీ హద్దు ఉంటుంది. ఎవరైనా మన మీదికి వస్తే తీవ్రంగా ప్రతిఘటించాలి. దేశ రక్షణ, ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దు. ఈ పరిస్థితుల్లో రాజకీయం అవసరంలేదు. రణనీతి కావాలి. దేశమంతా ఒక్కతాటిపై నిలబడాల్సిన సమయం ఇది. గతంలోనూ ఇతర దేశాలతో ఘర్షణలు, యుద్ధాలు జరిగినప్పుడు ఇలాగే నిలబడిన సందర్భాలున్నాయి. చైనా యుద్ధం, పాక్‌ యుద్ధాలు, బంగ్లాదేశ్‌ యుద్ధాలు చేసిన అనుభవం మనకున్నది. 1970 ప్రాంతంలో బంగ్లాదేశ్‌ యుద్ధ సమయంలో ఇందిరాగాంధీని వాజపేయి దుర్గామాత అని కొనియాడారు. అలాంటి స్ఫూర్తి ఇ ప్పుడు కావాలి. దేశమంతా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి అండగా నిలువాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం, తెలంగాణ ప్రజలు ఈ సమయంలో దేశ ప్రధానికి అండగా ఉంటారు’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 

కరోనాతో చైనాకు అపఖ్యాతి 

‘కరోనా వైరస్‌కు చైనాయే కారణమనే అపఖ్యాతి వచ్చింది. ఆ దేశంనుంచి చాలా బహుళజాతి సంస్థలు బయటకు వస్తున్నాయి. అవి భారత్‌వైపు చూస్తున్నాయి. పెట్టుబడులకు భారతదేశం అత్యుత్తమమైనదని ప్రపంచవ్యాప్తంగా భావిస్తున్నారు. ప్రపంచబ్యాంకు రిపోర్టు ప్రకారం భారతదేశం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో 142వ స్థానం నుంచి 63వ స్థానానికి ఎగబాకింది. దేశంలో ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ పాలసీలు బాగా అమలవుతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బాగా పెరుగుతున్నాయి. 2014 నుంచి 2017 వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 36 బిలియన్‌ డాలర్ల నుంచి 61 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. చైనా నుంచి తీసుకొచ్చి.. తెలంగాణలో తమ కంపెనీలు పెట్టడానికి చాలామంది ముందుకొస్తున్నారు. ఇదంతా చైనాకు నచ్చడం లేదు’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

వస్తువులను మనమే తయారుచేయాలి

‘చైనానుంచి వస్తువుల దిగుమతి ఆపాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది తొందరపాటు చర్య అవుతుంది. ప్రస్తుతం దిగుమతవుతున్న వస్తువులు మన దేశంలోనే తయారుకావాలి. ప్రజలకు సరసమైన ధరల్లో అవి దొరకాలి. ముందుగా మనం ఈ విషయాలపై దృష్టిపెట్టాలి’ అని కేసీఆర్‌ సూచించారు. 

మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం 

‘చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు వద్దు. అదే సమయంలో ఎవరికీ తలవంచొద్దు. రక్షణ వ్యవహారాల్లో మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటుచేసుకోవాలి. బ్రిటన్‌ ప్రతిపాదించిన డీ 10 గ్రూపులో కలువాలి. ఓరాన్‌ అలయెన్సులో చేరాలి. హువాయ్‌ కంపెనీ ఎత్తుగడను తిప్పికొట్టాలి. మనం వ్యూహాత్మకంగా వ్యవహరించాలి’ అని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

భారత సుస్థిరాభివృద్ధిని ఓర్వని చైనా

‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ (స్వయం సమృద్ధ భారతదేశం) కావాలని మనం కోరుకుంటున్నాం. కానీ చైనా మాత్రం అన్యనిర్భర్‌ భారత్‌ (ఇతరులపై ఆధారపడే భారతదేశం) కావాలని ఆకాంక్షిస్తున్నది. మన దేశం ఎదగడం చైనాకు ఇష్టంలేదు. భారత్‌ ఆర్థికంగా ప్రబలశక్తిగా మారుతున్నది. అమెరికాది 21 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ఆర్థికశక్తి అయితే, చైనా 14 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్ల సంపదతో రెండోస్థానంలో ఉన్నది. జపాన్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల సంపద కలిగిఉండగా, భారత్‌ కూడా 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థ దిశగా అడుగులు వేయడం చైనా భరించలేకపోతున్నది. భారత్‌లో సుస్థిరమైన ప్రభుత్వం, స్థిరంగా ఆర్థికాభివృద్ధి జరుగడాన్ని చైనా ఓర్వలేకపోతున్నది. అందుకే గొడవలు సృష్టిస్తున్నది’ అని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

‘కరోనా వైరస్‌కు చైనాయే కారణమనే అపఖ్యాతి వచ్చింది. ఆ దేశంనుంచి చాలా బహుళజాతి సంస్థలు బయటకు వస్తున్నాయి. అవి భారత్‌వైపు చూస్తున్నాయి. పెట్టుబడులకు భారత్‌ అత్యుత్తమమని ప్రపంచ వ్యాప్తంగా భావిస్తున్నారు. చైనా నుంచి తీసుకొచ్చి.. తెలంగాణలో తమ కంపెనీలు పెట్టడానికి చాలామంది ముందుకొస్తున్నారు. ఇదంతా చైనాకు నచ్చడం లేదు. 

- సీఎం కేసీఆర్‌ 

‘మనది శాంతికాముక దేశం. అదే సమయంలో సహనానికీ హద్దు ఉంటుంది. ఎవరైనా మన మీదికి వస్తే తీవ్రంగా ప్రతిఘటించాలి. దేశ రక్షణ, ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దు. ఈ పరిస్థితుల్లో రాజకీయం అవసరంలేదు. రణనీతి కావాలి. దేశమంతా ఒక్కతాటిపై నిలబడాల్సిన సమయం ఇది. గతంలోనూ ఇతర దేశాలతో ఘర్షణలు, యుద్ధాలు జరిగినప్పుడు ఇలాగే నిలబడిన సందర్భాలున్నాయి. 

- ముఖ్యమంత్రి కేసీఆర్‌


logo